యూనిట్

కొంగసాయం

ఒక జాలరి- అంటే చేపలు పట్టేవాడు. ఒక రోజు చేపలు పట్టడానికి నది వొడ్డుకి వెళ్ళాడు. రోజూ లాగే వల వేశాడు. పొద్దున్న కూర్చున్నవాడు సాయంత్రం చీకటి పడేవరకు అలాగే వున్నాడు. గేలం వదల్లేదు, ఒక్క చేప పడలేదు. మరునాడూ అలాగే జరిగింది. ఇంకో రోజూ అలాగే అయింది. ఎందుకిలా చేపలు పడటం లేదు చెప్మా, అనుకుని నది దగ్గరున్న చెట్టు ఎక్కి నదివైపు చూశాడు. దూరంగా కొంగలు విందు చేసుకుంటున్నాయి. ఒకటి రెండు కాదు - వందల కొంగలు. ఒక కొంగ కూతురి పెళ్ళి అట. పెళ్ళి సరదాలు అయ్యేకా కొంగలకి విందు జరిగింది. పెళ్ళికూతురు తల్లి కొంగ, తండ్రి కొంగ, తమ్ముడు, అన్న కొంగలు పేద్ద వల తెచ్చి నదిలో వేశారు. మొత్తం చేపలన్నీ అందులోనే చిక్కుకుపోయేయి - వాటిని వండుకుని కొంగలు విందు ఇచ్చాయి అన్నమాట. అప్పుడొక పెద్ద కొంగ ముక్కు నిండా, గొంతు నిండా పట్టినన్ని చేపలు పట్టుకుని జాలరి దగ్గరికి వచ్చింది. వాడిని చూసి వెక్కిరించింది. గొల్లున నవ్వింది. ‘‘నీకు ఒక్క చేప దొరకదు పో’’ అంది. వెంటనే, చటుక్కున కొంగ గొంతు పట్టుకున్నాడు. గొంతోలోనూ, ముక్కున గుచ్చిన చేపలూ అతని గిన్నెలో పడేసింది కొంగ. ‘‘ఇంకెప్పుడూ నాతో వేళాకోళం చేయకుమరి’’ అని వదిలేశాడు. ఆ రోజు నుంచీ కొంగలు చేపలు పట్టేవారిని వేళాకోళం చేయడం, వెక్కిరించడం మానేశాయి. ఇంకొక సారి ఏమయిందంటే.... జాలరి సముద్రంలో పడవ మీద నుంచీ పెద్ద వల విసిరాడు. బోలెడు చేపలు వలలో పడ్డాయి. చేపల కోసం వచ్చే కొంగలకి చాలా కోపం వచ్చింది. వీడి పని పట్టాలనుకున్నాయి. ఓ రోజు ఇలాగే బోలెడు చేపలు పట్టుకుపోతోంటే కొంగలు చూశాయి. అన్నీ కలుసుకుని ఉపాయం ఆలోచించాయి. అప్పుడవి ఒక్కసారిగా ఎగురుతూ వెళ్ళాయి. చేపలవాడు వల విదిల్చి చేపల్ని ఎండబెడుతోంటే కొంగలన్నీ వచ్చి ఒక్కో చేపను ముక్కుతో గుచ్చి చేపల వాడికి అందకుండా ఎగిరిపోయాయి. ఆ ప్రాంతం ఊళ్ళల్లో ఆ రోజు నుంచీ చేపలు పట్టేవారికి కొత్త ఆలోచన వచ్చింది. నీటి కొంగలకు, నీటి కాకులకు వీలయితే పెద్ద బాతులకు కాళ్ళు కట్టేసి తాడు పట్టుకుని తమ పడవలోంచి సముద్రంలోకి వదలటం మొదలుపెట్టారు. దొరికిన చేపలు పూర్తిగా మింగెయ్యకుండా కొంగలకు, బాతులకు మెడ చివర తాడు కట్టివుంచడంతో అవి చేపల్ని పట్టినా మింగలేవు. అన్ని పడవలో కక్కేవి. పనయిపోగానే మెడ పట్టీ తీసేసేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, ఊళ్ళల్లో బాతులకు, కొంగలకూ ఇదే పరిస్థితి.

వార్తావాహిని