యూనిట్

నిత్య హరిత శోభితం

అన్నం ముద్దదీ

నీటి చుక్కదీ

విడదీయరాని బంధం

చినుకు చిందులేస్తేనే

చేనుకు ప్రాణకళ వచ్చేది

వర్షాభావంతో భూమి నెర్రెలు నెర్రెలుగా మారిపోతుంటే పల్లెలు, రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతుంటే, ప్రజల చేతికి అన్నం ముద్ద కరువౌతుందన్న కఠినసత్యాన్ని తన కవితల్లో విన్పిస్తారు కవి శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య. కల్లా కపటంలేని పల్లె జీవితం నుండి వృత్తిరీత్యా పట్టాణానికి చేరినా, తన మట్టివేళ్ళ మూలాలను మర్చిపోలేదు. ఆయన కవితల నిండా రైతు జీవితం, పల్లెల వాతావరణ, ఆధునీకరణ పేరుతో మారిపోతున్న పల్లెటూర్లు, ఆ వెల్లువలో కొట్టుకుపోతున్న మానవీయ విలువలు ప్రత్యక్షమౌతుంటాయి. తన ఆవేదనను సున్నితంగా నైనా, సూటిగా చెప్పడానికి వెనుకాడరు.

'తదేకగీతం' కవితాసంపుటిని అంకితం అందుకున్న ఆచార్య ఎన్‌.గోపి ముందుమాట రాస్తూ ''సోమేపల్లి వారి కవిత్వంలో పంచదార వుండదు. మట్టిజీర ఉంటుంది. భావధార వుంటుంది. దేనికైనా సంవేదనా, కవితాశక్తి, నిజాయితీ ముఖ్యం. అని వెంకటసుబ్బయ్యగారిలో పుష్కలంగా వున్నాయి'' అన్నారు.

''దేశం'' అనే నిత్యహారిత శోభితమైన చెట్టుకు టెర్రరిస్టు క్రిములు సోకాయని ఆవేదన చెందిన సోమేపల్లిగారి ''నిత్యహరితశోభితం'' ఈ నెల మన మంచికవిత.

చెట్టు చిగురై పరిమళించేదీ

పువ్వు ఫలమై కడుపు నింపేదీ

జనం గుండెల నిండా

చల్లదనపు జల్లులు వెల్లువయ్యేదీ

అన్నివేర్లూ

సుష్ఠుగా పుష్టిగా వున్నప్పుడేగా!

ఒక్క వసంత కాలమే కాదు

ఈ వృక్షం

నిత్యం చిగురిస్తూ

పచ్చదనం పంచుతూ వుండాల్సిందే

అందుకేనేమో

ఈ చెట్టుకు అన్ని వేర్లూ కొమ్మలూ!

ఎన్ని వానలు కురిస్తే ఏం లాభం..?

ఎన్ని నీళ్ళు పోస్తే ఏం ప్రయోజనం..!?

చెట్టు వడబడి పోతూనే వుంది

తల్లి వేరుకు

కులమత భాషా ప్రాంతీయ ఉన్మాదాల

చీడ సోకిందేమో!

పక్క వేర్లను

హింస, మూఢా చారాలు, అవినీతి

విషప్పురుగులై చుట్టు ముట్టాయేమో

ఏ సంహారక మందులు  చిమ్మితే

టెర్రరిస్టు క్రిములు

తుడుచుపెట్టుకుపోతాయో!

ఏ ఎరువులు వేస్తే

మళ్ళీ నిత్యహరిత శోభితమవుతుందో

శాంతి పుష్పాలు వికసించాలంటే

పురిటిగడ్డను పసిబిడ్డలా సాకాల్సిందే!

గుండెగుండెతో జతకట్టినప్పుడే

జనస్వామ్యపు తరువు

నిరంతర హరితవర్ణమై

పరిఢవిల్లుతుంది!

సంఘీభావ జపం

తూతూ మంత్రమయినన్నాళ్ళూ

ప్రజలకోసం ప్రజలే నాటుకున్న

ఈ చెట్టుకొమ్మలు

పెళుసుగా మారి

ఫెళ్ళున విరిగిపోతాయి!

తన కవితా సంపుటలకు ఆయన పెట్టిన శీర్షికలు, కవితల శీర్షికలు ఆయన ఆత్మను పట్టి ఇస్తున్నాయి. కవితా వస్తువులు కూడ వారి మనస్తత్వానికి, స్వభావానికి అద్దం పట్టేవే..1. లోయలో మనిషి 2. తొలకరి చినుకులు 3. చల్లకవ్వం 4. రెప్పలచప్పుడు 5. తదేకగీతం 6. పచ్చని వెన్నెలు.. వంటి వచన కవిత సంపుటాలు వెలువరించారు. ''తదేకగీతం'' సంపుటిపై శ్రీమతి నెల్లిమర్లలక్ష్మి పరిశోధన చేసి ఎం.ఫిల్‌. పట్టా పొందారు. ఈ సంపుటి ''మహక్‌ మా టీకీ'' పేరుతో హిందీ అనువాద గ్రంథంగా వెలువడింది.

