యూనిట్

అమ్మ ఇంట్లో వండును... నాన్న సంపాదించి తెచ్చును- ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు - కొండవీటి సత్యవతి

అమ్మ ఇంట్లో వండును... నాన్న సంపాదించి తెచ్చును- ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు - కొండవీటి సత్యవతి ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‍ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల మీద ఈ మీటింగులో మాట్లాడాలని, వారిని చర్చల్లో చురుకుగా పాల్గొనేటలా ప్రోత్సహించాలని తను చెప్పింది. ‘జండర్‍ సెన్సిటివిటీ’ గురించి కూడా మాట్లాడాలని నేను సూచించాను. నాతో పాటు ఇంకో ఫ్రెండ్‍ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పదకొండు గంటలకి మీటింగు మొదలైంది. మూడొంతులు మగపిల్లలు, ఒక వంతు ఆడపిల్లలు వున్నారు. మగపిల్లలు అల్లరిగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయిలు ముసి ముసి నవ్వులు ఒలకబోస్తూ, ముడుచుకుని కూర్చున్నారు. నేను కొంత ఆశ్చర్యపోయాను. అమ్మాయిలు ఇంకా ఇంత ఒద్దికగా కూర్చునే వుంటున్నారా? వాళ్ళుకూడా బాగా అల్లరి చేస్తారేమోనని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. యుగాలు గడిచినా ఈ బిడియం, ఒద్దిక వీళ్ళను వొదలవా అన్పించింది. మేము పిల్లల్ని చర్చల్లోకి దింపడానికి ప్రయత్నిస్తూ మీకు మళ్ళీ పుట్టడానికి అవకాశమొస్తే, ఆ జన్మలో అమ్మాయిగా పుట్టాలను కుంటారా?’’ అబ్బాయిగా పుట్టాలనుకుంటారా?’’ అని అడిగాం. అబ్బాయిలంతా మగవాళ్ళగానే అని అరిచారు. అమ్మాయిల వేపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సరే అయితే మీరు అబ్బాయి గానే ఎందుకు పుట్టాలని కోరు కుంటున్నారో ఒక్కొక్కరూ వచ్చి చెప్పండి. అంటే వరుసగా కుర్రాళ్ళు లైన్‍ కట్టారు. వాళ్ళు చెప్పిన పాయింట్లు ‘స్వేచ్ఛ వుంటుంది. బల ముంటుంది. ఏమి చెయ్యాలన్పిస్తే అది చెయ్యొచ్చు. ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవచ్చు. అమ్మాయిలని ఏడిపించ వచ్చు. ఇంకా చాలా చాలా చెయ్యొచ్చు.’’ అంటూ చెప్పుకుపోయారు. అమ్మాయిలు కొంతమంది ముందుకొచ్చి మాట్లాడారు కానీ స్పష్టంగా వ్యక్తీకరించ లేకపోయారు. ‘‘ఆడవాళ్ళకి సహనముంటుంది. ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు నడవదు. పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తారు’’ లాంటి సమాధానంతో వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత ఆడవాళ్లు ఏ పనులు చేస్తారు? మగవాళ్ళు ఏ పనులు చేస్తారు. అన్ని పనుల్ని అందరూ చెయ్యగలరా? అని అడిగాం. మగపిల్లలు ఏక కంఠంతో మగవాళ్ళే ఎక్కువ కష్టపడతారు. ఆడవాళ్ళు అన్ని పనులూ చెయ్యలేరు. మగవాళ్ళు సంపాదించి తెస్తే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని తింటారు. అని ఒక కుర్రాడు అంటే, ఇపుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు కదా. ఇక్కడ మీ లెక్చరర్స్ వున్నారు కదా! అంటే ఆ కుర్రాడు నాలుక్కరుచుకుని తలవంచుకున్నాడు. హఠాత్తుగా ఓ కుర్రాడు ‘‘ఔరత్‍ లోగ్‍ కుచ్‍ నహీ కర్తే... ఘర్‍ మే ఆగ్‍ లగాతే’’ అన్నాడు. అక్కడున్న అందరం అదిరిపడ్డాం. ‘ఆడవాళ్ళు ఇంట్లో ఏ పనీ చెయ్యరు. మంటలు రేపుతుంటారు’ అని ఆ కుర్రాడు అన్న మాట మాకు శూలంలా తగిలింది. అమ్మాయిలు అతడికి ధీటుగా సమాధానమిస్తారేమోనని చూసాం. కానీ ఒక్క అమ్మాయి నోరు విప్పలేదు. ఆ తర్వాత మేము ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలుచేసే పనుల మీద ‘యూనిసెఫ్‍’ రూపొందించిన ఒక పోస్టర్‍ని ప్రదర్శించి దీన్ని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు. అని అడిగాం. ఆ పోస్టర్‍లో ఒక స్త్రీ ఇరవై నాలుగు చేతుల్ని కలిగి, ఒక్కో చేత్తో ఒకో పని-ఇంటిపని, పిల్లల పని, వంట పని, పొలం పని, పశువుల పని, ఉద్యోగం, నీళ్ళు తేవడం, వంట చెరుకు తేవడం, పెద్దల సంరక్షణ, బట్టలుతకడం, వాహనాలు నడపడం, నర్సులుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, అధికారులుగా, పోలీసులుగా, సైనికులుగా ఇలా ఎన్నో అవతారాల్లో అనుక్షణం పనిచేసే స్త్రీమూర్తి చిత్రమది. ఆ తర్వాత ‘‘ప్రపంచం మొత్తంలో మూడొంతుల పనిని స్త్రీలే చేస్తారని, కాని వారికి వనరుల్లో ఒక్క శాతం వాటా కూడా లేదని’’ యునైటైడ్‍ నేషన్స్ రూపొందించిన కోటేషన్‍ని వాళ్ళ ముందు పెట్టాం. ఇపుడు మళ్ళీ చెప్పండి. స్త్రీలు ఏ పనీ చెయ్యకుండా ఊరికే ఇంట్లోనే వుంటారా? మీ ఇంట్లో మీ అమ్మ ఏమేం పని చేస్తుందో, మీ కంచంలోకి అన్నం ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ‘ఆగ్‍’ అన్న కుర్రాడు ఆశ్చర్యంగా పోస్టర్‍ని చూడ్డం గమనించాను. ‘‘మీకు స్వేచ్ఛ వుందని. ఏమైనా చెయ్యగలమనీ చెప్పారు కదా! మీ అక్క చెల్లెళ్ళకి ఈ స్వేచ్ఛ ఎందుకు లేదో! మీలాగా ఎందుకు బయట ఫ్రీగా తిరగలేకపోతున్నారో ఆలోచించారా? అని అడుగుతూ ‘టీజింగు’ గురించి అమ్మాయిల్ని ఏడిపించడం గురించి అడిగాం. మేము ‘టీజ్‍ చెయ్యడం అమ్మాయిలకి ఇష్టం. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా టీజ్‍ చేస్తున్నారు. అసలు వీళ్ళు వేసుకునే డ్రెస్సులు మమ్మల్ని రెచ్చగొట్టేలా వుంటాయి. అందుకే వెంటపడి ఏడిపిస్తాం.’’ అన్నారు కుర్రాళ్ళు. మీరు కూడా షార్ట్లు, చెడ్డీలు, గోచీలు పెట్టుకుని తిరుగుతారు కదా! అమ్మాయిలు మీ వెంట పడతారా? చీరలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా! ఈవ్‍ టీజింగుకి, రేప్స్కి, వస్త్రధారణకి సంబంధం లేదని తేలిపోయింది కదా! అంటే నిశ్శబ్దం. అలాగే ప్రేమ దాడుల మీద హాట్‍ హాట్‍ చర్చ జరిగింది. ‘‘ప్రేమించడం మా హక్కు. మమ్మల్ని ప్రేమించకపోతే చంపడం కూడా మా హక్కు’’ లాంటి వాదనల్లోంచి- అమ్మాయిలు మిమ్మల్ని బలవంతంగా ఎందుకు ప్రేమించాలి. ప్రేమ సహజంగా వికసించాలి గానీ, ప్రేమించక పోతే యాసిడ్‍ పోస్తాం. కత్తుల్తో నరుకుతాం అంటే అది ప్రేమ అవుతుందా? ప్రేమకి, యాసిడ్‍కి, కత్తులకి ఎలా పొంతన కుదురుతుంది. అమ్మాయిలకి ‘నో’ అనే హక్కు వుంటుంది కదా! అంటే మగపిల్లల వేపు మహా నిశ్శబ్దం. రెండు గంటలకి సమావేశం ముగిసింది. హాలు విడిచి వెళుతున్న రేపటి తరాన్ని చూస్తుంటే ఎంత దిగులేసిందో చెప్పలేను. వాళ్ళ మనసుల్లో, బుర్రల్లో నిండిపోయిన బూజు భావాలు, స్టీరియోటిపికల్‍ ఇమేజీలు నన్ను భయభ్రాంతను చేసాయి. రొడ్డ కొట్టుడు పాఠాలు తప్ప జీవితానికి అవసరమయ్యే పాఠాలు, మానవ సంబంధాలు, మానవ హక్కులు, జండర్‍ సమానత్వం, సమాజం గురించిన అవగాహన వాళ్ళకు అందియ్యని విద్యావిధానం మీద రోత పుట్టింది. విజ్ఞానాన్ని, విలువల్ని, సాహిత్యాన్ని, చక్కటి ప్రేమ భావనలని వాళ్ళకి దూరం చేసిన సమస్తం మీద- ముఖ్యంగా మీడియా, రాజకీయ నాయకులు, విద్యావిధానంమీద అలవికాని కోపంతో నా మనసు రగిలిపోయింది. సాధ్యమైన కాలేజీలు తిరిగి ఇలాంటి సమావేశాల ద్వారా యువ తరంతో మాటామంతీ కలపాలని బలమైన నిర్ణయం చేసుకున్నాక మనసు శాంతించింది.

వార్తావాహిని