యూనిట్

పరిమళకృష్ణ

రచన- దేవిప్రియ కృష్ణవేణీ!

తెలుగింటి అలివేణీ!

అని ఓ సినీకవి ప్రశంసించిన కృష్ణానది మహారాష్ట్రంలో సతారా జిల్లా మహాబలేశ్వరం వల్ల (జోర్‌ గ్రామం)లో జన్మించి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రవహిస్తూ, బీళ్ళను బంగారు చేలగా మార్చుతూ, ఆంధ్రావనికే అన్నపూర్ణలా కైమోడ్తూలందుకుంటూ, కృష్ణాజిల్లా హంసలదీవి వల్ల బంగాళఖాత సాగరంలో సంగమిస్తుంది. ఆధునిక కాలంలో కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ నుండి పైగంబరకవి దేవిప్రియ వరకు కృష్ణానదిని వేనోళ్ళ కొనియాడారు.

ప్రకృతి ప్రసవించిన ఒక

ప్రాచ్యగమన పశ్చిమ పరిమళజల కృష్ణ

            మూడు భాషలు నేర్పి

            మూడు పంటలు కూర్చి....

            ఉభయతీరాల వెంటా ఆశ్రితమానవుల

            అనాది అభయ అన్నప్రదాత కృష్ణ.

ఆదిమ జీవనధారగా

అనేక యుగాగమనాలను

అరచేతి అద్దాలమీద

ప్రఫలించి ప్రసారం చేసిన

అమృత జలాద్భుత సాంబ్రాణి సౌగంథిóక ప్రసాదం కృష్ణ.

            కోట్లాది ఎకరాలకి పచ్చపచ్చని సారం

            గట్లవెంట జనావాస సంరంభ సంసార చిత్రలేఖనం

            ద్రవిడ క్షేత్రాల మీదికి

            దండెత్తి వచ్చిన అశ్వబలియాగ ప్రభంజన

            విధ్వంస ఇతిహాస ముద్రిత తాళపత్రం

            ఉత్తరాది వలసగాలులలో కలిసివచ్చిన

            విచ్ఛిన్న యోచనల విభజన ఖడ్గ చాలనలకి సాక్ష్యం....

            తెప్పలు, తెరచాప పడవలు,

            వ్యాపారనావలు, యుద్ధ నౌకలు ఈదివచ్చిన

            దురాక్రమణ చరిత్రని అలల అక్షరమాలలో

            నిక్షిప్తం చేసిన నిగూఢ చరిత్రకారిణి కృష్ణ.

ప్రవాహ మార్గం వెంట

గాలిగోపురాలతో

తడిరెక్కలతో తిరిగివచ్చి ముడుచుకుని కూర్చున్న పక్షులు

మడిబట్టలతో

లోతులేని నీళ్ళలో మునిగితేలే భైరాగులు

            మసీదు గోడల

            నీడల లోంచి తప్పెటలు మోగిస్తూ

లేచే ఫకీరుల చేతులు

అనంత విశ్రాంతి భూములలో

మొలిచి వికసించే

సమాధి శిలువలు....

            జాడలేని రుషి వాటికలు

            ఆచూకీ తెలియని అనేకానేక         

అధికార శిలాశాసనాలు

            ఖండాలూ శతానేక సరిహద్దులూ దాటి

            పర్వతాలూ, అరణ్యాలూ, మహోదధులూ దాటి

            ఏటికి యెదురీది చేరిన రాజ్యవిస్తరణ కాంక్షలూ 

            చిలువలు పలవలయి

స్తూప చైత్ర శిధిలాలుగా మిగిలిన బౌద్ధ జ్ఞాన జ్ఞాపకాలూ

అలిసిసొలసి ఒడ్డుమీద కొన ఊపిరితో

భవిష్య తరాలకోసం కొట్టుమిట్టాడుతున్న

బహుళనాగరికతల బ్రహ్మాండ హృదయచలనాలూ

            లంకల మీద నీటి పిట్టలా యెగురుతున్న

            ఏటిగాలికి నిలువెత్తున

            తలలూగుతున్న రెల్లు గడ్డిపూలూ

            ఉండవల్లి గుహలలో ఇంకా

            ఊపిరి పీల్చుకుంటున్న శయన బుద్ధ శిల్పముద్రా....

నీ నీటి చుక్కల తడికోసం

నీ అడుగులకి మడుగు లొత్తే

మాగాణి, పొలాల సిరికోసం

నీ ప్రసన్న తరంగాల మీద

లఘు దీప పత్రపు దోనెలు వదిలే భాగ్యం కోసం

జరిగిన యుద్ధాలెన్నో

ఒరిగిన వంశాలెన్నో

కూలిన శిఖరాలెన్నో

దగ్ధమయిన నగరాలెన్నో

పూడిన కాలువలెన్నో

మునిగిన చిహ్నిత పతాకాలెన్నో

ఓ కృష్ణా ఓ క్రిష్ణవేణీ....

            నా జీవధాత్రి

            ఎగువ ఏలనాటి జొన్నపొలాలను

            తడపకుండానే నాపరాతి నేలలు దాటి

            శతసహస్ర సంవత్సరాల తరువాత కూడా

            నిర్దయగా నేటికీ నువ్వు పల్లానికి ప్రవహించి పోతావు....

