యూనిట్
Flash News
అహంకారం - హద్దు
ఒక
అడవిలో ఒక చోట కొండ వుంది. ఆ కొండలో ఒక పెద్ద గుహ వుంది. ఆ గుహ దగ్గరకు
వెళ్ళడానికి ఏ జంతువుకీ ధైర్యం లేదు. ఎందుకంటే ఆ గుహలో అతి పేద్ద శరీరం, పేద్ద జూలూ గల సింహం వుంది. ఒక రోజు ఆ
ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఒక నక్క ఈ గుహలో ఏముందో చూద్దామని తొంగి చూస్తోంది.
ఈలోగా నాలుగయిదు రకాల జంతువుల్ని వేటాడి తిని నిద్ర మత్తుగా సింహం గుహ దగ్గరకు
వచ్చింది. నక్క హడలిపోయింది. భయం వల్ల గుహలోకి పోలేదు, తప్పించుకుని
పక్కకీ వెళ్ళలేదు. గడగడలాడుతూ కింద పండుకుంది. ‘‘అయ్యా,
తప్పయిపోయింది. నేనీ ప్రాంతం దానిని కాదు. పొరపాటున ఇటొచ్చాను.
ఏదైనా పెడితే తిని మీ దగ్గరే పడుంటాను’’ అని బతిమాలింది
నక్క. సింహం జాలిపడి సరే అంది. ఎలాగూ ఎప్పుడూ ఒంటిగానే వున్నాను గదా అని. అంతే
కాదు రోజూ వేటకి వెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం మాంసం తెచ్చి నక్క ముందు పడేసేది.
సింహంతో స్నేహం కుదిరింది. అది ఇచ్చే మాంసం తిని నక్కకు ఒళ్ళు బాగా పెరిగింది.
పొగరు అహంకారం పెరిగాయి. సింహం తనకు అండగా వుంది గదా అని వొళ్ళు మరిచిపోయింది. ఒక
రోజు ‘‘అయ్యా, రోజూ మీరు శ్రమపడి
వేటాడి మాంసం తెస్తున్నారు. ఇవాళ మీరు విశ్రాంతి తీసుకోండి. నే వెళ్ళి మాంసం
తెస్తాను’’ అన్నది నక్క. సింహం ఈ మాటలు పట్టించుకోలేదు.
అప్పుడు గుహ ముందు నుంచీ ఒక పెద్ద ఏనుగు వెడుతోంది. ‘‘మీరు
సరేనంటే ఏనుగు మాంసం తెస్తాను’’ అంది నక్క, సింహానికి చిరాకు వేసింది. ‘‘ఏనుగుతో జాగ్రత్త
సుమా’’ అని సింహం హెచ్చరించి ఊరుకుంది. వొళ్ళు తెలియని
అహంకారంతో సింహం పక్కనే వుంది గదా అని నక్క ఎగిరి ఏనుగు మీదకి దూకబోయింది. కానీ
నక్క ఏనుగుకు తగిలి ఏనుగు వెనుక కాళ్ళ కింద పడి పచ్చడి పచ్చడి అయిపోయింది. అహంకారం
ఎంత ప్రమాదకరమైందో తెలుసుకునేలోగా నక్క పని అయిపోయింది!