యూనిట్

పొట్టేలు తెలివి

ఒక మేకకు పొట్టేలుకూ స్నేహం కుదిరింది. ‘‘గ్రామాల్లో కావలసినంత ఆహారం దొరకడం లేదు, పైగా ప్రతి మనిషీ తమ చేత చాకిరీ చేయిస్తున్నారు. కొద్ది రోజులకు వండుకు తింటారు’’ అనుకున్నవి అవి. అందుకే ఊరు వదిలేసి అడవి వైపు నడుస్తున్నాయి. అక్కడ చీకటి పడుతుండగా వాటికి దారి అర్థం కాలేదు. ఎటు వెళ్ళాలో తెలీక తిరుగుతోంటే ఒక పెద్ద తోడేలు తల కనిపించింది. దాన్ని తట్టుకుని కిందపడి లేచాయి. ‘‘దాన్ని తీసి సంచీలో వెయ్‍’’ అన్నది పొట్టేలు. ‘‘నాకు భయం’’ నీవే వెయ్యి అంది మేక. సరేనని పొట్టేలు తోడేలు తలని తీసి సంచిలో వేసి దాన్ని మేక భుజాన్న తగిలించింది. ‘‘అసలు ఈ తల దేనికి?’’ అంది మేక. ‘‘ఏమో, ఎందుకైనా పనికొస్తుందేమో పద’’ అని చెప్పింది పొట్టేలు. రెండూ అలా నడుస్తుండగా బాగా చీకటి పడింది. చలి పెరిగింది. దూరంగా ఎవరో చలిమంట వేసి చలి కాచుకుంటున్నారు. అది చూసి ‘‘అక్కడ మనం కూడా చలి కాచుకుందాం. ఆ మంటల వల్ల తోడేళ్ళ భయం వుండదు మనకు’’ అని చెప్పింది పొట్టేలు. రెండూ ఆ చలిమంట దగ్గరకు వెళ్ళాయి. అక్కడ రెండు మూడు తోడేళ్ళు బాగా తిని చలి కాచుకుంటున్నాయి. ‘‘ఇప్పుడేం చేద్దాం రా భగవంతుడా’’ అని వొణికిపోయింది మేక. ‘‘రండి, రండి, చలి కాచుకోండి. ఈ లోగా మేము మిమ్మల్ని మంటలో బాగా కాల్చుకుని తింటాం’’ అన్నది ఒక తోడేలు నవ్వుతూ. ఆ నవ్వుకి మేకకి భయం పట్టుకుంది. కానీ పొట్టేలు కొంచెం ధైర్యం తెచ్చుకుంది. ‘‘మరేం ఫరవాలేదు. మీరు ఇక్కడే వుండండి - రేపు ఉదయం మిమ్మల్ని కాల్చుకుని మేమే తింటాం’’ అన్నది పొట్టేలు. ‘‘ఓహో - ఏంటా ధైర్యం?’’ అన్నది ఒక తోడేలు. ‘‘మరేం లేదు. ఇప్పుడే కడుపునిండా నాలుగు తోడేళ్ళని తినేశాం ఇద్దరం - అందుకని ఈ రాత్రికి మిమ్మల్ని తినం. మరి మేం తిన్న తోడేలు తలలు చూస్తారా?’’ అనడిగింది పొట్టేలు భయం బయట పడకుండా. తోడేళ్ళకి కొంచెం భయం వేసింది - పొట్టేలు ధైర్యం చూసి - ఐనా ఒక తోడేలు అంది. ‘‘ఏవీ తలలు చూపించు’’ అని. ‘‘ఓయ్‍ - నీ సంచిలోంచి ముందు పెద్ద తల తీసి చూపెట్టు’’ అంది పొట్టేలు. మేకకి తోడేలు ఉపాయం అర్థమైంది. సంచిలో చెయ్యి పెట్టి తీసి ‘‘ఇదా?’’ అని తోడేలు తల చూపెట్టింది. ‘‘అబ్బే కాదు- ఇంకా పెద్దది తియ్‍’’ అన్నది పొట్టేలు - మేక ఆ తలని సంచిలో పెట్టి మళ్ళీ దాన్నే పైకి తీసింది. ‘‘ఇదా’’ ‘‘కాదు - ఇంకా పెద్దది’’ అన్నది. ఆ మాటలు వింటూ తోడేలు తల చూసి వెంటనే ఆ తోడేళ్ళన్నీ ఒకటే పరుగు లంకించుకున్నాయి. మేక, పొట్టేలు హాయిగా ఆ రాత్రి అక్కడ పడుకున్నాయి. అడవి కన్నా గ్రామమే నయం అని తెలుసుకున్నాయి. అందుకే పొద్దున్నే గ్రామం వైపు నడిచాయి అవి.

వార్తావాహిని