యూనిట్
Flash News
జెండర్ స్ప్రహ ఎందుకుండాలి?
జెండర్ స్ప్రహ ఎందుకుండాలి? - కొండవీటి సత్యవతి మూడు దశాబ్దాల క్రితం స్త్రీల అంశాలపై పని చేయడం మొదలు పెట్టినప్పుడు నాకు ప్రభుత్వ వ్యవస్థలతో, ముఖ్యంగా పోలీసులతో కలిసి పనిచేయడం ఇష్టముండేది కాదు. ‘ఖాకీ’ పదం చుట్టూ పేరుకున్న కరుకుదనం బహుశా నేనీ అభిప్రాయానికి రావడానికి కారణమయ్యుండవచ్చు. అందుకే చాలా కాలం వరకు పోలీస్ వ్యవస్థ పట్ల నెగిటివ్ గానే ఉన్నాను. అయితే 2005 సంవత్సరంలో సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం ఒక హెల్ప్ లైన్ ని ప్రారంభించాక నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజలందరికీ, ముఖ్యంగా స్త్రీలకు ఏ కష్టం వచ్చినా, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా వారు పరుగెత్తేది సమీపంలోని పోలీస్ స్టేషన్లకే. పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే ఎంత భయమున్న, బెదురున్నా చాలా మంది స్త్రీలు పోలీస్ స్టేషన్లకి వెళతారు. తమ సమస్యని చెప్పుకుంటారు. తమకు రక్షణ కల్పించమని అడుగుతారు. తనను హింసిస్తున్న భర్తను పిలిచి బుద్ధి చెప్పమని, భయపెట్టమని బతిమాలుతారు. కొట్టొద్దని కూడా చెబుతారు. సమస్యలతో, గృహహింసతో తమ వద్దకొచ్చిన బాధిత స్త్రీల పట్ల అప్పటి పోలీసులు సున్నితంగా వ్యవహరించే వారు కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు మామూలేనని, ఇలా చిన్న విషయాలకు పోలీస్ స్టేషనుకు రావడం తప్పని, ఆమెనే సర్దుకుపోవాలని నయానో, భయానో చెప్పి పంపించేవారు. భర్తని అరెస్ట్ చెయ్యమని, దండించమని చెప్పడం చాల అరుదు. భర్తని పిలిచి భయపెడితే అతను సవ్యంగా, సంసారం చేస్తాడని అనుకునే వారు. ఇప్పటికీ అలా కొట్టుకునే వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. నిజానికి 1983 సంవత్సరంలో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498ను సవరించి ఐ పి సి 498 (ఏ) ని చేర్చేవరకు గ•హహింసకు గురయ్యే స్త్రీలు పోలీస్ స్టేషన్ కి వచ్చినా కేసు పెట్టడానికి ఏ సెక్షనూ లేదు. ఎనభై దశకంలో కిరోసిన్ స్టవ్ పేలి నవవధువుల దుర్మరణాలు పెరిగిపోవడంతో జరిగిన అధ్యయనాలు, స్త్రీల సంఘాల డిమాండ్, అత్తింట్లో పెరిగిపోతున్న భయంకర హింస, వరకట్న హత్యలు ...వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే 498 ఏ చట్టమొచ్చింది. అత్తింట్లో తీవ్రమైన వేధింపులు, అదనపు కట్నం కోసం హత్యలు పెరిగిపోవడంతో పోలీసులు 498 ఏ కింద కేసులు పెట్టడం మొదలైంది. ఆ తర్వాత 2005లో గృహహింస నిరోధక చట్టం 2005 వచ్చింది. 498 ఏ క్రిమినల్ చట్టం. గృహహింస నిరోధక చట్టం సివిల్ చట్టం. పోలీసుల ప్రమేయం పెద్దగా లేని ఈ సివిల్ చట్టం ద్వారా బాధిత మహిళలకి అవసరమైన పరిహారాలన్నీ అందచేసే చట్టం ఇది. 498 ఏ కింద భర్తల్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం వాళ్ళ గృహహింస నెదుర్కుంటున్న స్త్రీకి ఒరిగేది ఏమీ లేదని అర్థమయ్యాక గృహహింస నిరోధక చట్టం కింద కేసు వేసుకోవాలని, పోలీసుల దగ్గరకి కాకుండా, రక్షణాధికారుల దగ్గరకు (స్త్రీ శిశు సంక్షేమ శాఖ) వెళ్లాలని, తమకు కావల సిన పరిహారాలు పొందాలని చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం భారత ప్రభుత్వ పథకం వన్ స్టాప్ సెంటర్ దేశమంతా మొదలైంది. తెలంగాణ, ఆంధప్రదేశ్ లో ‘సఖి’ సెంటర్ పేరుతో ఇవి మొదలయ్యాయి. అలాగే స్త్రీల కోసం ఇరవై నాలుగంటలు పనిచేసే హెల్ప్ లైన్ (181) నడుస్తోంది. 