యూనిట్
Flash News
పేరాశ
ఆశపడితే
తప్పులేదు - మితిమీరి, మరీ
ఎక్కువ ఆశ - పేరాశ పడితేనే చిక్కు - అన్నారు తాతయ్య. మనవలు తాత కథ మొదలు పెడతాడని
జాగ్రత్తగా వింటున్నారు. కానీ తాతయ్య నిద్రబోయేట్టున్నాడు. అందుకని, కథ చెప్పి మరీ పడుకోమన్నారు మనవలు. సరేనని ఆయన మొదలుపెట్టాడు. పెద్ద
అడవిలో చిన్న తొండ, ఒక వడ్రంగి పిట్ట స్నేహంగా వుండేవి.
ఒకే చెట్టు మీద రెండూ తిరిగేటప్పుడు వాటికి స్నేహం కుదిరింది. తొండ చెట్టు మీద
పాకే చిన్నచిన్న పురుగుల్ని పట్టి భోజనం చేసేది. వడ్రంగి పిట్ట పద్ధతి వేరు. అది
దర్జాగా చెట్టు మీద వాలి, ఇంటి తలుపు తట్టినట్టు టపటప
చెట్టు బెరడు మీద ముక్కుతో కొడుతుంది. అప్పుడు లోపల దాక్కుని వున్న పురుగులు
బయటికి వస్తాయి. వాటిని వెంటనే పట్టి తినేస్తుంది. వడ్రంగి పిట్ట అలా పురుగుల్ని
పట్టి తినడం తొండకి నచ్చింది. ‘‘నేనూ నీలాగే బెరడు మీద నా
కాలితో కొట్టి పురుగుల్ని బయటికి రప్పించి తింటా - ఎలా వుంది నా ఆలోచన?’’ అని అడిగింది. అప్పుడు వడ్రంగి పిట్ట నవ్వింది. ‘‘నువ్వు తలుపు కొట్టినట్టు కొడితే ఎవరూ పలకరు, కదలరు.
అలా తట్టడానికి, కొట్టడానికి చాలా రోజుల అలవాటు వుండాలి.
నీకు అది రాదు’’ అని చెప్పింది. అందువల్ల తొండకి కోపం
వచ్చింది. నేను రోజు నీలాగే చెట్టు మీద చేతితో కొట్టడం నేర్చుకుని, బాగా వచ్చేకా నువ్వు చేసినట్టే చేస్తానన్నది. ‘అది నీ వల్ల కాదు - నాకు గట్టి ముక్కు వుంది. నీకు లేదు’ అంది వడ్రంగి పిట్ట. ‘‘నాకు గట్టి చెయ్యి,
దానికి గట్టి గోళ్ళున్నాయి. అవి చాలు’’ అంది
తొండ. ‘‘ఇక నీకు చెప్పడం నా వల్ల కాదు. నీ యిష్టం
వచ్చినట్టు చేసుకో’’ అని చెప్పి వడ్రంగి అక్కడి నుంచీ
ఎగిరిపోయింది. తొండకి పట్టుదల పెరిగింది. రెండు రోజులు చేతులు నొప్పి పుట్టేవరకు
చెట్టుమీద కొట్టడం అలవాటు చేసుకుంది. ఐనా ఒక్క పురుగు కూడా చెట్టు బెరడు దాటి
బయటకు రాలేదు. దాంతో ఇంకా కోపం పెరిగింది. గబగబా చెట్టు పైకి పాకింది. అక్కడ చిన్న
తొర్ర కనిపించింది. తొర్ర దగ్గర చేత్తో కొడితే ఏ చిన్న పిట్టయినా, పురుగయినా బయటికి రాకపోదు - అనుకుని గట్టిగా తొర్ర చుట్టూ చేత్తో
గట్టిగా చరిచింది. అప్పుడు పిట్ట గుడ్లు ఏమైనా వుంటే వాటిని మింగుదామని ఒక పాము ఆ
తొర్రలోనే వుంది. చప్పుడు విని ఆ పాము తొర్ర బయటికి సర్రుమని వచ్చింది. ఎదురుగా
తొంగి చూస్తున్న తొండను వెంటనే నోటితో పట్టేసింది. తప్పించుకునేలోపే పాము తొండను
నోటితో పట్టుకుని చుట్టుకుంటోంది. అది చూసిన వడ్రంగి పిట్ట స్నేహితుడిని
కాపాడాలనుకుంది. వెంటనే ఎరిగివచ్చి పాము పడగ మీద గట్టిగా తన ముక్కుతో పొడిచింది. ఆ
దెబ్బకి పాము వెంటనే నోరు తెరిచింది. ‘తప్పించుకో’
అని వడ్రంగి పిట్ట అరుస్తూ ఎగిరిపోయింది. తొండ వెంటనే పాము పట్టు
వదలగానే పారిపోయింది. దెబ్బతిన్న పాము జిలేబీ చుట్టలాగ చుట్టుకుని తొర్రలోపలికి
పడిపోయింది. తొండకి బుద్ధి వచ్చింది. అమ్మయ్యా! బతికిపోయా అని ఊపిరి తీసుకుంది.
అంతే కాదు ఇలా పేరాశకి పోనని వడ్రంగి పిట్టకి ఒట్టేసి చెప్పింది. అదీ కథ!