యూనిట్
Flash News
సాహసి - బహుమతి
మాళవ దేశం రాజుగారు పెద్దవారయిపోయారు. ముసలివాడయిన తరువాత ఈ రాజ్యాన్నీ, ప్రజలను జాగ్రత్తగా చూస•కునే వీరుడు దొరికితే బాగుండునని ఆయన అనుకున్నారు - కారణం పాపం ఆయనకు పిల్లలు లేరు - దగ్గరి బంధువుల్లో నమ్మదగిన మనిషీ లేడు. ఆయనకు మంచి సలహాలు ఇచ్చే మంత్రి కూడా ముసలివాడే. ధైర్య సాహసాలున్న యువకుడి కోసం మంత్రి ప్రయత్నిస్తున్నాడు. దొరికితే ఆ యువకుడినే రాజును చేస్తానని మహారాజుగారు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఉపాయాలు కూడా ఆలోచించాడు మంత్రి. ఈలోగా ఆ రాజ్యంలో వున్న పెద్ద అడవిలో రాత్రి పూట ఒక నల్లని రాక్షసి తిరుగుతోందని రాజుగారికి వార్త చేరింది. పైగా అది అడవి దారిన వెళ్ళే మనుషుల్ని మాయం చేస్తోందని వార్త వచ్చింది మంత్రి గారికి. ఈ కొత్త ప్రమాదం గురించి రాజు, మంత్రి ఆలోచించారు. ధైర్యసాహసాలున్న యువకుడు ఎవరైనా ఆ రాక్షసిని చంపకుండా పట్టి తెచ్చి ఇస్తే వెంటనే రాజ్యం అప్పగిస్తామని రాజు, మంత్రీ దండోరా వేయించారు. అందరికీ ఈ సంగతి తెలిసింది. అప్పటి నుంచీ ఎవరూ అడవి దారిన వెళ్ళడం లేదు. ఆ వార్త చూసి ఆ ఊరిలో నిరుపేద వాడయిన ఒక యువకుడికి ఒక ఆలోచన వచ్చింది. రోజూ తిండి లేక తిప్పలు పడే బదులు ఆ రాక్షసిని పట్టుకుంటే పేదరికం పోతుంది. హాయిగా రాజుని కావచ్చు అని ఆలోచించాడు. వస్తే రాజ్యం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది. ‘రోజూ ప్రాణం పోయే ఇబ్బందులు వున్నప్పుడు నాకు ఇదే మంచిదారి’ అని అనుకున్నాడు. తాను అడవికి వెళ్ళి రాక్షసిని పట్టి తెస్తానన్నాడు. అతని ధైర్యానికి రాజు, మంత్రి, ప్రజలు ఆశ్చర్యపోయారు. అనవసరంగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావని అందరూ అన్నారు. కానీ ఆ యువకుడు అదేం పట్టించుకోలేదు. ఒక రోజు రాత్రి వెన్నెల వేళ రాజు గారిని అడిగి ఒక గుర్రం, కత్తి, పేద్ద వల తీసుకుని బయలుదేరాడు. అడవిలో వెన్నెల వెలుగు తక్కువే. రాక్షసి తిరుగుతోందన్న దారిలో వెళ్ళాడు. గుర్రాన్ని ఒక చెట్టుకి కట్టేసి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రాక్షసి ఈ గుర్రాన్ని చూస్తే ఊరుకోదు గదా చంపేస్తుంది. ఈలోగా రాక్షసి మీద వలవేసి కత్తి చూపి పట్టేయ్యవచ్చని యువకుడు ఆలోచించాడు. మొండిగా కదలకుండా కూర్చున్నాడు. చివరికి తెల్లవారబోతోండగా దూరంగా నల్లని ముసుగులో వున్న రాక్షసి కనిపించింది. అది మెల్లగా గుర్రం దగ్గరికి వచ్చి చేతులు బాగా పైకి ఎత్తింది గుర్రాన్ని పటేస్తున్నట్టు. అదంతా నల్లటి ముసుగు. వెంటనే చెట్టు కొమ్మనుంచి కిందకి, రాక్షసి మీదకి వల విసిరి గట్టిగా బిగించాడు. కత్తితో సహా కిందికి దూకాడు. కత్తి తీసి రాక్షసి మెడ మీద పెట్టాడు. గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ యువకుడికి అనుమానం వచ్చింది. అది రాక్షసి కాదని. ఎవరో దొంగ అని, దొంగని రాక్షసిగా ప్రజలు అనుకుంటున్నారనీ అర్ధమైంది. నల్లటి ముసుగు తీస్తే రాక్షసి కాదు, దొంగా కాదు, ముసలి మంత్రి గారు! ‘ఎందుకిలా చేసేరు?’ అని అడిగాడు యువకుడు. ‘శభాష్ నాయనా. నీ ధైర్య, సాహసాలకు మెచ్చుకున్నాను. నీవు నిజమైన వీరుడవి. రాక్షసి అంటూ ఏమీ లేదు. నేనే ఈ రాజ్యానికి మంత్రిని. ఇలా రాక్షసి అంటూ ప్రచారం నేనే చేయించాను. ఇదంతా నీలాంటి వీరుని కోసం నా ఉపాయం. పద రాజుగారు నిన్ను చూస్తే ఆనందిస్తారు. ఈ రాజ్యానికి ఇక నీవే రాజువి’ అన్నాడు ముసలి మంత్రి. ఇద్దరూ గుర్రం ఎక్కారు.