యూనిట్
Flash News
మహిళలు పనిచేసే చోట్లు భద్రమైనవిగా ఉండాలి - కొండవీటి సత్యవతి
మహిళలు పనిచేసే చోట్లు భద్రమైనవిగా ఉండాలి - కొండవీటి సత్యవతి మహిళలు,బాలికల మీద విపరీతమైన హింస పెరిగిపోతున్న ఈనాటి సందర్భంలో, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేసిన అనేక చట్టాల గురించి రాయాలని ప్రయత్నిస్తున్నప్పుడు కళ్ళ ముందు ఎన్నో చట్టాలు కదలాడుతున్నాయ్. ముఖ్యంగా ఇంటిలో ఎదురయ్యే గృహ హింస నివారణ కోసం గృహ హింస నిరోధక చట్టం 2005 పోరాడి తెచ్చుకున్నాం. దాని ప్రచారం కోసం, పకడ్బందీ అమలు కోసం, వనరులు, మానవ వనరుల కోసం పోరాడుతూనే ఉన్నాం. చట్టం అమలులోకి వచ్చి దశాబ్దకాలం దాటిపోయినా చదువుకున్న స్త్రీలకు కూడా చట్టం పట్ల అవగాహన లేదు. అవగాహన ఉన్నవాళ్ళు చట్టం ద్వారా రక్షణ పొందాలని ప్రయత్నించినా న్యాయవ్యవస్థలో జెండర్ స్ప్రహ లోపించడంవల్ల ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ న్యాయం దొరకడంలేదు. బాధిత స్త్రీలు చకోర పక్షుల్లా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉండాల్సి వస్తోంది. ఇక 2013లో వచ్చిన ‘పనిచేసేచోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2003’. ఈ చట్టానికి 1999లోనే పునాది పడింది. రాజస్థాన్‍లో భన్‍వారీ దేవి మీద జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెకు రాజస్థాన్‍లో దొరకని న్యాయం విశాఖ గైడ్‍లైన్స్ పదిహేనేళ్ళ తర్వాత వచ్చిన పనిచేసేచోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013. వివరాల్లోకి వెళ్తే భన్‍వారీ దేవి రాజస్థాన్ ప్రభుత్వ స్త్రీ శిశు అభివృద్ధి శాఖలో ‘సాథిన్’గా పనిచేసేది. గ్రామాల్లో తిరుగుతూ బాల్య వివాహాలు జరక్కుండా నిరోధించడం ఆమె ఉద్యోగ ధర్మం. అలా తన ఉద్యోగ విధులు నిర్వర్తించుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళినపుడు, ఆ గ్రామంలో ఒక అగ్రవర్ణ కుటుంబంలో జరుగుతున్న బాల్యవివాహం ఆమె కంటపడింది. ఆ వివాహం జరక్కుండా అడ్డుపడింది. పెళ్ళి ఆగిపోయింది. రెండు, మూడు రోజుల తర్వాత ఆమె తన భర్తతో కలిసి వేరే గ్రామానికి వెళుతున్నపుడు, ఆమెను అడ్డగించి భర్త కళ్ళెదుటే ఆమెమీద సామూహిక అత్యాచారం చేశారు. ఆమె దళిత స్త్రీ కాబట్టి పోలీసులు ఎఫ్‍ఐఆర్ కూడా నమోదు చెయ్యలేదు. దేశవ్యాప్తంగా స్త్రీలందరూ పెద్ద ఎత్తున ఉద్యమించి ఎఫ్‍ఐఆర్ నమోదు చేయించారు. కేసు కోర్టుకెళ్ళినపుడు, రాజస్థాన్ హైకోర్టు ఒక ఘోరమైన తీర్పునిచ్చింది. ‘‘అగ్రవర్ణాల వారు దళితులను ముట్టుకోరు. అత్యాచారం ఎలా చేస్తారు?’’ ఇదీ ఆ తీర్పు సారాంశం. