యూనిట్
Flash News
నిశ్శబ్ద ఘోష
కా...న్స..ర్...! ఈ మూడక్షరాలు తలుచుకుంటే
మృత్యువు కళ్ళముందు మెదులుతుంది. ఆ మాట పలికినా, విన్నా గుండెల్లో దడ. పెదాల్లో తడబాటు. స్వరంలో
మార్పు. ఆ భయానికి ప్రధాన కారణం - అపోహలు, అనుమానాలు, అవగాహనరాహిత్యం. కాన్సర్‌ని ఎదిరించి నిలవడం వైద్యశాస్త్రం ఎంతో
అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సాధ్యమే. పోరాడి జయించడం అసాధ్యమేమీ కాదు. అది మన
దరిదాపుల్లోకి కూడా రాకుండా చుట్టూ దుర్భేద్యమైన కోట కట్టుకోవడము సాధ్యమే.
ఎందుకంటే, నూటికి డెబ్బై
అయిదు శాతం కాన్సర్ వ్యాధులు కొని తెచ్చుకుంటున్నవే.
జీవనశైలిలో లోపాల కారణంగా పుట్టుకొస్తున్నవే. కాని
కాన్సర్‌ని జయించడం అంత తేలికేం కాదు. అవగాహన, ఆశ, ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలి. ముఖ్యంగా ధనాన్ని మంచినీళ్ళప్రాయంగా
వెచ్చించగలగాలి. అది ఎంతమందికి సాధ్యం? సాధారణంగా ఒక వ్యక్తికి కాన్సర్ వ్యాధి సోకిందంటే, అది అతనికే కాకుండా అతని కుటుంబ సభ్యులందరికీ
మనస్థాపం కలిగిస్తుంది. ఏం చెయ్యాలో, ఎటువంటి చికిత్సకి వెళ్ళాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం కాని అయోమయవస్థలో పడిపోతారు.
కాన్సర్ వ్యాధి సోకిన వ్యక్తి ఆ కుటుంబభారం మోసే వ్యక్తి అయితే ఆ కుటుంబ సభ్యులకు
ఎదురయ్యే మానసిక క్షోభ అనంతం. వారి బాధకు పరిష్కారం లేదు. వ్యాధి తీవ్రతను, దానివల్ల ఆ పేషంట్ పడే బాధ, క్షణక్షణం మరణానికి చేరువయ్యే ఆ వ్యక్తిని
చూసేవారు పడే మానసిక హింస అనిర్వచనీయం. అదొక నిశ్శబ్ద ఘోష. దీనిని కవితా రూపంలో
వెల్లడించిన శ్రీలలితానందప్రసాద్‌గారి ''నిశ్శబ్దఘోష'' ఈ నెల మంచి కవిత.
ప్రవాహంపై మంద్రపవనంలా
సాగుతున్న బతుకు పడవ
ఉరుము మెరుపులేని ఉప్పెనలా ఛిద్రం
శిలయో! జీవమో! ఆకలితెలియదు
దైనందినానికి నిజాదరణ నిస్సత్తువ
ఆకులన్నీ గిల్లేసిన గోంగుర కాడ శరీరం
సేవా తత్పరవైద్య చలవతో
హారతి కర్పూరమైన ఆస్తులు
రగిలే నిప్పుల్లా అప్పులు
అందరికీ తెలుసు - అసలు వారికి తప్ప ఎవరూ చెప్పరు -
ఏమీ ఎరగనట్లే ఉంటారు.
ఉన్నామనుకుంటారు!
ప్రళయం ముందు ప్రశాంతతలా
చెవుల్లో మార్మోగే చూపులు
కాన్సర్ కర్కశ కబంధహస్తాల్లో విలవిల్లాడేవానికి
కారుణ్య ఊరటో - ఎంతకీ బిగియని ఉరిత్రాడో!
తన ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి కాన్సర్‌తో బాధపడుతూ, రోజురోజుకీ అతని శరీరంలో వస్తున్న మార్పుల్ని చూసి, కదిలిపోయి లలితానంద్‌గారు ఈ కవిత రాశారు. కాన్సర్‌రోగి
పడేబాధ, అతనికి ఉన్న ఎన్నో ఆశలు ఆశయాలు క్రమంగా ఆవిరైపోయి, నిస్పహాయంగా కబళించబోతున్న మరణాన్ని అంచనా
వేసుకుంటూ పడే హింస అనిర్వచనీయం అంటారు శ్రీ లలితానంద్. పిల్లల భవిష్యత్‌పట్ల
ఊహించుకొన్న కోరికలపై సమాధికట్టి, తన మంగళసూత్రం ''పెరిగి'' పోకుండా
అప్పుల్ని పెంచుకొంటున్న ఆ యిల్లాలి క్షోభవర్ణించలేం. ఎండుటాకులు తాము రాలిపోకుండా, తమ కన్నకొడుకు మరణం అంచుకి క్రమక్రమంగా చేరుకోవడం
చూసి ఆ తల్లిదండ్రులెంత తల్లడిల్లిపోతారో!
ఆ గూటికప్పు ఈ ఉప్పెనలో
ఎపుడెగిరి పోతుందో!
లోపలి కసుగాయలు, పండుటాకుల తల్లిదండ్రులేమైపోతారో!
శరీరం ఎన్నో కణాల సముదాయాలతో నిర్మితమవుతుంది.
సాధారణంగా కణాలు పెరిగి, విభజనచెందుతాయి. ఈ విభజన, కణాలవృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. కొన్నిసార్లు ఈ
క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది. శరీరానికి అవసరంలేక పోయినా కొత్తకణాలు ఏర్పడతాయి.
పాత కణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం ''కంతి'' లాగా గడ్డగా ఏర్పడతాయి. దీనికే కాన్సర్ గడ్డ అని, రాచకురుపు అని అంటారు. అన్ని గడ్డలూ కాన్సర్
కాకపోవచ్చు. అపాయకరమైనవి కాకపోవచ్చు. వాటిని శస్త్రచికిత్సతో తొలగించవచ్చు. ఇవి
సాధారణంగా తిరగబెట్టవు. శరీరంలో ఇతర అవయవాలకు వ్యాపించవు. కాని ఈ ప్రాణాంతకమైన
కాన్సర్‌వ్యాధి ఎందుకు వస్తుందో, దాన్ని పూర్తిగా శాశ్వతంగా తగ్గించే విషయంలో శాస్త్రవేత్తలు ఇంకా
పరిశోధిస్తున్నారు. గొంతు కాన్సర్, రొమ్ము కాన్సర్, నోటి కాన్సర్, రక్త కాన్సర్, ఎముకల్లో కాన్సర్, కాలేయ, లంగ్, గ్యాస్ట్రిక్, గర్భాశయ, గర్భాశయ ద్వారం కాన్సర్.. వంటివి ఎన్నో ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ
రోజుల్లో కేవలం వృద్ధాప్యంలోనే కాన్సర్‌వ్యాధి వస్తుందని చెప్పలేం. చిన్న వయసులోనూ
రావచ్చు. కొన్ని నెలలనుండి, కొన్ని సంవత్సరాల కాలంలో తెల్లరక్త కణాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య
ఆహారపుటలవాట్లు, పొగతాగడం, మద్యం సేవించడం వంటివి కాన్సర్‌కి కారణం అంటారు. కాని ఎందుకు
వస్తుందో పూర్తిగా చెప్పలేం. అలాగే ఖచ్చితంగా నివారించే పద్ధతి ఏదీలేదు.
అన్నిటికంటే బాధాకరమైనది ఏమిటంటే కాన్సర్
చికిత్సలో భాగమైన 'కీమో థెరపీ', 'రేడియో థెరపీ' వంటివి రోగికి చాలా బాధ కల్గిస్తాయి. చికిత్సానంతరం వారుపడే నరకం
చూసి కుటుంబ సభ్యులు ''ఈ నరకం అనుభవించేబదులు చనిపోవడమే మేలు'' అని క్షణకాలం అనుకుంటారు అనడం అతిశయోక్తికాదు.
లివరో, బోనో, కాలో, చేయో ఎక్కడోచోట
కొబ్బరితాడు అంటుకుంటుంది తెలియకుండానే
చురచురసాగే కొలదీ రంపాలతో కోసి మెలేసినట్లే
సజీవంగా నిప్పుల కొలిమిలో నిలబెట్టినట్లే
అంపశయ్యపై నిశ్శబ్దఘోషతో ఎన్నాళ్ళిలా
చూపులమాటల కందని మూగవేదన
రోజు రివాజులా లోపల ఏ శిథిలభాగం విశ్రమిస్తుందో!
ఏతీగెప్పుడు పుటుక్కున తెగివేరవుతుందో!
