యూనిట్
Flash News
తెలివంటే తెలివే
ఒకసారి అడవిలో పెద్దవేట జరిగింది. సింహాలు ఎన్నో జంతువులను వేటాడి చంపి తిన్నాయి. జంతువులన్ని వాటి దోవన అవి వెళ్ళిపోయాయి. అప్పుడొక సింహం నోట్లో తిన్న మాంసంలో ఎముక ఒకటి ఇరుక్కుపోయింది. దాని వల్ల సింహానికి చాలా నొప్పిగా వుంది. అరిచి కేకలు పెడుతోంది. అడవిలో సింహం దగ్గరకు ఎవరొస్తారు? కానీ, సింహం పక్కనే చిన్న మాంసం ముక్కపడి వుంది. అది ఒక చిన్న ఎలుక చూసింది. అది దైర్యం చేసి సింహం వెనుక నుండీ మాంసం ముక్క దగ్గరికొచ్చి పట్టుకోబోయింది. సింహం వేగంగా పంజాతో ఎలుకని పట్టేసింది. ఎలుక గజగజలాడింది. ‘‘వదిలెయ్యండి బాబూ చిన్న ముక్కకోసం ఆశ పడ్డాను’’ అంది ఎలుక. ‘‘సరే నీకు మాంసం ఇస్తా గానీ - నాకో సాయం చెయ్యాలి’’ అంది సింహం. ‘‘నేనా, మీకా,’’ అంది ఎలక భయంగా, ‘‘అవును నా కోరల్లో పెద్ద ఎముక ఒకటి ఇరుక్కుంది. దాన్ని కొరికి తిసేస్తే మాసం ముక్క ఇస్తా’’ అంది సింహం. సరేనని ఎలక సింహం నోట్లోకి వెళ్లింది. ఎముకను, గాయాన్ని చూసింది, బలంగా ఎముకని కొరికి బయటికి లాగింది. ‘అమ్మయ్యా’ అనుకుంది సింహం. ‘‘పూర్తిగా తీసేవా?’’ అని అడిగింది. ‘‘ఆ పూర్తిగా తీసేసేనండీ’’ అని ఎలక బయటికి రాబోయింది. సింహం సగం నోరు మూసి ‘‘నా నోట్లోకి వచ్చి నువ్వు మళ్ళీ బయట పడితే నా పరువు పోతుంది - నిన్ను నమలాల్సిందే- మింగాల్సిందే’’ అంది సింహం. సింహం బుద్ధి తెలిసిన ఎలుక వెంటనే ఆలస్యం చెయ్యకుండా, విరిగిన ఎముకను గట్టిగా అదే గాయం మీద గుచ్చింది. ‘హమ్మో’ అని సింహం పెద్దగా నోరు తెరిచింది. వెంటనే ఎలుక కిందకి దూకి పారిపోయింది. ఆనాటి నుంచీ సింహాలని ఎలుకలు నమ్మడం మానేశాయి.