            నీళ్ళంటే అక్కడ ఇప్పటికీ

వానలే కొండవాగులే

చంద్రవంకలే నాగులేళ్ళే...

పల్నాటి వీరులు

కారంపూడి రణరంగంలో రక్తంపారించి

బరిసెలూ కత్తులూ కడిగినప్పుడు

నాగులేటిలో ఎర్రగులాబీ రేకులై తేలివచ్చిన

నెత్తుడి చారికలు తాకినప్పుడయినా

గుర్తురాలేదా నీకు మాచర్ల గురజాల అరకల ఆర్తనాదాలు....

పోనీ పోనీ.....

అప్పుడెప్పుడో అమరావతి నుంచి మా నాన్న

వరిగడ్డిలో చుట్టతీసుకు వచ్చిన

మూడు మూరల వాలుగ చేపగానైనా గుర్తుంటావు నువ్వు

నీ అలౌకిక వర్ణ సమ్మిళిత

సూర్యస్తమయాలతో,

నీ దివ్యమంత్రిత పారవశ్యసమ్మోహిక

చంద్రోదయాలతో....

నాగార్జున కొండనుంచి

లాంచిలో తిరిగివస్తున్నప్పుడు తళుకులీనుతూ

నీ నీటి కళ్ళలో ప్రతిబింబించిన

ఏండువెన్నెల జల్లుగానైనా గుర్తుంటావు!

ఎందుకంటే

రోదసి కోనేటిలో విరిసిన నక్షత్రపారిజాతాలలా

నేనూ నిద్రపోనూ,

గగన నగ శిఖర జలపాతంలా దూకే

నువ్వూ నిద్రపోవు,

కనురెప్పలు లేని కాల మత్స్యంలా

 

నీకోసం యెదురుచూస్తున్న సముద్రమూ నిద్రపోదు,

అప్పుడూ ఇప్పుడూ ఇంకొకప్పుడూ.

కవి దర్భశయనం శ్రీనివాసాచార్య అన్నట్టు - దేవిప్రియ రాసిన ఈ 'పరిమళకృష్ణ' కవితలో సౌందర్యాంశం అంతర్లయగా సాగుతూ, భౌగోళికత, సామాజికత, ఆత్మీయసంబంధం, చారిత్రకత పెనవేసుకొని వున్నాయి. కవి పితులమూలాల్నీ, బాల్య జ్ఞాపకాల్నీ, కవిస్మృతిలో వున్న వర్తమాన రక్తసందర్భాల్నీ ఈ కవిత పొదుగుకుంది. సబ్జెక్టివ్‌, ఆబ్జెక్టివ్‌ కలగలసిన కవిత. 'కోట్లాది ఎకరాలకి పచ్చపచ్చని సారం'గా కృష్ణానదిని లక్ష్యదృష్టితో చూసిన కవి, అదే నదిని ఇదే కవితలో ఆత్మానుభవదృష్టిలోంచి 'మూడు మూరల వాలుగ చేప'గా చూసాడు.

దేవిప్రియ గుంటూరులో 1951 ఆగస్ట్‌ 15న జన్మించారు. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలతో ఆంధ్రాక్రిస్టియన్‌ కాలేజిలో పట్టభద్రత వరకు చదివారు. తొలుత సినిమారంగంలో అనిసెట్టి సుబ్బారావు వద్ద కొంతకాలం పనిచేశారు. తరువాత జర్నలిజంలో స్థిరపడి ప్రజాతంత్ర ఎడిటర్‌గానూ, ఆంధ్రప్రభ సంపాదక శాఖలో పని చేసారు. ఆంధ్రజ్యోతి డెయిలీ అసిస్టెంట్‌ ఎడిటర్‌గా, ఉదయం దినపత్రిక అడ్వయిజరీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 'హైదరాబాద్‌ మిర్రర్‌' వ్యవస్థాపక ప్రధాన సంపాదకుడుగా, డైరక్టర్‌గా, హెచ్‌.ఎమ్‌.టి.వి. సీనియర్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. 10 టివిలో కన్సల్టింగ్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రభలో దేవిప్రియ 1982లో ప్రారంభించిన అనుదిన రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యాన ప్రక్రియ 'రన్నింగ్‌ కామెంటరీ' తెలుగు దినపత్రికల మొదటిపేజీలలో తప్పనిసరి అంశంగా మారిపోయింది. కథóకుడిగా మొదలై పదికథóలైనా ప్రచురించకుండానే కవిగా మారి పైగంబరకవిగా ప్రసిద్ధులయ్యారు. 'అమ్మచెట్టు'తో ఆరంభించి 'ఇంకొకప్పుడు' వరకు తొమ్మిది కవితా సంపుటాలు ప్రచురించారు. బి.నరసింగరావు దర్శకత్వంలో 'దాసి, రంగుల కల' వంటి జాతీయ బహుమతులు పొందిన సినిమాలకి స్క్రీన్‌ప్లే రచించారు. 'అద్యాక్షా, మన్నించండి' అనే సంపాదకీయాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. కవిత్వ ధర్మాన్ని ఏనాడు విడువకుండా సృజన చేస్తున్న కొద్దిమంది కవుల్లో దేవిప్రియ ముఖ్యులు...

సేకరణ- డా. శ్రీమతి సి.హెచ్‌. సుశీల

వార్తావాహిని