యూనిట్
Flash News
ముందుచూపు
అది ఒక చిన్న రాజ్యం. అక్కడ అన్నీ చిన్న చిన్న గ్రామాలు - ఆ ఊళ్ళలో వుండే జనానికి కావలసిన పంటలు పండే పొలాలున్నాయి. పళ్ళు, కాయలు, పప్పులు, కూరలు.. ఒకటేమిటి - అన్ని అందరికీ సరిపడేట్లు పండుతున్నాయి. ఐతే రాజ్యంలో ఒక పెద్ద ఊరు వుంది. అదేమో అడవికి దగ్గరగా వుంది. ఎప్పుడూ అడవి జంతువులు ఊరిలోకి రాలేదు. కానీ ఆ ఊళ్ళో పిల్లలకి రాత్రి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే అడవిలో పులి, సింహాల అరుపులకి భయపడి నిద్రలో లేచి కూర్చుంటున్నారు. మరీ చిన్న పిల్లలయితే ఒకటే ఏడుపు. రాత్రంతా ఇళ్ళల్లో ఎవరికీ నిద్ర వుండటం లేదు. చాలా రోజులు జనం ఎలాగో భరించారు. ఒకసారి ఆ ఊరికి రాజు గారి కొడుకు యువరాజు గారు పెద్ద గుర్రం ఎక్కి వచ్చారు - ఊరంతా చూసి పెద్దవాళ్ళని పలకరించాడు. అప్పుడు ఆ ఊరిలో పెద్దవాళ్ళంతా యువరాజు గారికి అడవి జంతువుల అరుపులతో పిల్లలు నిద్రపోవటం లేదని చెప్పారు. అప్పుడు యువరాజు గారు కోటకు వెళ్ళి వాళ్ళ నాన్న మహారాజు గారితో తాను విన్న సంగతి చెప్పాడు. పిల్లలు నిద్రపోవాలంటే జంతువుల్ని వేటాడి చంపేస్తే సరిపోతుందని రాజుగారు అన్నారు. మంత్రులందరూ అలాగే చెయ్యాలన్నారు. యువరాజు కూడా అవునన్నాడు. కానీ ఒక పెద్ద మంత్రి గారు మాత్రం అడవి జంతువుల జోలికి వెళ్ళవద్దని, అవి ఊళ్ళోకి రానప్పుడు వాటిని వేటాడటం అనవసరం అని చెప్పాడు. పిల్లల్ని నిద్ర బుచ్చడానికి ఏం చేయాలో ఎన్నో చెప్పాడు. కానీ రాజు, యువరాజు గారికి గుర్రాలెక్కి బాణాలు, కత్త్తులూ తీసుకొని వేటాడటం ఇష్టం. యుద్ధం చేసి చాలా రోజులయింది. గనుక వేటాడటం బాగుంటుందనుకున్నారు. పెద్దమంత్రి మాట వినలేదు. ఆయన అలా వేటాడవద్దని మళ్ళీ చెప్పడంతో ఆయన మీద రాజుగారికి కోపం వచ్చి వెంటనే మంత్రి గారిని జైల్లో పెట్టించాడు. మర్నాడే రాజుగారు, యువరాజు, సైన్యం, గుర్రాలు, రథాలూ ఎక్కి బయలుదేరారు. ఎన్నో రకాల బాణాలు తీసుకెళ్ళారు. గుర్రాలమీద నుంచి కొందరు, చెట్లెక్కి కొమ్మలమీద నుంచి కొందరు, పెద్దరాళ్ళ వెనుక దాక్కొని కొందరూ జంతువుల మీద చాలా బాణాలు గురిపెట్టి వేశారు. అలా చాలాసేపు బాణాలు వేసేసరికి పెద్దపెద్ద జంతువు లన్నీ బాణాలు తగిలి పడిపోయాయి. కొన్ని తప్పించుకుని చాలా చాలా దూరం కొండలు దాటి పారిపోయాయి. ‘అమ్మయ్యా’ అనుకున్నాడు రాజు. యువరాజు, సైన్యం ఎవరినీ జంతువులు కరవలేదు. హాయిగా పని అయిపోయిందను కున్నారు. అందరూ గుర్రాలు, రధాలూ ఎక్కి కోటకు వచ్చేశారు. ఐతే ఒక గమ్మత్తు జరిగింది. జంతువుల సంగతి వొదిలేసి పిల్లలకు భయం లేకుండా, జంతువుల అరుపులు వినబడకుండా ఎలా పడుకోపెట్టాలో ఊరి ప్రజలు నేర్చుకున్నారు. వాళ్ళకి పెద్దమంత్రి చెప్పిన సంగతులు చేరాయి. ఇప్పుడు ఇంటి ముందు కుక్కలు అరిచినా పిల్లలు నిద్రపోతున్నారు. కానీ పెద్ద చిక్కు వచ్చి పడింది ఆ గ్రామానికి. ఒక గ్రామానికేమిటి? ఊళ్ళన్నిటికీనూ. అడవిలో లేళ్ళు, జింకలు, దుప్పిలు, కుందేళ్ళు, అడవి పందులూ - ఇలా చిన్న జంతువులన్నీ కొన్ని రోజులకి పెరిగిపోయాయి. మరి పెద్ద జంతువు లేవీ లేవు - వాటిని వేటాడి చంపి తినడం లేదు కదా - అందుకని అలా అడవి నిండా చిన్న జంతువులు ఎన్నో రకాల బోలెడు పెరిగి పోయాయి. కొన్ని రోజులకి అవి అడవి దాటి ఊళ్ళదగ్గర పంట పొలాల మీదకు వచ్చి పడుతున్నాయి. పొలాల్లో పెరిగే దుంపల్ని పీకేసి అడవి పందులు తిసేస్తున్నాయి. కూరగాయాల మొక్కలు, పంటలూ అన్ని జింకలు, లేళ్ళు, దుప్పిలూ తినేస్తున్నాయి. ఐతే అవి అరిచి గోల పెట్టకుండా రాత్రిపూట అలా పొలాలన్ని తినేస్తున్నాయి. అందుకని ఊరి జనానికి వాటి సంగతి తెలియడం లేదు. కంటికి రాత్రి కనబడవూనూ, అంతే కొన్ని రోజులకి పంటలన్నీ పోయాయి. వరిపంట లేదు, కాయగూరలు లేవు, పళ్ళు, దంపలూ లేవు - వాటిని అమ్మేవాళ్ళు లేరు. కొనేవాళ్ళూ లేరు - అంటే ఇంటికి అవన్నీ చేరే దారి లేదాయె. ఇంకేముంది. తినడానికి ఏమీ లేదు ఊరి ప్రజలకు. పోనీ జింకల్ని, మిగిలిన వాటినీ కూడా వేటాడదామంటే ఊళ్ళో జనానికి, రాజుగారి సైన్యానికీ రాత్రిపూట వేటాడ్డం కష్టమైంది. జింకల్ని పట్టడం, కొట్టడం సులువా మరి. ఇట్టే పారిపోగలవు అవి. ఏం చెయ్యాలిరా బాబూ అని తల పట్టుకుని కూర్చున్నారు రాజుగారు. అప్పుడు జైల్లో వున్న మంత్రి గారిని విడిపించి ఏదైనా సలహా చెప్పమన్నాడు రాజు. వేరే కొండల్లో, దూరంగా అడవుల్లోని పెద్ద జంతువుల్ని కొన్నయినా ఇక్కడి అడవికి వచ్చేలా చెయ్యమన్నాడు పెద్ద మంత్రి. అప్పుడు రాజుగారు, యువరాజు, సైన్యం వెళ్ళి దూరపు కొండలు, అడవుల నుంచి పులి, సింహం వంటి జంతువులని చంపకుండా తరిమి, తమ రాజ్యం దగ్గరి అడవికి కొన్నైనా చేరేలాగ చేశారు. మళ్ళీ కొన్నాళ్ళకి లేళ్ళు, జింకలు మొదలయిన చిన్న జంతువులు మెల్లమెల్లగా తక్కువయి పోయాయి. మరి వాటిని పెద్ద జంతువులు వేటాడుతాయి కదా అందుకని. కొన్ని రోజులకి ఊళ్ళలో పొలాల మీదకి చిన్న జంతువులు వచ్చిపడే చిక్కు తొలగి పోయింది. ప్రజలు, రాజు, యువరాజు, మంత్రులూ గండం గడిచిందనుకున్నారు. మళ్ళీ పంటలు పండి, జనం సంతోషించారు. వాళ్ళకి కావలసిన ఆహారం దొరుకుతోంది గదా మరి అందుకు. కథ?..కంచికి..మనం? ఇంటికీకీకీ...