యూనిట్
Flash News
పెద్దలకి తోడుగా…
పూర్వం - అంటే చాలా చాలా కాలం కిందట... గంగ, యమునా నదులు ప్రవహించే చోట పెద్ద అడవి వుండేది. ఇప్పుడున్న అడవికంటే పదింతలు పెద్దది. ఎన్నెన్నో జంతువులు, పక్షులు, పూల చెట్లు వుంటే చెప్పేదేముంది.. బోలెడు సందడి. పిట్టల అరుపులు, కూతలతో గాలి అలల్లా వీస్తుండేది. అందుకే అక్కడి చెట్లు, పండ్లు, కాయలు తింటూ అక్కడే వుండి పోవాలనుకుంటాయి పక్షులు. అడవి మనుషులూ అక్కడే ఇళ్లు కట్టుకుని వుంటారు. అక్కడ పారే నీళ్లుకూడా తియ్యగా చల్లగా వుంటాయి. అందుకని ఒక చిలుక తన కుటుంబంతో సహా అక్కడికి వచ్చింది. వెతికివెతికి ఓ పేద్ద మర్రిచెట్టు దగ్గరకొచ్చి మంచి తొర్ర ఒకటి చూసి అందులో కాపురం పెట్టింది. ఆ పెద్ద చెట్టు వయసు వందల సంవత్సరాలు.. ఎన్ని వందలో ఎవరికీ తెలియదు. ఆ చెట్టుకి తొర్రలు చాలానే వున్నాయి. అన్ని తొర్రల్లో రకరకాల పక్షులు వుంటున్నాయి. చిలకలు పెద్దవయి అవి గుడ్లు పెట్టి చిట్టి చిలుకలు పెరిగే సరికి ఒక పెద్ద చిలకల సంతానంతో చెట్టంతా గలగలలాడింది. ఒకసారి పేద్దగాలి వచ్చింది.. తుఫాను.. ఆ గాలికి చెట్టు కూలిపోతుందేమోనని అన్ని తొర్రల్లో పిట్టలు భయపడ్డాయి. రాత్రంతా వర్షం, గాలి.. ఉదయం కాగానే గాలి, వర్షం ఆగింది. అప్పుడు అన్ని పిట్టలూ వేరే చెట్లు వెతుకుతూ వెళ్లిపోయాయి. ఒక్క చిలుక కుటుంబం మాత్రం అక్కడే వుండి పోయింది. అప్పుడు ముసలి చెట్టు చిలకలతో మాట్లాడింది. ‘‘మీరు కూడా నన్ను వొదిలేసి వెళ్లిపోతే నాకేం తోచదు.. వెళ్లిపోకండి’’ అన్నది ‘‘నిన్ను వదలి వెళ్లం, ఎప్పటికీ ఇక్కడే వుంటాం’’ అన్నాయి చిలుకలు. కుటుంబంతో చిన్నా పెద్దా అన్నీ, సరే, వర్షాకాలం అయిపోయింది. ఈదురుగాలీ తగ్గింది. అందుకని వేటగాళ్లు వేటకి వచ్చారు. అడివంతా తిరిగారు. అప్పుడు ఒక వేటగాడు ఒక పెద్ద పందికోసం బాణాలు వేస్తున్నాడు. అదేమో తప్పించుకుంటోంది. చివరికి ఈ పెద్ద మర్రిచెట్టు చాటుకి వచ్చింది. వేటగాడి బాణం తప్పించుకుంది. ఐతే ఆ బాణం మర్రిచెట్టుకి బలంగా గుచ్చుకుంది. ఆ బాణానికి విషం పూసివుంది. అందుకే చెట్టుకి చాలా బాధ కలిగింది. చిగుర్లు, చిన్నకొమ్మలు, ఆకులూ నల్లగా మాడిపోయాయి. మంటల్లో కాలినట్టు.. చెట్టు భయపడింది. కానీ రామ చిలుకలు చెట్టుకి ధైర్యం చెప్పాయి. ఆ సమయంలో అక్కడికి ఇంద్రుడు వచ్చాడు.. చిలుకల్ని పలకరించి.. ‘‘ఈ చెట్టుకి విషం పట్టుకుంది. ఎప్పుడు కూలుతుందో చెప్పలేం’’ ‘‘మీరంతా వేరేచోటుకి వెళ్లిపోండి’’ అని అన్నాడు. ‘‘పాపం ఎంతో కాలంగా మమ్మల్ని కాపాడుతోంది. తల్లిలాంటి ఈ చెట్టుని వదిలిపోం’’ అన్నది పెద్ద చిలక. ‘‘పెద్దదయి వంటరిగా వున్న ఈ చెట్టు కూలుతుంది. ఈ చెట్టుతో ఇంకేం పని? వెళ్లిపోండి.. నామాట వినండి’’ అని అన్నాడు ఇంద్రుడు. ‘‘అమ్మా నాన్న పెద్దవాళ్లయి పోయారుగదా అని వదిలిపోతామా? ఇప్పుడే వాళ్లకి తోడుగా వుండాలి. అప్పుడే తల్లిదండ్రులు ధైర్యంగా వుంటారు. అందుకని ఈ చెట్టుని వదలం.. ఇంక మీరు వెళ్ళండి’’ అని పెద్ద చిలుక ఇంద్రుడితో అన్నది. చెట్టుని తల్లితో సమానంగా చూస్తున్నందుకు, చెట్టుకి తోడుగా వుంటామన్నందుకూ ఇంద్రుడు చాలా సంతోషించాడు. చెట్టుకి విషం పట్టకుండా దీవించాడు. చిలుకల్ని దీవించి వెళ్లిపోయాడు. ఆనాటి నుంచీ మళ్లీ చెట్టంతా పచ్చని ఆకులతో, కొమ్మలతో చక్కగా నిలిచింది. మళ్లీ ఎన్నో పిట్టలు వచ్చి చేరాయి. ఇంట్లో మన వాళ్లందరూ వచ్చి చేరినట్లు గలగలలాడింది. చిలుకలూ, చెట్టూ హాయిగా వున్నాయి. (ఈ కథ మహా భారతంలోనిది)