యూనిట్

కోడి, పిల్లి స్నేహం

ఎలాగో, ఏమో గానీ ఒక సారి పిల్లికి, ఒక కోడిపుంజుకీ స్నేహం కుదిరింది. కోడిపుంజు ఇల్లు ఒక గాలివానకు కొట్టుకుపోయింది. ఆ రోజు నుంచీ కోడిపుంజు పిల్లి ఇంట్లోనే వుంటోంది. రెండు కలిసి పాట పాడితే అందరికి నచ్చేది. వాటికి ప్రమాదం లేనిచోట అడవిలో అలా పాడితే పిట్టలూ, ఉడతలు తెచ్చుకున్న ఆహారంలో కొంచెం పెట్టేవి. ఎప్పుడైనా పిల్లి బయటకు పోయేటపుడు కోడిపుంజుకు చెప్పి వెళ్ళేది. ‘‘తలుపు జాగ్రత్తగా వేసుకో, ఇంట్లోకి ఎవరినీ రానీకు సుమీ - ఎవరైనా పిలిచినా బయటకి పోకు’’ అని ఎప్పుడూ చెబుతుంటుంది పిల్లి. పిల్లి మాట వినేది కోడి. కానీ, ఒక రోజు ఒక నక్క కోడి పుంజుని చూసింది. పిల్లి ఇంట్లో లేనివేళ ఇంటి దగ్గరకు వచ్చి అచ్చం కోడిలా అరిచి పిలిచింది. ఎందుకైనా మంచిది అని కోడి బయటకు రాలేదు, నక్కకి పట్టుదల పెరిగింది. ఇంకోసారి పిల్లి లేనప్పుడు వచ్చి కొన్ని గోధుమ గింజలు, బియ్యపు గింజలూ ఇంటి ముందు ఆరబోసినట్టు పరిచింది. చెట్టు చాటున నక్క కూర్చింది. కోడి ఎవరూ లే•రుగదాని కిటికీ తెరచి చూసేసరికి గింజలు చల్లి వుండటం చూసింది. అటూ ఇటూ చూసింది. ఎవరూ కనపడలేదు నెమ్మదిగా తలుపు తీసుకోని బయటకు వచ్చింది. ఒక్కగింజ ముట్టుకుందో లేదో వెంటనే నక్క ఎగిరిదూకి కోడి పుంజుని తన సంచిలో వేసుకొని వెళ్ళిపోయింది. కోడి ఎంత పిలిచినా దూరంగా వున్న పిల్లికి పాపం వినబడలేదు. నక్క తన ఇంటికి వెళ్ళింది. దానికి ఇద్దరూ అమ్మాయిలు. ఆ నక్క పాపలు తలుపు తీసాయి. నక్క వాటికి కోడిపుంజును అందించింది. ‘‘దీన్ని ఏం చెయ్యకండి. నేను వెళ్ళి వంట సామాను తెస్తాను. నేనే వంట చేసి పెడతా.. ఎవరూ పిలిచినా తలుపు తీయకండేం?!’’, అనిచెప్పి బజారుకు వెళ్ళింది నక్క. ఆ చిట్టి నక్క పాపలు చిన్నవి గదా కోడిని చూస్తూ కూచున్నాయి. ఆక్కడ పిల్లి తన పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చింది. ఇల్లు ఖాళీ... ఇంటి ముందు వాసన చూసింది. ఓహో.. ఇది నక్కగాడి పనే.. అనిగ్రహించింది. అప్పుడొక బుర్రుపిట్ట కూడ చెప్పింది... కోడిని ఒక నక్కగారు తీసుక•పోయారు.. అని పిల్లి ఒక పెద్ద సంచి పట్టుకొని నక్క ఇంటికి వెళ్ళింది. నక్క ఇంట్లో లేదని పిల్లికి తెలిసిపోయింది. ఆప్పుడు పిల్లి గట్టిగా పిలిచింది. ‘‘ఇళ్ళలో వుండే పిల్లలూ, బయటికి రండి-తోక మీద నిలబడటం నేర్పుతాను, ఒక్క కాలు మీద పరుగెత్తడం నేర్పుతాను. ఈ అవకాశం ఒక్క గంట మాత్రమే సుమా!’’ అంది. నిజం అనుకొని నక్కపాపలు గబగబా బయటకి వచ్చాయి. పిల్లి వాటిని గబుక్కున తన పెద్దసంచీలో వేసుకొని అక్కడి చెట్టు కొమ్మకు తగిలించింది. కోడిపుంజు, పిల్లితో కలిసి వెంటనే పారిపోయింది. అలా పారిపోయే ముందు నక్క ఇల్లంతా చిందరవందర చేసి, పాడు చేసి వెళ్ళిపోయాయి. నక్క తీరిగ్గా లొట్టలు వేస్తూవచ్చింది వంట సామానుతో. ఇల్లంతా చూసి గొల్లుమని ఏడ్చింది. తన పిల్లల ఏడుపు విని, చెట్టెక్కి సంచి లోంచి పిల్లల్ని జాగ్రత్తగా బయటకు తెచ్చింది. ఆ రోజు నుంచీ నక్కలకు బుద్ధి వచ్చిందో రాలేదో గానీ కోడి, పిల్లలు మాత్రం చెప్పిన మాట విని చెప్పిన చోటే వుండటం నేర్చుకున్నాయి.

వార్తావాహిని