యూనిట్
Flash News
ఓస్ రాక్షసుడే గదా!
ఒక
ఊళ్ళో ఒక అబ్బాయి వుండేవాడు. చాలా తెలివైన వాడు - ఎవరు ఏ పని చెప్పినా ‘‘ఓస్ అంతేగదా’’ అనేవాడు.
ఒక సారి ఒక రాక్షసుడు అడవిలోంచి వచ్చి ఊరి మీద పడ్డాడు. వాడిని దూరం నుంచీ చూసి
ఊళ్ళో అందరూ పారిపోయారు. కానీ తెలివైన అబ్బాయి ఆలస్యంగా నిద్ర లేసేసరికి రాక్షసుడు
ప్రతి ఇల్లూ వెదుకుతున్నాడు తినడానికి మనిషులు గాని,
ఏదైనా భోజనం గానీ దొరుకుతుందేమోనని. ఈ లోగా తెలివైన అబ్బాయి
కొన్ని మాడిపోయిన రొట్టెలు దగ్గర పెట్టుకున్నాడు -అవి అచ్చం రాళ్ళలాగ
కనిపిస్తున్నాయి. రాక్షసుడు అక్కడికి వచ్చాడు. ‘‘ఏయ్ అబ్బాయ్ ఏం చేస్తున్నావ్? నన్ను చూసి
భయపడటం లేదా ఏం?’’ అన్నాడు. ‘‘భయమా?
దేనికి?’’ అన్నాడు అబ్బాయి. ‘‘నేను రాక్షసుడిని నా అంత బలం నీ దగ్గర వుందా ఏం?’’ అన్నాడు రాక్షసుడు. ‘‘ఇదిగో చూద్దువు గాని నా
బలం’’ అంటూనే రాక్షసుడు చూడకుండా పక్కనే పళ్ళెంలో వున్న
వాడి తాత కట్టుడు పళ్ళు తీసేడు... అవి నోట్లోంచి తీసినట్టు నడించాడు. రాక్షసుడికి
ఇదే అర్ధం కాలేదు. రాక్షసులకి తెలివితేటలుండవు గదా. అప్పుడు ఒక చెట్టు కొమ్మ దగ్గర
కెళ్ళి దాని మీద కట్టుడు పళ్ళు పెట్టి రుద్దాడు బలంగా. ‘‘అదేంటి
పళ్ళు నోట్లోంచి తీసింది కాక వాటిని కొమ్మకేసి రుద్దుతున్నావ్?’’ అన్నాడు రాక్షసుడు ‘‘నాకు అలవాటే - రోజూ
పళ్ళని చెట్లతో తోముకుంటాను’’ అన్నాడు అబ్బాయి. మనసులో భయపడుతూనే
వున్నాడు. రాక్షసుడు మొదటిసారి భయపడ్డాడు. అప్పుడు
తెలివైన అబ్బాయి అక్కడ రాళ్ళలాగ కనిపిస్తున్న రొట్టెల్ని కరకరా తినేశాడు. ‘‘అదేంటి రాళ్ళని తింటున్నావ్? పైగా నీ నోట్లో ఇంకో జత పళ్ళు వున్నాయేంటి’’ అన్నాడు
రాక్షసుడు. ‘‘అవును నాకు రెండేసి జతల పళ్ళుంటాయి. ఇందాకా
తోమినవి కాక చూసేవా నా నోటిలో పళ్ళు - ఇంక రాళ్ళు తినడం నాకు ఇష్టం’’ అన్నాడు ధైర్యం నటిస్తూ. రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అది చూసి తెలివైన
అబ్బాయికి ఇంకో ఆలోచన వచ్చింది. ‘‘నువ్వు బలవంతుడివైతే నే
చెప్పిట్టు నడవాలి. సరేనా?’’ ‘‘ఆ నడుస్తా - కానీ అలా
నడిచేకా నిన్ను మింగి తినటం ఖాయం’’ అన్నాడు రాక్షసుడు. ‘సరే చూద్దాం’ అంటూ అక్కడ తను ఆటలో
గెలుచుకున్నా బోలెడు గోళీలు చక్కగా పరిచాడు. ‘‘వీటి మీద
నడు’’ అన్నాడు. ‘‘ఓస్ అంతేనా?’’
అంటూ గోళీల మీద తన పెద్ద శరీరంతో నడవబోయాడు. గోళీలు కదిలి,వాడి కాళ్ళు జారి, అంత పెద్ద శరీరం అమాంతం
ధబేల్‍మని కిందపడ్డాడు. దాంతో వాడి తల అక్కడున్న పెద్ద నీళ్ళ తొట్టిలో పడింది. అది
రాతి తొట్టి. అంతే వాడి నెత్తి మీద రెండు కొమ్ములు విరిగిపోయాయి. వాడికి తల తిరిగి లేవడానికి ప్రయత్నించి మళ్ళీ
పడ్డాడు - ఈ లోగా వాడి విరిగిన కొమ్ములు తెలివైన అబ్బాయి తీసుకున్నాడు. ‘‘ఇదిగో నీ తల మీద కొమ్ములు కోసి తీసేసుకున్నాను - నీ
నాలుక కూడా కోసేస్తా వుండు’’ అన్నాడు
అబ్బాయి. ‘‘ఏదీ కత్తి’’ అంటూ
రాక్షసుడికి కనబడకుండా పరిగెత్తాడు అబ్బాయి. ‘‘హార్ని,
తల కొమ్ములు కోసేడు, నాలుక కూడా కోయగలడా’’
అని ఆశ్చర్యపడి వాడు మెల్లిగా లేచి అబ్బాయికి కనబడకుండా
పారిపోయాడు - ఆరోజు నుంచి రాక్షసుడు ఆ ఊరి వైపు రావడం మానేశాడు. తెలివైన అబ్బాయి ‘హామ్మయ్యా’ అనుకున్నాడు. భయపడి కూర్చుంటే ఏ
పని చేయలేమని అబ్బాయి గ్రహించాడు.