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ‘‘విశాఖ’’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. ఈ అప్పీల్‍ను విచారించిన సుప్రీంకోర్టు మహిళలు పనిచేసే చోట ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారో వివరిస్తూ, స్వతంత్ర భారత న్యాయ వ్యవస్థలోనే తొలిసారి లైంగిక వేధింపులంటే ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలో నిర్వచిస్తూ ‘‘విశాఖ గైడ్‍లైన్స్’’ పేరుతో తీర్పును వెలువరించింది. మహిళలు పనిచేసే ప్రతిచోటా అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని, వాటి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలని, కమిటీల ఉనికి గురించి ఉద్యోగినుల్లో అవగాహన కల్పించాలని ‘‘విశాఖ గైడ్‍లైన్స్’’లో విస్పష్టంగా పేర్కొన్నారు. జెండర్ సెన్సిటివిటీతోను, మహిళల సమస్యల పట్ల సహానుభూతితోనూ వ్యవహరించే జస్టిస్ వర్మ, జస్టిస్ సుజాతా మనోహర్‍లు ఈ తీర్పును వెలువరిస్తూ, పనిచేసేచోట మహిళలపై లైంగిక వేధింపులను నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన చట్టం తీసుకు రావాలని, అప్పటివరకు ‘‘విశాఖ గైడ్‍లైన్స్’’ చట్టంలాగానే అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 1999లో ‘‘విశాఖ గైడ్‍లైన్స్’’ వెలువడితే 2013 వరకూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. ఎన్నో చర్చోపచర్చలు, మార్పులు, చేర్పులు చేశాక ‘‘పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013’’ అమలులోనికి వచ్చింది. విధివిధానాలు కూడా రూపొందాయి. స్త్రీ శిశు అభివృద్ధి శాఖను సమన్వయ శాఖగా నిర్వచిస్తూ విధివిధానాలు వెలువడ్డాయి. చట్టం అమలు బాధ్యత స్త్రీ శిశు అభివృద్ధి శాఖకు అప్పగించారు. అంటే ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వేతర, సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు, అవగాహన కల్పించడం, ప్రతి కమిటీలోను ఎన్జీఓ సభ్యులు ఉండేలా చూడడం ఇవన్నీ పర్యవేక్షించాల్సిన బాధ్యత స్త్రీ శిశు అభివృద్ధి శాఖ చాలా గురుతరమైన బాధ్యతను కలిగి ఉంది. అంతేకాకుండా వార్షిక నివేదికలు తెప్పించుకోవడం, ఆ నివేదికలో ఫిర్యాదుల కమిటీల వివరాలు, ఎన్ని సమావేశాలు జరిగాయి, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, విచారణ జరిగిందా లేదా? ఉద్యోగుల కాండక్ట్ రూల్స్లో ‘‘లైంగిక వేధింపులు’’ నేరం, క్రమశిక్షణా చర్యలు ఉంటాయి, సర్వీస్ రిజిస్టర్‍లో రెడ్ ఎంట్రీలుంటాయి, నేరానికి తగిన శిక్షలుంటాయి లాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారా? లేదా? అనికూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఈ శాఖదే. చట్టం అమలులోకి వచ్చి సంవత్సరాలు జరిగిపోతున్నా అమలులో నత్తనడకనే ఉంది. చాలా ప్రభుత్వ కార్యాలయాలే అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయలేదు. కమిటీలు ఏర్పాటు చేయకపోతే రూ.50 వేల జరిమానాతో పాటు శిక్షలు కూడా ఉంటాయని చట్టంలో ఉన్నా ఎవ్వరికీ లెక్కలేదు. కొన్ని కార్యాలయాల్లో ‘నామ్ కే వాస్తే’ కమిటీలు పెట్టి గమ్మున కూర్చున్నారు తప్ప ఎలాంటి ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చెయ్యడంలేదు. వార్షిక నివేదికల్లో వారి వారి కార్యాలయాల్లో కమిటీల అంశం, విచారణలు, కేసుల వివరాల నివేదికను ఇవ్వడంలేదు. ఎందుకివ్వడం లేదని