యూనిట్

పిచికల మేలు

ఒక ఊరి చివర పంట పొలాల దగ్గర రెండు గుడిసెలుండేవి. ఒక గుడిసె పక్కనే కొంచెం ఎండిపోయిన చెట్టు వుంది. దాని కొమ్మలు బాగా గుడిసె కప్పుమీద వాలిపోయి వున్నాయి. ఏ రోజు ఎండు కొమ్మలు విరుగుతాయో, గడ్డితో కప్పిన గుడిసె కూలుతుందో అని భయం పట్టుకుంది గుడిసెలోని ముసలి రైతుకి. ఆయనకు వున్న ఆధారం గుడిసె ఒక్కటే. ఒక రోజు గాలి బాగా వీస్తోంది. చెట్టు కూడా బాగా ఎండిపోయి వుంది. ఒక్క ఆకు కూడా లేకుండా రాలిపోయాయి కూడా. ఇక లాభం లేదుఅనుకుని గొడ్డలి తీసుకుని చెట్టు నరకడానికి ముసలిరైతు గుడిసె బయటికి వచ్చాడు. అప్పుడు గుడిసె కప్పుమీద, ఎండు చెట్టుమీద గూళ్ళు కట్టుకున్న రెండు పిచికలు వచ్చాయి. ‘‘ అయ్యా, చెట్టు నరకకండి, మా గూళ్ళు, గుడ్లు చితికిపోతాయి. కొన్ని రోజులు ఆగండి. ఈ చెట్టుకి మళ్ళీ ఆకులు, పూలూ, కాయలూ వస్తాయి. రుతువు మారుతోంది. చెట్టు చచ్చిపోయి లేదు - నరకకండి’’ అని ముసలి రైతుని బతిమాలాయి. ‘‘సరే, నా గుడిసె కూలిపోతే ఎలా?’’ అని అడిగాడు ముసలిరైతు. ‘‘నీ గుడిసె కూలనివ్వం.. నీవు గుడిసె నిలిపిన కర్రల్ని గట్టిగా వుండేలాగ చూస్కో మేము నీ గుడిసె మొత్తం గట్టిగా అల్లి పెడతాము’’ అన్నాయి. ‘‘సరే, అలాగే’’ అని గొడ్డలి తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోయాడు. ‘‘ఐనా రెండు పిచికలు గుడిసె మొత్తం ఎలా అల్లుతాయి?’’ అనే భయంతో ఆయన సరిగా నిద్రపోలేదు. ఆ మరునాడు పక్క గుడిసెలో గొడవ జరుగుతోంది. ఆ గుడిసె యజమానికి ఆకలి వేసింది. అందుకని ఆయన నిచ్చెన వేసుకుని పై కప్పు దగ్గరకు వంగి చూశాడు. అక్కడ రెండు కముజు పిట్టలు గూళ్ళు కట్టుకుని వున్నాయి. గుడిసె యజమాని ఆ రోజు ఉదయమే లేచి గుడ్లని కాజేసి వండుకుని తిన్నాడు. ఇప్పుడు ఆ గుడ్లు పెట్టిన కముజుల కోసం ప్రయత్నం చేశాడు. అవి అతని చేతికి అందకుండా ఎగురుతూ ఆయనతో దెబ్బలాడుతున్నాయి. ‘‘అన్యాయంగా మా గూళ్ళు తీసి పడేసి మా గుడ్లని తినేశావు’’ అని. ‘‘గుడ్లు సరే, ఇప్పుడు మిమ్మల్ని తింటాను’’ అన్నాడు చిన్న వల విసురుతూ. కానీ ఆ రెండు పిట్టలూ తప్పించుకుని ఎగిరిపోయాయి. అవతల దూరంగా వున్న చెట్టు తొర్రలో మళ్ళీ గుడ్లు పెడితే ఈ గుడిసె యజమాని మళ్ళీ వెళ్ళి చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి గుడ్లూ, ఎగరలేని రెండు బుజ్జి పిట్టల్ని తీసి వండుకుని తినేశాడు. ఇంక వీడి పని పట్టాలనుకున్నాయి కముజులు. అవి వెళ్ళి పిచికలతో జరిగిందంతా చెప్పాయి. ‘‘సరే, మీరు మాకు సహాయం చేస్తే మేము మీకు సాయం చేస్తాం’’ అని పిచికలు అన్నాయి. అన్నీ కలిసి సరేఅనుకున్నాయి. కముజులు, పిచికలూ కలిసి వాటి స్నేహితులయిన పిట్టలన్నిటిని సహాయం చేయమని పిలిచాయి. రెండు గుడిసెల్లో యజమానులు పొద్దున్నే పనిమీద బయటకు వెళ్ళి చీకటి పడుతుంటే వారి వారి గుడిసెలకు చేరుకున్నారు, ఆశ్చర్యపడ్డారు. రెండో గుడిసె యజమాని మాత్రం నెత్తి పట్టుకుని ఏడ్చాడు. ‘‘నాకు బుద్దొచ్చింది బాబోయ్‍’’ అనుకున్నాడు. ఎందుకంటే - బోలెడు పిట్టలు కముజులతో, పిచికలతో కలిసి రెండవ గుడిసె - అంటే కముజు గుడ్లు తినేసిన వాడి గుడిసె మీద చిన్న గడ్డిపోచ, రెల్లు కూడా లేకుండా, చిన్న పుల్లతో సహా అంతా ఊడబీకేశాయి. ఆ గడ్డి పుల్లలూ అన్నీ కలిపి రెండవ గుడిసె అంటే పిచిక గూళ్ళని, చెట్టునీ కాపాడిన ముసలి రైతు గుడిసె చక్కగా, బలంగా నిలిచేట్టుగా అల్లి పెట్టాయి. కొత్త గుడిసెలాగ తయారు చేశాయి. ముసలి రైతు సంతోషించాడు. కొద్ది రోజుల్లో ఎండిన చెట్టు పచ్చగా ఆకులతో, పూలతో, పిందెలతో కనిపించింది. ఆనాటి నుంచీ పిచిక గూళ్ళను ముసలి రైతు జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు.

వార్తావాహిని