యూనిట్
Flash News
మోసానికి మోసం
ఒక ఊళ్ళోకి ఒక కుర్రాడు వచ్చాడు. అతను ఎక్కడ నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. చదువు చెబుతానని, తను పండితుడననీ అందరికీ చెప్పాడు. ఆ ఊళ్ళో చాలా డబ్బు గల పెద్ద వ్యాపారి ఈ కుర్రవాడిని పిలిపించాడు. బాగా చదువుకున్నవాడు గనక ఒక బడి పెట్టించి పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఆ బడి బాధ్యతలన్నీ ఈ కుర్రవాడికి అప్పగించాడు వ్యాపారి. వ్యాపారికి తెలియకుండా బడిపేర ఎన్నెన్నో పనులు చేయిస్తూ డబ్బు కూడా కూడ బెట్టాడు. అలా ఒక వంద బంగారు కాసులు కూడబెట్టి ఎవరికీ తెలియకుండా ఓ రోజు అడవికి వెళ్లి అక్కడ ఒక చోట గొయ్యి తవ్వి దాచి పెట్టాడు. రోజు మార్చి రోజు వెళ్లి డబ్బు దాచిన చోటుని చూసి వచ్చేవాడు. ఐతే ఒక రోజు వెళ్లి చూసి గట్టిగా ఏడ్చాడు. ఏముంది - గుంత తవ్వి పడేసి ఉంది. అంతా ఖాళీ - లబోదిబోమని ఏడుస్తుంటే ఆ సంగతి తెలిసి వ్యాపారి ఏమైందని అడిగాడు. అప్పుడు ‘‘నేను ఈ ఊరు రాకముందు పెద్ద వ్యాపారం చేసి సంపాదించిన బంగారం, వెండి అడవిలో గుంత తవ్వి దాచుకున్నాను. నేను బాగా పెద్ద వాడిని అయ్యాక అవసరం ఉంటుందని. ఇప్పుడు అది ఎవరో తవ్వి దొంగతనం చేశారు’’ అని అబద్దం కలిపి జరిగినదంతా చెప్పాడు. చివరికి రాజుగారి దాకా ఈ సంగతి వెళ్లింది. ఆయన పిలిపించి అడిగాడు. ఈ కుర్రవాడు జరిగిందంతా చెప్పాడు. ‘‘సరే దాచిన చోట ఆనవాలు ఏమైనా పెట్టావా?’’ అని మహారాజు అడిగాడు. ‘‘ఆ గోతి దగ్గర ఒక చిన్న మొక్క పాతాను, అదే గుర్తుగా ఉంచుకున్నాను’’ అని చెప్పాడు కుర్రవాడు. ‘‘సరే బాధపడకు నేనున్నాను’’ అని అతను ఎంత డబ్బు అడిగాడో అంత బంగారం ఇచ్చాడు రాజు. ఐతే కుర్రవాడికి ఆశ పెరిగింది. రెండు రోజుల తర్వాత గుళ్లో పాతిన చోటికి వెళ్లి దాచినదంతా తానే తీసి వేరేచోట చెట్టు తొర్రలో దాచాడు. రాజుగారు దయతో ఇచ్చినదంతా ఎవరో దొంగతనం చేశారని మళ్లీ గొల్లుమన్నాడు. ఈ సారి రాజుగారికి అనుమానం వచ్చింది. ఆ ఊరి పెద్ద వ్యాపారి, రాజు కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. కుర్రవాడికి తెలియకుండా రాజుగారి వేటకుక్కని సొమ్ము పోయిందన్న గుంత దగ్గరికి పంపించారు. భటులతో వెళ్లిన ఆ కుక్క గుంత దగ్గర నుంచి చెట్టు తొర్రకి చేరింది. భటులు తొర్రలోంచి సొమ్ము అంతా తీశారు. రాజుగారికి చేర్చారు. ఆ చెట్టు తొర్రలోనే ఇత్తడి సొమ్ములు తెప్పించి మూట కట్టి పెట్టించాడు రాజు గారు. దొంగ ఏడుపు ఏడుస్తున్న కుర్రవాడిని రాజుగారు పిలిచి ‘‘నీ సొమ్ము దొరికింది. మా కుక్క కనిపెట్టింది. ఎవరో దొంగ గుంత తవ్వి సొమ్ము తీసి చెట్టు తొర్రలో దాచాడు. వెళ్లి తెచ్చుకో’’ అన్నారు. రాజుగారు మళ్లీ సొమ్ము ఇవ్వరని అర్థమైంది అతనికి. కుర్రవాడు అడవికి వెళ్ళి చెట్టు తొర్రలో మూట చూసి చూస్తే అంతా ఇత్తడివి... గొల్లున నిజంగా ఏడ్చాడు. తన మోసాన్ని రాజు గారు గమనించారని తెలుసుకున్నాడు. ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు.