యూనిట్
Flash News
బాతు పథకం
(చిన్న పిల్లలకు చిన్ని నాటిక) (7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూలు పిల్లలు ఆడుకోవడానికి వీలయ్యే నాటిక) ఈ నాటికలో పాత్రలు: బాతు, రైతు, వ్యాపారి, కోడి, పోలీసు. (వేదిక మీద లైట్స్ ఆన్... రైతు, కోడి వున్నారు) కోడి: ఏవండోయ్, మీ మొహం చూస్తే నవ్వుతున్నారో, ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు. రైతు: సరే, నాకు అర్థమైతే గదా! నా మొహామే అంత. పంటలు పండలేదు, అప్పు తీరలేదు వ్యాపారం చేద్దామంటే నాకు రాదు... ఎలా? కష్టాలన్నీ మనిషికే... కోళ్లకు వుండవు గదా? కోడి: కోడి జీవితం గురించి నీకేం తెల్సు? కోడి కష్టాలు కోడివి... పోనీ నీకేమైనా ఐడియాలు కావాలంటే నన్నడుగు. రైతు: నీ బోడి ఐడియాలు అక్కర్లేదు... నీవల్ల నాకే లాభం లేదు - వేస్టు ఫెలోవి... కోడి: ఇది చాలా అన్యాయం... ఒక గుడ్డు పెడితే తింటావు, రెండు పెడితే, ఒకటి తిని, ఒకటి అమ్ముకుంటావు. గుడ్లు పెట్టకపోతే నన్ను కోసుకుతింటావు. నా పిల్లల్ని అమ్ముకుంటావు.. నేనా వేస్టు? నువ్వా వేస్టు? రైతు: నిన్నింకా కోసుకు తినలేదు - నయం. కోడి : థాంక్స్ రైతు: అప్పుడే థాంక్స్ చెప్పకు. నాకేం డబ్బు రాకపోతే ఇవాళ నిన్ను వండుకుని తిననని గేరంటీ లేదు.. (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్... స్టేజిమీద బాతు, కోడి) ‘కోడి అటూ ఇటూ పచార్లు చేస్తోంది) కోడి: అదీ నా కథ.. నా యజమాని అవసరాలకి డబ్బు అండకపోతే నన్ను సఫా చేస్తాడు, ఇచ్చట నాటు కోడి అమ్మబడును అని బోర్డు పెడతాడు.. బాతు: ఐతే మా బాతులమే నయం అన్నమాట! సరే, అసలు వాడి దగ్గర్నించీ పారిపోరాదూ? కోడి: పారిపోతే వీడి బదులు మరొకడు పట్టుకుంటాడు గదా- బాతు: అప్పుడు జ్వరం వచ్చినట్టు నటిస్తే ఎవరూ పట్టుకోరు-తినరూ... ఐడియా ఎలా వుంది? కోడి : బాగులేదు- నాకు రోశం అని తెలిస్తే మిగత కోళ్లకి కూడా నావల్ల రోగం వస్తుందేమోనని ముందే చంపిపాతేస్తారు మనుషులు.. బాతు: సరే నిన్ను పూర్తిగా రక్షిస్తా.. డోంట్ వర్రీ, కోడి : కర్రీ అయిపోతానని వర్రీ బాతు: నువ్వు కర్రీవి కావు. నేనున్నానుగదా- స్నేహితుడిని- ఆ మాత్రం సాయం చేయనా? కోడి : ఎలా? బాతు: నేను నీకో రహస్యం చెప్తాను- ఎవరికీ చెప్పవు గదా!... కోడి : చచ్చినా చెప్పను.. ప్రామిస్ బాతు: ప్రామిస్? కోడి: ఒకే.. ఏంటో చెప్పు బాతు: నేను నెలకి ఓ సారి బంగారు గుడ్డు పెడతాను... అదీ సీక్రెట్ కోడి : ఐసీ!! ఆ గుడ్లని ఏం చేస్తున్నావ్! బాతు: ఎవరికీ చెప్పకేం??.. మన భారత దేశానికి కరువు వస్తే ఇబ్బంది లేకుండా వుండాలని ఒక చోట రహస్యంగా దాస్తున్నాను- నేను చనిపోతే ఆ బంగారు గుడ్లన్నీ రిజర్వు బ్యాంకుకు అందేలాగ ఏర్పాటు చేసాలే! కోడి : ఐతే? బాతు: ఐతే గియ్‍తే కాదు - ఈ సారి గుడ్డు పెట్టి రైతుకి ఇస్తాను - నిన్ను రక్షిస్తా - వాడిని నాకు పరిచయం చెయ్.. (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్ - స్టేజిమీద రైతు, కోడి, బాతు) రైతు: ఐతే ఈ బాతునీకు ఫ్రెండా?? కోడి: అవును సార్... మంచి ఫ్రెండు రైతు: నువ్వేదండగ అనుకుంటే వీడిని ఎందుకు తెచ్చావ్? బాతు: మీకు సాయం చేద్దామని వచ్చాను.. రైతు: ఏమిటి నీ బోడి సాయం? (బాతు ఒక బంగారం రంగు గుడ్డు తీసింది) బాతు: ఇప్పుడే, అంటే - ఇందాకా నే ఫ్రెస్‍గా నేను పెట్టిన గుడ్డు ఇది - గోల్డెన్ ఎగ్.. రైతు: ఆహా! థాంక్స్... ఇద్దరూ నన్ను కాపాడారు.. ఐనా బంగారు గుడ్డు పెట్టడం నీ హాబీయా? బాతు: అవునండి.. ఈ గుడ్డు అమ్ముకుని బతకండి. (లైట్స్ ఆఫ్... అండ్ ఆన్) (స్టేజి మీద రైతు ఒక్కడే వున్నాడు) రైతు: ఆహా...మంచి ఐడియా.. ప్రతినెలా ఈ బాతు బంగారు గుడ్డు పెట్టడం ఓకే! కానీ నేను ప్రతినెలా దాన్ని అమ్మడం కష్టం - ఎవడికేనా బంగారు గుడ్డు సంగతి తెలిస్తే - నన్ను చంపి, కోడిని తిని, బాతుతో వ్యాపారం చేస్తాడు... అందుకనీ... బాతునే వ్యాపారికిచ్చి నెలనెలా వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే నాకు సేఫ్... ఆహా! (లైట్స్ ఆఫ్ - అండ్ - ఆన్) (స్టేజిమీద వ్యాపారి, రైతు) వ్యాపారి: ఏంటిలా వచ్చేవు? - అరిచి గింజుకున్నా అప్పు ఇవ్వను - పాత బాకీతీర్చు- రైతు: ఇక నాకు అప్పు ఇవ్వకండి.. అసలు అప్పు అడగనే అడగను! వ్యాపారి: ఏం? కొంపదీసి నీ కోడి బంగారు గుడ్లు పెడుతోందా? రైతు: కోడి కాదండీ బాబు! దాని ఫ్రెండు ఒక బాతు వుందండి - అది బంగారు గుడ్లు పెడుతోంది - నెలకి ఒక గుడ్డు! వ్యాపారి: బంగారు గుడ్డా? గాడిద గుడ్డా? రైతు: నేను ఆ బాతుని, కోడినీ మీకిస్తాను. నాకు నెలనెలా ఓ పదివేలు ఇప్పించండి. వ్యాపారి: సరే వెరీగుడ్- ఏదీ బంగారు గుడ్డు? (రైతు బంగారు గుడ్డు ఇచ్చాడు) ఆహా! నిజంగా బంగారు గుడ్డు - సో గుడ్.. రైతు: సరే.. నెలనెలా నీకు డబ్బిస్తాను... కోడిని, బాతునీ పట్రాఫో (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్) (స్టేజిమీద రైతు, కోడి, బాతు, వ్యాపారి) వ్యాపారి: ఏమోయ్ నువ్వు మాటమీద నిలబడే మనిషి వయ్యా... వెరీ గుడ్ .. ఇంద డబ్బు.. (అని, డబ్బు కట్టలు ఇచ్చాడు వ్యాపారి) రైతు: (డబ్బు అందుకుని లెక్కపెడుతూ) నమస్తే వస్తానండి.. ఈ కోడి, ఈ బాతూ నన్ను రక్షించాయి- మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తాయి.. వస్తా సార్ (అని వెళ్లిపోయాడు) బాతు: సరేనండి.. ఆ గుడ్డు అమ్ముకోండి.. పర్మిషన్ ఇస్తున్నాను.. వస్తానండి కోడి.. వస్తానండి.. గుడ్ నైట్.. వ్యాపారి: ఏంటి? ఎక్కడికి వెడతారు? తోలు తీస్తా... ఇక్కడే పడి వుండండి... బాతు: అన్యాయం సార్.. కోడి: మోసం.. మేం వుండం.. పోతాం వ్యాపారి: పిచ్చి వేషాలేస్తే ఇద్దర్నీ బిర్యానీ చేసి పడేస్తా... నోరు మూసుకుని నెల నెలా గుడ్డు పెట్టాలి- కోడి గుడ్లు తింటా, బాతు బంగారు గుడ్డు అమ్ముకుంటా.. ఇప్పుడే గుడ్డు అమ్మేసి వస్తా - ఇల్లు తాళం వేసి పోతున్నా - నోర్మూసుకుని పడుండంది తిక్క రేగిందంటే మిమ్మల్ని కోసి ఇప్పుడే గుడ్లన్నీ తీసేస్తా.. (అంటూ వెళ్లి పోయాడు) (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్) కోడి: చచ్చాం.. ఇప్పుడెలా? వీడు మనల్ని కిడ్నాప్ చేసేడు.. ఎలా? బాతు: భయ పడకు - రైతు బాగు పడ్డాడు- ఇక మనం బయట పడాలంటేనా ఐడియా వచ్చింది.. (సెల్‍ఫోన్ తీసింది) హలో.. హలో.. ఆ.. సార్... (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్) (స్టేజిమీద పోలీసు, బాతు, కోడి, వ్యాపారి) పోలీసు: ఊ... ఏం సంగతి? వ్యాపారి: ఏం లేదు సార్.. పోలీసు: నోర్మూయ్.. ఏం లేదంటావేంటి? ఈ బాతు ఫోన్ చేసింది.. నీ మీద కేసు.. బంగారు గుడ్లు ఎక్కడివి? చెప్పు... వ్యాపారి: నాకేం తెలీదండి ఈ బాతు బంగారు గుడ్డు పెట్టి ఇచ్చింది - అమ్మి పెట్టమంటే... కోడి: ఏడిసేడు - అన్నీ అబద్దాలు సారు, ఎక్కడో బంగారు తెచ్చి, బిస్కెట్‍లు లాగ, గుడ్లులాగ చేసి అమ్ముతున్నాడు సార్. బాతు: నిజం సార్.. ఐనా బంగారు గుడ్లు పెట్టేంత సీను నాకు లేదు సార్.. పోలీసు: అవును.. అది ఇదో క్లాసు కథలా వుంటుంది... నిజం కాదు... ఓకే.. మీ ఇద్దరూ వెళ్లిపోండి.. ఏరా, నువ్వు స్టేషన్‍కి నడు.. అమ్మో! అంత దొంగ బంగారం నేనెక్కడా చూళ్లేదు.. బాతులు - బంగారు గుడ్లు పెడుతుంది.. పద స్టేషన్‍కి.. ఒక్క బంగారు గుడ్డుకి కొన్నట్టు... అమ్మినట్టు బిల్లులు లేవు - నడువ్... వ్యాపారి: బాబోయ్.. మోసం.. నన్నొదిలెయ్యండి సార్... (లైట్స్.. ఆఫ్)