అడిగేవారు లేరు. జిల్లాలలో లోకల్ ఫిర్యాదుల కమిటీలు పెట్టి, పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది మహిళల్లో అవగాహన కల్పించాల్సిన కలెక్టర్లు ఎవ్వరూ ఆ పని చేయడంలేదు. కొంతమంది కలెక్టర్లు లోకల్ ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసినా అవి పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇదీ ఈ చట్టం అమలు తీరు. అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసిన చాలా ప్రభుత్వ శాఖల్లో మేము సభ్యులుగా ఉన్నాము. కొన్ని శాఖలు కమిటీలు పెట్టి మౌనం వహిస్తే కొన్ని శాఖలలో ఉద్యోగినులు ఫిర్యాదులివ్వడం వల్ల తప్పనిసరిగా పనిచేయాల్సిన స్థితి. దక్షిణ మధ్య రైల్వే, ఇండస్ట్రియల్ పోలీస్, బిహెచ్‍ఇఎల్, నేషనల్ పోలీస్ అకాడమీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, తెలంగాణ ఫుడ్స్, జె.ఎన్.వి లాంటి పెద్ద సంస్థల్లో కమిటీ సభ్యురాలిగా మేము ఎన్నో కేసులు విచారించాము. పనిచేసేచోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 అమలులోకి వచ్చిన తర్వాత అవగాహన ఉన్న మహిళలు ఫిర్యాదులు చేయడానికి ముందుకొస్తున్నారు. ఆయా కేసుల విచారణ సందర్భంగా వెలుగుచూస్తున్న అంశాలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. మహిళలు రోజంతా ఆఫీసుల్లో ఎలాంటి భయానక వేధింపుల మధ్య పనిచేస్తుంటారో వింటున్నప్పుడు గుండె మండడంతోపాటు చాలా దు:ఖం కలుగుతుంది. సంవత్సరాలుగా కలిసి మెలిసి పనిచేసే తోటి ఉద్యోగులతో స్నేహం సంగతి అటుంచి ఎంత వికృతంగా ప్రవర్తించగలరో బాధితులు చెబుతున్నపుడు వాళ్ళ కళ్ళే కాదు మా కళ్ళూ తడయిపోతుంటాయి. క్రమశిక్షణకి మారుపేరుగా ఉండే, యూనిఫామ్ వేసుకునే ఉద్యోగుల్లో సైతం ఎంత వికృతం దాగి ఉంటుందో, తమతోపాటు విధులు నిర్వర్తించే మహిళల పట్ల ఎంత ఇన్‍సెన్సిటివ్‍గా ప్రవర్తిస్తారో వినేటప్పుడు, వారి క్రమశిక్షణ, యూనిఫామ్‍లు డొల్లగా అనిపించక మానవు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో నేను విచారించిన చాలా కేసుల్లో తమ తోటి ఉద్యోగినులతో అక్కడి పురుష ఉద్యోగులు ప్రవర్తించిన తీరు పరమ జుగుప్సాకరంగా ఉంది. అంతర్గత కమిటీ ఏర్పాటు చేయడం వల్లనే ఆ మహిళలంతా మౌనాన్ని, భయాన్ని వదిలి ముందుకొచ్చి ఫిర్యాదు ఇవ్వగలిగారు. కమిటీలే లేకపోతే... పనిచేసే చోట మహిళలకు రక్షణని కల్పించే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కార్యాలయాల్లో, అంతర్గత ఫిర్యాదుల కమిటీలను, జిల్లా స్థాయిలో లోకల్ ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలి. శిక్షణలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. వేధింపులను మౌనంగా భరిస్తున్న ఎంతో మంది మహిళలకి ఈ చట్టం ద్వారా రక్షణ ఉందని, ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించి, ఆమెకు న్యాయం అందించడమే చట్టం ముఖ్యోద్దేశం అనే ప్రచారం ముమ్మరంగా జరగాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.