యూనిట్

తొందరపాటు

కృష్ణాపురం అంటే అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ఊరు మంచిది, మనుషులందరూ మంచివాళ్ళు. అందుకని వ్యాపారం బాగా వుండి అందరికీ చాలా డబ్బు వస్తోంది. అందుకే ఊరు పెరిగి కొన్నాళ్ళకి ఇంకా పెద్దదయింది. అప్పటినుంచి ఆ ఊరికి కష్టం వచ్చిపడింది. ఎలాగంటే ఊరు పెరగడం వల్ల ఇళ్ళు, భవనాలు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. కొత్తగా రహదారులు వేస్తున్నారు, వంతెనలు కడుతున్నారు. కాబట్టి ఆ ఊరి చివర వుండే పంటపొలాలు తగ్గిపోయి అక్కడ కూడా ఇళ్ళు కట్టేస్తున్నారు. అందువల్ల తినడానికి అందరికీ కావలసిన బియ్యం, పప్పులు, కాయలు, పళ్ళు- ఇలాంటివి ఊళ్ళోకి రావడం తగ్గింది. మరి ఊరి చివర పంట పొలాలకు దగ్గరగా పెద్ద అడవి వుంది. అందులో పులి, సింహం, ఎలుగుబంటి, జింకలు అన్నీ వున్నాయి. అలాంటి అడవి తగ్గిపోతోంది.ఇళ్ళు చాలడం లేదు. ఎక్కడెక్కడినుంచో జనం బళ్ళమీద వచ్చి ఇక్కడ చేరుతున్నారు హాయిగా వుండవచ్చని. మరి ''ఇళ్ళు చాలడం లేదు ఎలాగ?'' అని ఊరి పెద్దలు రాజుగారిని కలిసి అడిగారు.  ఏం చేయాలి మరి? 'అడవులు నరికేయండి. అంటే చెట్లు కొట్టెయ్యండి. అప్పుడు ఇళ్ళు కట్టడానికి చాలా స్థలం, చోటు దొరుకుతుంది గదా. అంతేకాదు - ఇళ్ళు కట్టడానికి కొయ్య, చెక్క అవసరం కదా. చెట్లు కొట్టేస్తే బోలెడు కొయ్య దొరుకుతుంది', అని రాజుగారు అన్నారు.  'సరే'నని ఊరిజనం, ఇళ్ళు కట్టేవాళ్ళు అంతా కలిసి గొడ్డళ్ళు, రంపాలు తీసుకుని అడవికి వెళ్ళారు - చాలా చెట్లు నరికేశారు. చెట్ల కొమ్మల్ని,  కొయ్య ముక్కలనీ తాళ్ళు కట్టి లాగుతూ ఊళ్ళోకి తెచ్చారు.కొద్దిరోజుల్లో మరిన్ని ఇళ్ళు కట్టడం మొదలయింది. జనం చెట్లతోపాటు జింకల్నీ, లేళ్ళనీ ఎన్నెన్నో తోలుకుపోయారు మరి పులి, సింహం, ఎలుగుబంటి లాంటి పెద్ద పెద్ద జంతువులు ఎలా? వాటి ఆహారం-అంటే జింకలూ అవీ లేవు గదా! అందుకని పెద్ద జంతువులు మెల్లగా ఊళ్ళోకి వస్తున్నాయి. ఊళ్ళో వున్న కోళ్ళు, కుక్కలూ, ఆవులు, గేదెలు, దూడలు, ఎద్దుల మీదికి వచ్చి పడుతున్నాయి.అదీరాత్రి పూట.!  ఇంకొన్ని రోజులకు పులి, సింహం లాంటివి పగలే ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి. ఊళ్ళో పిల్లలు, పెద్దవాళ్ళు హడలిపోయారు. ఊరి పెద్దలు వెళ్ళి రాజుగారికి చెప్పారు 'మా ప్రాణాలు కాపాడండీ' అని.  రాజుగారికి ఏమీ తోచలేదు. అప్పుడు మంత్రి గారు మంచి సలహా చెప్పారు ఊరి ప్రజలకు. ఆ రోజు నుంచీ ఊళ్ళో జనం - చిన్న, పెద్ద చెట్లు నాటి అడవి పెద్దదిగా చేసే పని మొదలు పెట్టారు.చెట్లకి నీళ్ళు పోసి పెంచారు. జింకలు, లేళ్ళ వంటివి తెచ్చి ఆ అడవిలో విడిచిపెట్టడం మొదలయింది. కొన్నాళ్ళకి అడవిలో చిన్న జంతువులు పెరిగాయి. పులి, సింహాల వంటివి ఊళ్ళోకి రావటం మానుకున్నాయి. ఆ ఊరు మరీ పెద్దదిగా పెరగడం ఆగిపోయి, దూరంగా చిన్న ఊళ్ళు కొంచెం పెద్ద కావటం మొదలయిందన్న మాట. ఊరిజనం, రాజుగారు 'అమ్మయ్యా' అనుకున్నారు. పెద్ద మంత్రి  మంచి సలహా చెప్పాడని మెచ్చుకున్నారు. 

--  తల్లావఝుల శివాజి

వార్తావాహిని