ఉగ్రవాదం వల్ల సమాజానికి, దేశానికి ఎంత ప్రమాదం వాటిల్లుతోందో, ప్రజలు నాటుకొన్న ప్రజాస్వామ్యమనే చెట్టు ఎలా పెళుసుగా విరిగిపోతుందో పై కవితలో వివరించారు కవి సోమేపల్లి. ఏదో ఒక దేశం అనికాదు, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మారణహోమం సృష్టిస్తోంది. ఎవరైతే ఈ సర్పాన్ని పెంచిపోషిస్తున్నారో చివరికి వారినే కాటేస్తుందనటం సత్యం. అభివృద్ధికి హానికరంగా మారి, ప్రజల జీవితాలకి రక్షణ, భద్రత లేకుండా అశాంతికి గురిచేస్తున్న టెర్రరిజం పిచ్చెక్కినట్లు అమాయక ప్రాణాలను బలితీసుకుంటోంది. పేదరికం, నిరుద్యోగం ఆసరాగా తీసుకొని, యువకుల్ని డబ్బుతో ఆకర్షించి వారితో విధ్వసం సృష్టిస్తున్న వీరి ఉన్మాదాన్ని ఏ ''ఇజం''తో సమర్థించుకుంటారు! దేశ సమగ్రతకు, సమైక్యతకు భంగం కలిగిస్తు ఒక విషపూరిత విభిన్నకరమైన ఎజెండాతో, దేశంలో ఇటీవల జరిగిన కొన్ని బాంబుదాడుల్ని గమనిస్తే రాక్షసత్వం, క్రూరత్వం నిండివున్న ఉగ్రవాదం ఏమాత్రం సమర్థనీయం కాదు. దేశరక్షణకోసం ఒకవైపు సైనికులు రేయింబవళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, వారి ప్రాణాలను బలిగొనాలని తపిస్తున్న ఈ టెర్రరిజం దుశ్చర్యల్ని పార్టీలకతీతంగా అందరూ ఖండించాలి. దేశాలమధ్య, రాష్ట్రాల మధ్య, పార్టీల మధ్య, ప్రాంతాల మధ్య వున్న భేదాల్ని పక్కనపెట్టి అందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిన తీసుకుంటేనే 'నిత్యహరితశోభితమైన' వృక్షాన్ని కాపాడుకోగలం.

భారతదేశంపై దాడిచేస్తున్న శక్తులపై ప్రాణాలొడ్డి మరీ పోరాడుతున్న సైనికులపై రాళ్ళురువ్వడం అన్యాయం. అధర్మం. అలాంటివారిని సమర్థించేవారిని 'భారతీయులు' అనగలమా! మరో ఆలోచన లేకుండా ఇలాంటివారిని ఉగ్రవాదాన్ని సమర్థించేవారిని కఠినంగా అణచివేయడమే శ్రేయస్కరం. ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషిచేసే ఏ ప్రభుత్వాన్నైనా ఆహ్వానించాల్సిందే. దేశ సమగ్రతకు ముప్పుతెచ్చే టెర్రరిజానికి ముగింపు పలకాల్సిందే. సుస్థిరశాంతి నెలకొల్పాల్సిందే. కవులు కూడా తమ వంతు సేవగా దేశసమగ్రతకోసం రచనలు చేయాలి. దేశసమైక్యతకు భంగం కలిగించేలా, యువతను రెచ్చగొట్టేలా రచనలు చేయడమంటే పాలు తాగిన తల్లి గుండెల్ని తన్నినట్టే. ఆ మాత్రం సామాజిక బాధ్యత లేకుండా కవులుగా చెలామణి అవుతున్న కొందరున్న ఈ సమాజంలో, ''కష్టజీవి''కి అటూ ఇటూ నిలచిన కవులూ ఉన్నారు. అలాంటి కవి సోమేపల్లి వెంకటసుబ్బయ్య.

వృత్తిపరంగా ''డా|| కె.ఎల్‌,రావు సాగర్‌ (పులిచింతల) ప్రాజెక్టు, స్పెషల్‌ కలెక్టరు (భూసేకరణ) విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా''గా నిరంతరం ఉద్యోగ బాధ్యతలతో మునిగివున్నా, ప్రవృత్తి రీత్యా కవిగా తన మనోభావాల్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే వున్నారు. 2007 జులై నుండి నేటివరకు ''గుంటూరు జిల్లా రచయితల సంఘం'' అధ్యక్షునిగా, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రచయితల సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత అర్ధదశాబ్ధం నుండి గుంటూరు జిల్లా రచయితల సంఘం పేరుతో కథా ప్రక్రియలలో ఒకటి, కవితా ప్రక్రియలో ఒకటి రాష్ట్రస్థాయిలో రచనలను ఆహ్వానించి పురస్కారం అందజేయడం జరుగుతోంది. వారి సాహిత్యకృషికి గాను 2008లో ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా సంఘంచే ''తెలుగుభాషా విశిష్ఠ పురస్కారం'' అందుకున్నారు. అలాగే ఆంధ్రసారస్వత సమితి, మచిలీపట్నం వారిచే, తెలుగు భాషా వికాస సమితిచే గిడుగు స్మారక పురస్కారం అందుకున్నారు. సోమేపల్లి వెంకటసుబ్బయ్యగారు మితభాషి, మృధుభాషి. ఆయన కవితలన్నీ ఆర్ధ్రసమన్వితాలు.

 సంకలనం- డా. శ్రీమతి సి.హెచ్‌. సుశీల

9849117879

వార్తావాహిని