యూనిట్

స్నేహం ముఖ్యం

పూర్వం ఒక అడవి చివరన ఒక పెద్ద చెరువు వుండేది. దాని గట్టుమీద పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఆడ, మగ గద్దలు రెండు వుండేవి. చాలా రోజులు అవి ఒంటరిగా వున్నాయి. చివరికి కలిసి వుండటం నేర్చుకున్నాయి. ఆ తరువాత ''మన కష్ట సుఖాలు పంచుకోవడానికి స్నేహితులు వుండాలి. స్నేహం, స్నేహితులు లేని జీవితం గడపటం మంచిది కాదు'' అని గద్దలు అనుకున్నాయి. వాటికి ఒక రాబందు, సింహం, తాబేలు పరిచయమయ్యాయి. కొద్ది రోజులకే అవన్ని మంచి స్నేహితులుగా మారాయి. ఒకరంటే ఒకరికి గౌరవం, ఇష్టం. కొన్నాళ్ళకి గద్దలకు పిల్లలు కలిగాయి. చెట్టుమీద కొమ్మల మధ్య గూటిలో అవి కిచకిచమంటూ పెరిగాయి. 

ఒక రోజు వేటగాళ్లు వచ్చి ఆ చిన్న పిట్టల కోసం చెట్టు క్రింద మంట పెట్టి పెద్ద పొగవచ్చేట్టు చేశారు. అలాగే కాగడాలు - కర్రలకి నూనె గుడ్డలు కట్టి మంట పెట్టారు- వాటితో ఆ పెద్ద చెట్టు ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆడ గద్ద అదంతా చూసి సాయం చెయ్యమని రాబందుని అడిగింది. రాబందు కూడా ఇదంతా చూసింది. వెంటనే చెరువు నీళ్ళు నోటినిండా నింపుకుని ఆ నిప్పు కాగడాల మీద ఎగురుతూ చల్లింది. కాగడాలు ఆరిపోయాయి. వేటగాళ్ళు చెట్టు దిగి మళ్ళీ కాగడాలు వెలిగించారు. రాబందు మళ్ళీ అలాగే నీళ్ళు చల్లింది. అలా మూడు సార్లు చల్లే సరికి రాబంది అలిసిపోయింది. ఇది తాబేలు గమనించింది. రాబందు అలసట చూసి వెంటనే తాబేలు ఆ కాగడాల మీద, నిప్పుమీదకు బురద చల్లింది. అవి ఆరిపోయాయి. అప్పుడు వేటగాళ్ళు ''అంత పెద్ద తాబేలును ఎప్పుడు చూడలేదు. హాయిగా దీన్ని తిరగేసి వండుకుని తిందాం'' అనుకుని దాని దగ్గరకొచ్చారు. ఆ తాబేలు వేటగాళ్ళు ఇద్దరినీ నెట్టుకుంటూ నీళ్ళలోకి తోసి, తాను నీళ్ళ అడుగుకు వెళ్ళింది. 

వేటగాళ్లు చేసేది లేక నీళ్ళలోంచి బయటపడ్డారు. ''బతికి పోయాం - కానీ గద్ద పిల్లలకంటే, తాబేలు కంటే ముందు ఈ రాబందును చంపుదాం'' అనుకుని గట్టుమీదకు రాగానే వాళ్ళకు ఎదురుగా సింహం కనబడింది. అది ఒక్కసారి గర్జించగానే ఈ వేటగాళ్లు పరుగెత్తి పారిపోయారు - మరెప్పుడు ఆ ప్రాంతాలకు రాలేదు. 

స్నేహం అంటే ఇలాగే వుండాలని గద్దలు తమ పిల్లలకు చెప్పాయి.  

వార్తావాహిని