2005లో భూమిక హెల్ప్ లైన్ (1800 425 2908) ప్రారంభమయ్యాక, హెల్ప్ లైన్ ద్వారా మాకొచ్చిన ఫీడ్ బ్యాక్ ను విన్నాక పోలీస్ వ్యవస్థతో కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకోవడం, మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్లు నడపడం, జెండర్ సెన్సిటివి మీద ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాం. అప్పటివరకు దూరం పెట్టిన పోలీస్ వ్యవస్థలతో చాల దగ్గరగా పని చేయడం మొదలు పెట్టి చాల కాలమే అయింది. ఇరవై, ముప్ఫయ్ ఏళ్ల క్రితం నాటి పోలీసులకి ఇప్పటి పోలీసులకి చాల తేడా ఉంది. క్రొత్తగా పోలీస్ శాఖలోకి వస్తున్నా యువ అధికారుల ఆలోచనా ధోరణిలో చాల మార్పులొచ్చాయి. దానికి కారణం వారికీ అందిస్తున్న శిక్షణలో, బోధిస్తున్న అంశాల్లో మార్పులు చోటుచేసుకోవడం. జాతీయ స్థాయిలో జెండర్ సెన్సిటివిటీ శిక్షణాంశంగా చేర్చడం వాళ్ళ పోలీసులకి జెండర్ ఆధారంగా స్త్రీల మీద ఎలాంటి హింస అమలవుతుందో, కుటుంబంలో పిత్రుస్వామ్య భావజాలాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేయించాయి. జెండర్ బేస్డ్ వయోలెన్స్ అంటే ఏమిటో అర్థమవ్వడం వల్ల పిల్లలు, మహిళల అంశాలను ఎలా అర్థం చేసుకోవాలో, వారు తమ వద్దకు సమస్యలతో వచ్చినపుడు సున్నితంగా, సెన్సిటివిటీతో ఎలా ప్రవర్తించాలో, వారికీ ఇస్తున్న శిక్షణలో భాగమవ్వడం వల్ల ఇప్పటి పోలీసులు కొంతమేరకైన సున్నితంగా వ్యవహరించ గలుగుతున్నారు. ప్రజల రక్షణ కోసం మాత్రమే పనిచేసే పోలీసులకు జెండర్ సెన్సిటివిటీ ఎందుకుండాలి? మన సమాజంలో ప్రజలందరూ ఒకే స్థాయిలో లేరు. స్త్రీలు, పురుషులు సమాన హోదాలు కలిగి లేరు. అలాగే దళితులు, ఆదివాసీలు, అల్పసంఖ్యాక వర్గాల వారు సమానంగా లేరు. ఎన్నో అంతరాలున్నాయి. పొలీసు వ్యవస్థ అందరికీ ఒకేలా రక్షణ కల్పించాల్సి ఉంటుంది. స్త్రీలు తమ జెండర్ కారణంగానే విపరీతమైన హింసని అనుభవిస్తున్నారు. లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారు. రక్షణ కోరుతూ తమవద్దకు వచ్చిన వివిధ వర్గాల బాధితులకు అండగా ఉండాలన్న, వారి సమస్యలను అర్థం చేసుకోవాలన్న జెండర్ స్ప హ చాల అవసరం. ఆధునిక పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నదనే పేరు నిజమవ్వడానికి గీటురాయి వారిలో వెల్లివిరిసే జెండర్ స్ప్రహ మాత్రమే. వారి భాష, శరీర భాషా ప్రవర్తనలో సున్నితత్వం వ్యక్తమవ్వాలంటే వారికి జెండర్ సెన్సిటైజేషన్ శిక్షణ చాల అవసరం. పాతుకుపోయిన భావాల్లో మార్పు రావాలంటే వారికీ క్రమం తప్పని శిక్షణాలవసరం అన్నది పోలీస్ విభాగం గుర్తించడం ఎంతైనా ముదావహం. ఈ మార్పును అర్థం చేసుకోవడం వల్లనే ఎన్నో సివిల్ సొసైటీ సంస్థలు, స్వచ్చంద సంస్థలు పోలీసులతో మమేకమై పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇందుకు నేను మినహాయింపు కాదు. బాధితులకు సహకరించడానికి, సహాయమందించడానికి, రక్షణ కల్పించడానికి జెండర్ స్ప్రహతో ముందుకు నడుస్తున్న పోలీసులతో మేమూ నడుస్తున్నది ఇందుకే.