యూనిట్
Flash News
చిన్నారి కథ కొట్టి పారేయ్యకండి
ఉడతే
గదా అని కొట్టిపడెయ్యకండి. ఎందుకంటే కొట్టిపడెయ్యటం అంటేనే ఉడతలకి వొళ్లుమంట.
ఒకసారేమైందంటే
ఒక ఉడతకి గొప్ప అవకాశం వచ్చిపడింది. ఎక్కడేనా చెట్టుతొర్రలోకి దూరి, పిల్లల్ని కని, పెంచాలి. అడవులు తగ్గిపోయి, చెట్లసంఖ్య తరిగిపోయింది. కాబట్టి అన్ని చెట్లూ
పిట్టలతో, గూళ్లతో
నిండిపోయి వున్నాయి. చెట్టు తొర్రలు ఖాళీగాలేవు. అన్నిట్లో పాములో, పురుగులో ఏవో ఒకటి ఉంటున్నాయి. చివరికి ఆ ఉడతకు
ఒక ఎండిపోయిన చెట్టు కనిపించింది. అది కూలిపోయి, నేలమీద రెండు పెద్ద ముక్కలుగా పడివుంది. వాటికి
తొర్రలున్నాయి. ఇంకేం? వెంటనే
ఉడత ఒక తొర్రలోకి దూరింది. చిన్న చిన్న, బుజ్జి జుబ్జి పిల్లల్ని పెట్టింది.
ఆ
చిన్న పిల్లలు ఇంకా బయటికి వచ్చే వయసు రాకుండానే అక్కడికి ఒక పెద్ద పాము వచ్చింది.
తల్లి ఉడత, పిల్లలూ
హడలి పోయాయి.
''ఏం కావాలండీ?'' అని ఉడత చాలా మర్యాదగా పాముని అడిగింది. అసలే
పాము, పైగా
దానికి బోలెడుతిక్క, అందుకని
పడగ విప్పింది. ''నోరు
మూసుకుని నువ్వు, నీ
పిల్లలూ వెంటనే ఇంకో చోటుకి పోండి '' అని అరిచింది.
''చంటి పిల్లల్ని మోసుకుని నేను ఎక్కడికి పోగల్ను
చెప్పండి?'' అని
బతిమాలింది ఉడత.
''నాకు అనవసరం. ఏట్లో దూకండి, నాకు మాత్రం ఈ చెట్టు కావాల్సిందే'' అని బుసకొట్టి బెదిరించింది పాము. పేచీ పెడితే
పిల్లల్ని మింగేస్తుందో, ఏమో
అని భయపడి, పిల్లల్ని
తీసుకుని ఎలాగో బయటికి పోయింది. ''ఇంకో నిముషం ఆలస్యం అయితే మిమ్మల్ని మింగేసేదాన్నే, ఇంకా నాకు ఆకలి కావట్లేదు గనుక బతికి పోయారు'' అని అంటూ పాము పెద్ద రౌడీలాగ తొర్రలోకి దూరింది.
ఏడుస్తూ
చిన్నపిల్లలతో ఉడత ఓ చెట్టు నీడలో నిలబడింది. అప్పుడొక చెదలగుంపు అటుగా వెడుతూ
కనిపించాయి. ఎందుకు ఏడుస్తున్నావని చెదలు ఉడతని అడిగాయి. జరిగిన సంగతి చెప్పింది
ఉడత.
''పాముని చంపలేముగాని, దాని తిక్క కుదురుస్తాం'' అన్నాయి చెదలు. ఈ లోగా ఎలుకని
మింగేసిన పాము తొర్రలో
నిద్రపోతోంది. చడీ చప్పుడూ లేకుండా చెదలు ఒక సైన్యంలాగా వెళ్ళాయి. వెళ్ళి పాము
నిద్రపోతున్న ఎండు చెట్లని నిమిషాల్లో కొరికి పడేసి వెళ్ళిపోయాయి.
పాము
నిద్రలేచి చూసేసరికి, తొర్రలేదు, దాని చెట్టూ లేదు - వట్టి నేల మీద
పడివున్నానన్న సంగతి తెలిసింది పాముకి - అప్పుడు దానికి కోపం వొచ్చింది. ఎదురుగా
కనిపించిన ఒక పెద్ద చీమలపుట్ట దగ్గరకెళ్ళింది. పాము చీమల్ని పిలిచింది. చీమల రాణి, రాజు బయటికి వచ్చారు.
''నేను పడుకుని వున్న చెట్టు దొలచి పడేసి, పైగా ఏమీ తెలీనట్టు పుట్టలో దాక్కుంటారా? ఒక్క క్షణంలో ఖాళీచేసి పొండి, ఆ పుట్టనాది, నాక్కావాలి'' అని బుస్సుమంది పాము.
''మీరు స్సు,బుస్సూమంటే ఎలాగండీ? మీకు ఇల్లులేదని మా పుట్టమీద పడితే ఎలా
చెప్పండి?'' అని
రాణి చీమ అన్నది. '' బోడి చీమలకి ఇంత పొగరా! నోరు మూసుకుని పొండి'' అని బుస కొట్టింది పాము.
''సరే లెండి - మీ విషం ముందు మే మెంత!'' అని చీమలన్నిటితో జరిగిన సంగతి చెప్పి
చీమలన్నిటినీ బయటకు రమ్మన్నాయి రాణి, రాజు చీమలు.
చీమలు
అన్ని బయటకు వచ్చాయి. అవన్నీ కలిసి వరస వెళ్లిపోతున్నాయి. పాము పెద్దగా నవ్వి
పుట్టలోకి దూరింది. హాయిగా నిద్రపోయింది.
వేల
చీమలు వరసనపోతోంటే వాటికి
ఉడత, చెదలూ కనిపించాయి. ఎందుకలా దిగులుగా వున్నారని
ఉడత, చెదలూ, రాణి, రాజు చీమలను అడిగాయి అవి జరిగినదంతా చెప్పాయి.
''ఇప్పుడేం చెయ్యడం? మా ఉడతలు కలిసి మెలిసి వుండవు, ఈ చెదలు బతికున్నవాటికి పట్టవు. ఎండు చెట్లకే
పడతాయి|'' అని
ఉడత అన్నది - అప్పుడు చిట్టి ఉడతపిల్ల సలహా చెప్పింది. ''చీమలకి ఐక్యతవుంది. అన్నీ కలిస్తే ఏమైనా
చేయగలవు. పాముని తరిమెయ్యడం కష్టంకాదు'' అని అన్నది.
రాణి, రాజు చీమలు ఆలోచించాయి. వాటి ఆలోచన ప్రకారం
చీమలన్ని పెద్ద సైన్యంలా నిలిచాయి. సరసరా కదిలివెళ్లాయి. పుట్ట్టపైన, పుట్టచుట్టూ వరసల్లో చీమలు సిద్ధంగా నిలిచాయి.
ఉడత వచ్చి తన తోకతో పుట్టముందు నేలమీద కొట్టి చప్పుడు చేసి తుర్రుమని
వెళ్లిపోయింది. పాముకి మెలుకువ వచ్చింది.
''ఎవడ్రా ఆ చప్పుడు చేసేది? ఎంత ధైర్యం మీకు?'' అంటూ పుట్ట బయటికి వచ్చింది. రాణి చీమ, రాజు చీమ చిన్న సైగ చేశాయి, వెంటనే వేలాది చీమలు పాముని అన్ని వైపులా
కుట్టి కుట్టి పడేశాయి. పాము పనయి పోయింది.
ఐక్యత, కలిసి వుండడం ఎంత అవసరమో ఉడతలకి తెలిసివచ్చింది.