యూనిట్

కురుసభ నాటి గొంగళి

''ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరమా?'' అన్న ప్రశ్నే అధ్వాన్నం, అన్యాయం అనుకుంటే, ''పక్కలోకి పనికి వస్తారా'' అన్న సమాధానం అత్యంత అహంకారపూరితమైన, దుర్మార్గపు వ్యాఖ్య. కురుసభల నాటి నుండి మనసుల్లో పేరుకుపోయిన మకిలి, కుళ్ళుకి పరాకాష్ఠ. ఒకడు బైటికి అన్నాడు. లోపల అలా అనుకునేవాళ్ళెంతమందో! ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకుముందు ఎన్నో జరిగాయి. మహిళలు సిగ్గుతో చితికిపోయారు. బాధతో కుమిలిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. నిరసించారు. ఖండించారు. కోర్టుల్లో కేసులు వేశారు. అయినా.. మళ్ళీమళ్ళీ...! సినీరంగం కావచ్చు, వ్యాపారంగం కావచ్చు, స్కూల్‌ కాలేజ్‌ కావచ్చు. పనిచేసేచోటు కావచ్చు. రైల్లో, బస్సులో, రోడ్‌మీద.. ఎక్కడైనా ఇలాంటి బాణాలు స్త్రీల మనసుల్ని గాయపరుస్తూనే వున్నాయి. మర్యాద ముసుగు వేసుకొన్న పై అధికారి కావచ్చు, ప్రక్కనే కూర్చున్న కొలీగ్‌ కావచ్చు. ఎవరికైనా ఇలాంటి అస్త్రశస్త్రాల్ని ప్రయోగించడానికి పూర్తి స్వేచ్ఛ వుంది ఈ సమాజంలో. ఆక్రోశించడం స్త్రీల వంతు అయింది. ఆ ఆవేదనని కాగింతపై పెడితే, వేదికమీద మాట్లాడితే ''స్త్రీ వాదులు - బరితెగించారు'' లాంటి బిరుదులు రెడీగా ఉంటాయి. అయినా రచయిత్రులు తమ గళాల్ని, కలాల్ని పదునెక్కిస్తూనే             ఉన్నారు, జ్వలిస్తూనే             ఉన్నారు.

ఖమ్మంలో దెంచనాల బ్రహ్మయ్య, ఈశ్వరమ్మలకి జన్మించిన దెంచనాల విజయకుమారి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి రగిలిపోతూ, తన రచనల్ని జ్వలింపజేస్తూ ''జ్వలిత'' అన్న కలంపేరుతో రచనలు చేస్తున్నారు.

ఆమె రాసిన ''కురుసభనాటి గొంగళి'' ఈనెల మన మంచి కవిత.

గడీల దొరల చూపుల ఉద్యోగులు

ఎర్రరంగు కప్పుకున్న

భూస్వామ్య ఉపాధ్యాయ బృందాలు

అయ్యోర్లు, అమ్మోర్లు

నగలను నాన పెడుతూ పట్టుమడలను

చుట్టపెడుతూ

నా చుట్టూ వెట్టి వెయ్యిరకాలుగా

కొట్లాడి వెకిలి చూపుల్లో

నేను

వెలివేయబడి

పట్టభద్రులైన కీచకుల నడుమ

ద్రోహి ద్రోణాచార్యులమధ్య

నా సోదరులు ఎప్పటికీ కురుసభలో పాండవులే

నాగాలు అఘోరులు ప్రపంచసభలు

విశాలాంధ్ర భూములు

కాలక్షేప బఠానీల మాటలతో

కళ్ళముందే హత్యలు, అత్యాచారాలు

ఆనందంగా జరుగుతూనే ఉంటాయి

సానుభూతి ప్రదర్శనలతో

సైంధవులు భుజాలను ఊపుకుంటూ

గజాలను తలుచుకుంటూ నా చుట్టూ

సజీవ సమూహాల దొరల దొరసానులు

సరదాగా చేస్తారు

నేరాలయినా, ఘోరాలయిన వాళ్ళనయినా

వారసులను ఉత్పత్తిచేస్తూ

ఉరుకుల పరుగులు పెడుతూంటారు

వాళ్లెప్పుడూ అనుభవిస్తూంటారు

సిరులయినా సంపదలయినా

రాజ్యాలయినా అధికారాలయినా

వాళ్ళు మాత్రమే వదులొదులు మాటలను

శ్రీరంగనీతులను వల్లె వేస్తుంటారు

ముఖాలమీద ముద్రలు వేస్తారు

శరీరాలమీద యాసిడ్‌ చల్లుతారు

మాటల్తో చేతలతో తేనెపూసిన వస్తువులు

రకరకాల ఎరలను చూపి

వెంటాడి వేటాడుతుంటారు

మాటలయి ఆయుధాలయి అవయవాలయి

మమ్మల్ని ఛిద్రంచేస్తూ

కులం మతం అంటని రంగొకటి

వృత్తుల పేరుతో రంగు మరొకటి

కుటుంబాల పేరుతో రంగు ఇంకొకటి

రంగేదయినా వ్యక్తమయ్యేరంగు తోడేలుదే

మాంసాహార చూపులు

సూడోనాటి కాంతలో

షాడో పైశాచికత్వం

ఎక్కడో ఒకోచోట నిత్యం!