దాదాపు 35 ఏళ్ళ వయసువరకూ శరీరంలో ఎన్ని కణాలు దెబ్బతిన్నాయో అన్ని కణాలూ
ఉత్పత్తి అవుతుంటాయి. ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ కొత్త కణాల ఉత్పత్తి
తగ్గుతుంది. ముఖ్యంగా ఏ కాన్సర్ అయినా ముందుగా సూక్ష్మపరిణామంతోనే అది
పెరిగిపెరిగి నిర్దిష్టమైన పరిమాణానికి చేరేవరకు గుర్తించడం కష్టమే - ఎందుకంటే
చేయబడే పరీక్షలన్నీ కాన్సర్ కణితి పరిమాణాన్ని బట్టి వ్యాధిని గుర్తించేవిగా ఉంటాయి. లక్షణాలేమైనా పైకి కనిపించేదాకా అంతా సవ్యంగా ఉన్నట్లు
భావించడం మనలో చాలామందికి అలవాటు. వాటిని ప్రత్యేక వైద్యపరీక్షల ద్వారా మాత్రమే
గుర్తించడం జరుగుతుంది. చాలా కేసుల్లో అప్పటికే చేయి దాటిపోయి వుంటుంది. అప్పుడు
ఇక నిరాశ... పరామర్శ... దిగులు.. కృంగబాటు... అప్పులు... కబలించడానికి వస్తున్న
మృత్యువు అడుగుల చప్పుడు!
పరామర్శలకై పరితపించువారి రద్దీలో
నాళాలు కుళాయి కట్టేసినట్లు పనిచేయవు
కుండని నిండుతుంది - ఎప్పుడు పగులుతుందో!
అంటుకున్న తాడు కాలికాలి కానని విస్పోటనం
ఆనవాళ్ళూ అందని పడవ శకలాలు.
మరణమా! వెనుకా - ముందుగా వస్తాముగా
ఎందుకు ఇంతగా హింసించాలి?! అదేదో -
కాస్త దయగా, జాలిగా, ప్రేమగా, కారుణ్యంతో
నీ ఒడిలోకి తీసుకోకూడదూ-
ఎవరు శీల బిగించుకూర్చున్నారిక్కడ!
ఇంత ఆర్ధ్రమైన కవిత శ్రీ లలితానంద ప్రసాద్‌గారి ''అలౌకికం'' అన్న కవితా సంపుటిలోనిది. ఈ కవి 1953లో గుంటూరు జిల్లా పెరికలపూడిలో జన్మించారు. ఎం.కామ్., ఎంబీఏ, ఎం.ఫిల్, పిహెచ్‌డి చేశారు. 1982నుండి 2009 వరకు తణుకు ఆంధ్రా షుగర్స్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు.
తర్వాత గుంటూరులోని విజ్ఞాన్ స్కూల్ ఆఫ్ పి.జి. స్టడీస్‌లో ఎం.బి.ఏ.
శాఖాధికారిగా పనిచేశారు. ప్రవృత్తి రీత్యా మంచికవి, రచయిత, విమర్శకులు, విశ్లేషకులు, సమీక్షకులు, వివిధ ప్రతికల్లో కవితలు, వ్యాసాలు, హైకులూ ప్రచురించబడ్డాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో కవితలు, ప్రసంగాలు చేశారు. అనేక కవి సమ్మేళనాలలోను
పాల్గొన్నారు. అలౌకికం కవితా సంపుటి,
''ఆకాశదీపాలు'' పేర హైకుల
సంపుటి ప్రచురించారు. 1990-2000 మధ్య తణుకు రీడర్స్ ఫోరం అధ్యక్షులుగా ఉన్నారు.
గుఱ్ఱం జాషువా కళా ఫౌండేషన్ తెనాలివారు ''సాహిత్యభూషణ్'' పురస్కారం ఇచ్చారు. ఇటీవల దుగ్గ్గిరాలలో చిత్రీకరణ జరుపుకున్న ''మహాత్మ జ్యోతిరావు పూలే'' చలనచిత్రంలో ఒక
కీలకమైన పాత్ర పోషించారు. వ్యవసాయరంగం, ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం, అణు ఒప్పందం వంటి విభిన్న అంశాలపై వ్యాసాలు వ్రాశారు. ఉద్యోగ విరమణ
చేశాక కూడా జాతీయ సదస్సులలో పాల్గొంటున్నారు. ఎప్పుడూ చదువుతూ ఉంటేనే మనకు జ్ఞానం
పెరుగుతుంది. అప్పుడే దాన్ని నలుగురికి పంచగలమనే అభిప్రాయం లలితానంద్ వ్యక్తం
చేస్తున్నారు.
శ్రీలలితా నందప్రసాద్
డా శ్రీమతి సి.హెచ్. సుశీల