యూనిట్

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో విపరీతంగా పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన, తిమ్మిర్లు, అలసట, నీరసర మరియు వడదెబ్బలకు గురవుతాం. వేసవి ఉష్ణోగ్రతల నుండి ప్రత్యేకించి వృద్ధులు (50 సం||లు పై బడినవారు)  మరియు చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా వుండాలి.

ఈ సీజన్‌లో ఉక్కపోత అధికంగా వుంటుంది. ప్రతిరోజు ఎక్కువగా నీటిని తాగాలి, ఈ అధిక ఉష్ణోగ్రతల వలన మన శరీరం నుండి చెమట రూపంలో ఆమ్లాలన్నీ పోతాయి కావున రోజుకి ఎనిమిది గ్లాసులకు తక్కువ కాకుండా నీటిని తీసుకుంటే పోయిన ఆమ్లాలను శరీరానికి అందించవచ్చు. తాజా పండ్ల రసాలు, మిల్క్‌ షేక్స్‌ మరియు మజ్జిగ వంటి ఇతర చల్లని పానీయాలు కూడా శరీరం నుండి వెలుపలికి పోతున్న ఆమ్లాల స్థానంలో రీప్లేస్‌ చేయడంలో సహాయపడి శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తాయి.

వేసవి సీజన్‌లో తీసుకోవల్సిన ఆరోగ్యకరమైన ఆహారం

వేసవి కాలం ప్రారంభమైన తరువాత వాతావరణంలో వచ్చే మార్పుల వలన కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం వుంది. అందువలన వేసవిలో ఆరోగ్యంగా వుండడానికి, అనుకూలమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమ పద్దతిలో తీసుకోవాలి. వేసవిలో ఆరోగ్యంగా వుండడానికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలను ఈ  సంచికలో...

వేసవి కాలంలో సమతుల ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దానివలన వేసవిలో మీ ఆరోగ్యం కూల్‌గా మరియు ఫిట్‌గా వుంటుంది. మీరు తీసుకునే ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు కీరదోశ, టమోటా మరియు క్యారెట్‌లను అధికంగా తీసుకోవడం వలన శరీరానికి కావల్సిన చల్లదనాన్ని ఇస్తుంది మరియు శరీర బరువును కూడా తగ్గిస్తుంది. వీటిని భోజన సమయాల్లోనైనా లేదా భోజనానికి, భోజనానికి మధ్య గ్యాప్‌లోనైనా తీసుకోవచ్చు. వీటితో పాటుగా ప్రతిరోజు ఆహారంగా కొబ్బరినీరు, తాజా నిమ్మ రసం, పెరుగు మరియు మజ్జిగ, లస్సీ, తాజా పండ్లరసం, బార్లీ నీరు, రాగి జావ, మామిడి రసం, తాజా పండ్లు వాటర్‌ మెలాన్‌, ఆపిల్‌, ఫైనాపిల్‌, దానిమ్మ మరియు మిల్క్‌షేక్స్‌ను తీసుకోవాలి. 

సూచించిన ఆహార పదార్ధాలు రోజూ తినే ఆహారంతో పాటుగా వీటిని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో సహకరిస్తుంది.

కూరగాయల సలాడ్స్‌ అనగా కీరదోశ, కారెట్‌  మొదలగునవి

 ఐస్‌క్రీమ్స్‌ మరియు కుల్పీలు

సీతాఫలం పండు, పెరుగు వేసవిలో ఆరోగ్యకరంగా వుండడానికి ఆరోగ్యకరమైన కొన్ని ఆహార చిట్కాలు ఈ కింద వున్నాయి.

5-6 సార్లు భోజనాలు చేయాలి

భోజనాన్ని  ఎక్కువగా ఒకేసారి కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి. ఇలా తినడం వలన భోజనం సక్రమంగా జీర్ణం అవుతుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే భోజనాలకి మధ్యలో పండ్ల్లుగాని సలాడ్స్‌గాని తీసుకుంటే మంచిది.

తినే పండ్లు:  వేసవిలో తాజా పండ్లు వాటర్‌ మెలాన్‌, ద్రాక్ష మరియు నారింజ పండ్లను అధికంగా తినేలా చూడాలి.

సాధారణ భోజనానికి ప్రాధాన్యతనివ్వాలి:

వేడిమి ఎక్కువగా వుండడం వలన ఎక్కువ మసాలాలు, కారం వున్న ఆహార పదార్ధాలు తీసుకుంటే వేగంగా జీర్ణం కాదు, చాలా ఇబ్బందిగా వుంటుంది కావున వీలయినంతవరకు సాధారణ భోజనాన్ని తీసుకోవాలి.

భోజనం తరువాత తీసుకోవల్సిన ఆహారపదార్ధం

భోజనం ముగించిన తర్వాత కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపిన ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ లేదా సలాడ్‌ను తీసుకోవాలి. ఇంకా వీలయితే కొబ్బరి నీరు, పెరుగు, నిమ్మరసం లేదా ఏదైనా పండును ఆహారంగా తీసుకోవచ్చు.

రాత్రి భోజనం

రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం తినాలి. రాత్రిభోజనం కూడా మితంగానే తినాలి.

అధికంగా నీరును తాగాలి

సాధారణంగా త్రాగే నీరుకన్నా వేసవిలో అధికంగా తాగాలి. వేడిమి వలన మన శరీరం నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది కావున తగినన్ని నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురౌతుంది. దాహం లేకపోయినా రెగ్యులర్‌గా నీటిని తాగుతుండాలి. వీలయినంతవరకు కెఫినేటెడ్‌, కార్బొనెటెడ్‌ మరియు షుగర్‌ లెవెల్స్‌ అధికంగా వున్నటువంటి కాఫీ, టీ మరియు కూల్‌ డ్రింక్స్‌ను త్రాగకుండా వుండేలా చూసుకోవాలి. వీలయినంతవరకు చల్లటి ద్రవాలకు దూరంగా వుండాలి, వీటివలన మంచి కన్నా శరీరానికి చెడే అధికంగా జరుగుతుంది.

యోగా మరియు ఎక్స్‌ర్‌సైజ్‌

ఉదయం పూట మరియు రాత్రి సమయాల్లో చేసే శారీరక ఎక్స్‌ర్‌సైజ్‌లు అధిక శ్రమతో కూడినవి మరియు అలసట కలిగించేవి చేయకూడదు.

పాటించవల్సిన ఆహార నియమాలు:

నీటిని భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో త్రాగకుండా భోజనం పూర్తయిన తర్వాత తాగడానికి ప్రయత్నించాలి. మీ జీవన శైలిలో మరియు ఆహారం తీసుకోవడంలో మార్పులు చేసుకోవాలి. పైన తెలిపిన ఆహార చిట్కాలవలన ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీ రోజువారి జీవితంలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్‌నెస్‌గా వుంటారు.

మీరు మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే ప్రకృతిలో  లభించే సహజ సిద్ధమైన పదార్ధాలను తీసుకోవాలి. ప్రకృతి మనకు కావల్సినన్ని పదార్ధాలను అందించింది. వాటిని మనకు కావల్సిన విధంగా వాడుకుని వాటి వలన ఉపయోగాలను పొందాలి.

-- డా|| శ్రీమతి వసుధా మాథుర్‌, చీఫ్‌ డైటీషియన్‌

బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌

వార్తావాహిని