తెలుగు సాహిత్యంలో ఎం.ఏ., సైకాలజీలో ఎమ్మెస్సీ చేసి, ఎల్‌.ఎల్‌.బి. చేసి ప్రభుత్వ ఉపాధ్యాయని పనిచేస్తూ, వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా ''ఫ్యామిలీ కౌన్సిలింగ్‌''లో వచ్చే అనేక కేసుల్ని గమనించారు. భార్యపట్ల, తల్లిపట్ల అమానవీయంగా ప్రవర్తించే ఎందరో మగవారి మనస్తత్వానికి విస్తుబోయేవారు. విచ్ఛిన్నమౌతున్న కుటుంబ సంబంధాలు, మానవ విలువల్ని చూసి ఆవేదన చెందేవారు. అందుకే ఆమె కథలు, కవితలు మానవ జీవితాలకి అద్దం పట్టేలా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని, ఎత్తు పల్లాలని నిశితంగా పరిశీలించి, రచనలు చేస్తారామె.

కాలాన్ని జయిస్తూ నేను (కవితా సంపుటి 2007), సుదీర్ఘ హత్య (కవితా సంపుటి 2009), ఆత్మాన్వేషణ (కథలు 2011), అగ్నిలిపి (తెలంగాణ కవిత్వం 2012) లాంటి రచనలు చేశారు.

సంపాదకత్వం వహించినవి - పరివ్యాప్త (స్త్రీవాద కవిత్వం 2007), గాయాలే గేయాలై (తెలంగాణ రచయితల కవిత్వం 2010), రుంజ (విశ్వకర్మకవుల కవిత్వం 2013), ఖమ్మం కథలు (1911-2016), అక్షర పుష్పాలు - భావ సౌరభాలు - ఖమ్మం బాల కవుల కవిత్వం (2016).

నాల్గవ అంతర్జాతీయ రచయితల సదస్సు, ఆగ్రా 2007, అఖిలభారత రచయిత్రుల సదస్సు, బీజాపూర్‌ 2008, ఐదవ అంతర్జాతీయ రచయితల సదస్సు, హర్యాన 2009, శతాధిక మహిళా కవి సమ్మేళనం గుంటూరు 2009, మనలోమనం - రచయిత్రుల సదస్సు, అనకాపల్లి 2010, తెలంగాణ రచయితల మహాసభలు, సిరిసిల్ల 2009 -2010, ఇంకా అనేక సదస్సులు నల్గొండ, మిర్యాలగూడ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌లో పాల్గొన్నారామె.

జ్వలితగారి సాహిత్య కృషికి ''అమృత లత అపురూప'' రాష్ట్రస్థాయి అవార్డ్‌, ఆణిముత్యం జాతీయ అవార్డ్‌ మదర్‌థెరిసా సేవా సంస్థవారి, గౌరవ డాక్టరేట్‌ గ్లోబల్‌ పీస్‌ అమెరికన్‌ యూనివర్శిటీ వారి, రాష్ట్ర ప్రభుత్వ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం అందుకున్నారు. ఇంకా రోటరీ క్లబ్‌, ఎస్‌.టి,ఎఫ్‌, లయన్స్‌ క్లబ్‌, ఆప్టా, ఎపియూఎస్‌ సంస్థల ద్వారా ఉత్తమ ఉపాధ్యాయినీ పురస్కారాలు అందుకున్నారు. భూమిక స్త్రీవాద పత్రిక ఉత్తమ కథా పురస్కారం, విశ్వభారతి సంస్థ వంటి వారి సంస్థల్లో  ఉగాది పురస్కారాలు అందుకున్నారు. 2017 మార్చి 30న తెలుగు విశ్వవిద్యాలయం వారు ''కీర్తి పురస్కారం'' ప్రదానం చేశారు.

త్వరలో ప్రచురించబోయే ''నాచుట్టూ నేను'' నవల, ''జ్వలిత'' కథల సంపుటి, ''మేమెవరం'' కవితా సంపుటి, ''అనుభవాలు - పరిశీలన'' వ్యాసాలు వంటి రచనల కోసం అభిమాన పాఠకులు ఎదురు చూస్తున్నారు.

-జ్వలిత దెంచనాల

డా|| శ్రీమతి సి.హెచ్‌. సుశీల

వార్తావాహిని