యూనిట్
Flash News
ఉన్నచోటే నయం
ఒక అడవిలో ఒక పేద్ద మర్రిచెట్టు ఉంది. దానిమీద ఒక పిల్లి, ముంగిస, ఎలుక, గుడ్లగూబ వుంటున్నాయి. నాలుగూ చెట్టు మీద నాలుగు చోట్ల వుంటున్నాయి. పిల్లికి ఎలాగయినా ఎలుకను పట్టాలని వుండేది. దొరకకుండా అదే చెట్టు దగ్గర ఉంటూనే జాగ్రత్త పడింది. అక్కడ చెట్టుకి దగ్గరగా ఒక రైతు కందుల పంట వేశాడు. ఆ పంట కోసం నాలుగు జంతువులూ వీలయినంత తినాలని ఎదురు చూస్తున్నాయి. ఐతే, ఒక వేటగాడు ముందు పిల్లిని పట్టాలని సమయం చూసి చేనుమీద వలపన్నాడు. ఎలాగయినా ఎలుకని పట్టాలన్న తొందరలో పిల్లి కందుల పంట పొలంలోకి దూకింది. వెంటే అక్కడ వేసిన వలలోకి చిక్కుకుపోయింది. ఎలుక ‘‘అమ్మయ్యా, పిల్లి తిక్క కుదిరింది’’ అని అనుకుంది. గండుపిల్లి బెడద తీరింది గనుక ధైర్యంగా బయటికి వచ్చి ఎలుకను పట్టుకుపోదామని ముంగిస, గుడ్లగూబా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎలుకకు పెద్ద చిక్కువచ్చి పడింది. ముంగిస, గుడ్లగూబకు భయపడి పిల్లి దగ్గరకు వెడితే, అంది మింగేస్తుందేమో అన్న భయం వేసినా ఎలుక పిల్లి దగ్గరకొచ్చి ‘‘అయ్యా, మిమ్మల్ని వల కొరికి రక్షిస్తాను. కానీ మీరు నన్ను ముంగిస, గుడ్లగూబల నుంచీ రక్షించాలి’’ అంది. ‘‘అలాగే- నిన్ను కాపాడుతా’’ అన్నది పిల్లి. వలమీదనే పిల్లికి కొంచెం దగ్గరగా వచ్చి ఎలుక కూర్చుంది - ఎలుకకోసం దూరంగా ముంగిస, గుడ్లగూబ కాచుకుని వున్నాయి. రాత్రి గడిచి తెల్లారితే వేటగాడు, వచ్చి వలతీసి తనని పట్టుకుపోతాడని దిగులు పడింది పిల్లి. ఎలుక ఎంతసేపు గడిచినా వల కొరకడం లేదు. ఇప్పుడెలా అని భయపడుతూనే ఇంకొక ఆలోచన చేసింది. వల కొరకగానే ఎలుకను మింగేస్తే ఆకలి తీరుతుంది. ఆ తరువాత ముంగిస, గుడ్లగూబ సంగతి చూడవచ్చనుకుంది. అందరి నుంచీ ఒకేసారి తప్పించుకోవడానికి ఎలుక ఉపాయం పన్నింది. అందుకే తెల్లవారిందాకా వల కొరకలేదు. తెల్లవారిన తరువాత వేటగాడు దూరంగా రావడం గమనించింది ఎలుక. వెంటనే వల కొరికి పడేసి, కలుగులోకి దూరి పోయింది ఎలుక - పిల్లి బయటపడటం చూసి ముంగిస పారిపోయింది. ఇక లాభం లేదనుకుని గుడ్లగూబ ఎగిరిపోయింది. వేటగాడు తమని కూడా పట్టుకుంటాడని వాటి భయం. ఆ విధంగా ఒకరినొకరు తప్పించుకుని పోయాయి. వేటగాడి నుంచీ తప్పించుకున్నందుకు పిల్లి సంతోషించింది. కానీ ఎలుక ఆహారంగా దొరకలేదని దిగులు పడింది పిల్లి. అప్పుడు పిల్లి ఒక ఉపాయం పన్నింది. చెట్టు తొర్రలోంచి బయటి కలుగు దగ్గరకొచ్చింది పిల్లి. ఎలుకను పిలిచింది. ‘‘నాకు ఇంత సహాయం చేసి, రక్షించినందుకు నీకు విందు ఇవ్వాలని వుంది. ఒకసారి బయటికి వస్తావా’’ అని మర్యాద నటిస్తూ పిల్లి పిలిచింది. ‘‘అయ్యా నేను చేసిన సాయం చాలు. నేనేం తెలివి తక్కువదాన్నా? కలుగు బయటికొస్తే నువ్వు నన్ను తింటావు. ఎక్కడ వాళ్ళు అక్కడ వుంటేనే క్షేమం’’ అని ఎలుక అన్నది. పిల్లికి ఇప్పటికీ బుద్ధి రాలేదు మరి.