యూనిట్

మేలు మరచితే…

మేలు మరచితే... పూర్వం ఒక వేటగాడికి వేటాడటం మీ విసుగు పుట్టింది. అందుకని అడవి చివరి భాగంలో కొంచెం నేలమీద చిన్నచిన్న చెట్లు, రాళ్ళు తీసేసి చిన్న విత్తనాలు నాటి పంట వేద్దామనుకున్నాడు. వేటాడటంకంటే ఇదే నయం అనుకున్నాడు. అక్కడ అడవిలో దారి తప్పి ఒక చెట్టు కింద నిద్రపోతున్న రెండు ఎడ్లని కట్టేసి లేపి, నేల దున్నించాడు. అలవాటు లేనిపని గదా బాగా అలిసి నిద్రపోయాడు. ఐతే అతను చెట్టు కింద నిద్రపోతున్న సమయంలో ఎడ్లు ఎలాగో తప్పించుకొని కొండల్లోకి వెళ్ళిపోయాయి. వేటగాడు ఎడ్లని వెదుకుతూ కొండల్లోకి వెళ్ళాడు. అవి ఎక్కడా కనిపించలేదు. అక్కడ దారి తప్పాడు. ఆకలి వేసింది. తినడానికి ఏదైనా పండు దొరుకుతుందేమోనని చూశారు. అక్కడొక పెద్ద అత్తిచెట్టు కనిపించింది. చెట్టు ఎక్కి కాయలు తింటున్నాడు. ఇంతలో వేటగాడికి కాలుజారి ఆ చెట్టు కింద వున్న పెద్ద గోతిలో పడ్డాడు. ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోయాడు. అప్పుడు ఒక కోతి చెట్టుమీద నుంచీ వేటగాడి పరిస్థితి చూసింది. జాలిపడింది. వెంటనే ‘‘భయపడకు. నేను సాయం చేస్తా’’ అంటూ వెళ్ళి అక్కడ అడవిలో నేలమీద పడివున్న పెద్ద వెదురు బొంగును దొర్లిస్తూ తెచ్చి గోతిలోకి తోసింది. ఆ వెదురు బొంగు సాయంతో మెల్లిగా పైకి ఎక్కి వేటగాడు బయట పడ్డాడు. పాపం అతను బాగా ఆకలిగా వున్నాడని గ్రహించిన ఆ కోతి కొన్ని పండ్లని చెట్టు నుంచి రాల్చింది. వేటగాడు వాటిని తిన్నాడు. అడవి నుంచీ, కొండల నుంచీ బయటపడి పొలం వున్న చోటికి దారి చూపిస్తానని కోతి చెప్పింది. అతను కోతిని చూస్తు నడుస్తున్నాడు. అది చెట్లమీద, నేలమీద కూడా నడుస్తూ దారి చూపిస్తోంది. చివరికి దారితప్పిన వేటగాడు తను బయలుదేరిన చోటికి చేరుకోగలిగాడు. అతనికి దారి చూపెట్టి అలసిపోయిన కోతి దగ్గరలోని నీటి గుంటలో నీళ్ళు తాగుతోంది. అప్పుడు వేటగాడు ఆలోచించాడు. రాత్రికి తినడానికి ఏమీ లేదు. ఈ కోతి చాలు వండితింటే అని అనుకుని ఒక కర్ర తీసుకుని కోతిని గట్టిగా కొట్టాడు. అది పడిపోయింది. అమ్మయ్యాఅని కోతి తోక పట్టుకుని లాగుతూ వెనక్కి చూశాడు. హడలిపోయాడు, ఎందుకంటే అక్కడొక పులి అతనికేసి గుర్రుమంటూ చూసింది. ఒక్కసారిగా వేటగాడి మీదకు దూకింది. పంజాతో గట్టిగా ఒక్కటి కొట్టింది. వేటగాడు ఆ దెబ్బకి కింద పడిపోయాడు. కోతిని పులి తీసుకుని పారిపోయింది .వేటగాడిని ఆ దారిన పోతున్న కొందరు లేవదీసి, వైద్యం చేసి కాపాడారు. చేసిన మేలు మరచిపోయే వారికి ఇలాగే అవుతుందని వేటగాడు కోలుకున్న తరువాత తెలుసుకున్నాడు.

వార్తావాహిని