యూనిట్

ధీర గాంభీర్యాల వెనక దాగిన వేదన

ఇటీవల ఓ జాతీయ స్థాయి ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన ఒక వార్తను ప్రచురించింది. ‘‘లెటజ్‍ టాక్‍ మెన్‍’’ అనే పోగ్రాం కింద ఢిల్లీలో కొన్ని డాక్యుమెంటరీ సినిమాలను ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీలన్నీ మగవారికి సంబంధించిన ప్రవర్తన, వాళ్ళల్లో ఉండే అపసవ్య నమ్మకాలు, పురుషత్వం గురించిన భ్రమలు వీటన్నింటి గురించి చర్చించాయి.’’ ఇప్పటి వరకు పురుష ఉద్యమం మొదలవ్వకపోవటం నిజంగా విషాదం. ఇప్పటికైనా మగవాళ్ళు కళ్ళు తెరిచి తమ గురించి తాము తెలుసుకోవాలి. అనుభవాలు పంచుకోవాలి. అంతేకాకుండా ఫెమినిష్ట్ ఉద్యమం తరహాలో ఒక పురుష ఉద్యమం మొదలవ్వాల్సి ఉంది. తమను తాము ఆవిష్కరించు కోవటానికి సరిపడిన భాష, ఒక వేదికల అవసరం ఇపుడెంతో ఉంది’’ అంటారు సినీ నిర్మాత రాహుల్‍ రాయ్‍. ‘‘నాకు అంతా తెలుసు, అన్నీ తెలుసు’’ అనే అహంకారపు ధోరణి వల్ల మగవాళ్ళు చాలా కోల్పోతుంటారు. ఏమీ తెలియకపోయినా తెలిసినట్లు గప్పాలు కొట్టడం, తెలియదని చెప్పడానికి బిడియ పడడం వల్ల జీవితంలో చాలా పోగొట్టుకుంటారు. ఆడవాళ్ళకి సంబంధించిన సమస్తం తమకు తెలుసునని భ్రమపడడమే కాకుండా, ఆడవాళ్ళకి ఏమీ తెలియదు, తమ ద్వారానే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు అని కూడా అనుకుంటారు. పురుషాహంకారపు పొరలు కళ్ళకు కమ్మడం వల్ల నిజాల్ని చూడడానికి ఇష్టపడరు. తమకు ఏం కావాలి అనే దానికన్నా తమ నమ్మకాలు నడిపించిన దారిలో కళ్ళు మూసుకుని వెళ్ళి పోతుంటారు. ఏమీ తెలియని విషయాల గురించి కూడా ‘‘ఎలాగోలా మానేజ్‍ చేయగలను’’ ‘‘నాకు తెలియని విషయాలు ఏమున్నాయి’’ అని బుకాయించేస్తారు. అయితే ఈ ‘‘లెటజ్‍ టాక్‍ మెన్‍’’ పోగ్రాంకి వచ్చిన మగవాళ్ళెందరో తమ మనసుల్లోని సందేహాలను, అనుమానాలను ఎల•ంటి దాపరికమూ లేకుండా బయట పెట్టుకోవడమో కాక తమకు చాలా విషయాలు తెలియవని ఒప్పుకున్నారు. ‘‘సర్‍ జి! నా కలల్లో ఎప్పుడూ ఆడపిల్లలెందుకు వస్తారు? నేను బస్‍ స్టాప్లోనో, రోడ్డుపైనో చూసిన అమ్మాయిలంతా నా కలల్లో కెందుకొస్తారు’’ అయోమయంగా అడిగే రాం దేవ్‍. ‘‘ధూల్‍ కా ఫూల్‍’’ సినిమాలో రాజేంద్ర కుమార్‍, మాలసిణాతో ఒక్కసారే సెక్సులో పాల్గొంటారు. వెంటనే పాప పుడుతుంది. ‘‘ఒక్కసారికే పిల్లలు పుడతారా నిజంగా’’ ఆశ్చర్యంతో తలమునకలయ్యే సంజు. నాకు పెళ్ళి కుదిరింది. మెదటి రాత్రి గురించి నాకు ఎంతో టెన్షన్‍గా ఉంటుంది. నాకెన్నో అనుమానాలు ఉన్నాయి కాని అడిగితే ఏమనుకుంటారోనని భయం. మగ పుట్టుక పుట్టాక ఆమాత్రం తెలియదా అని వెక్కిరిస్తారని బెదురు’’ అంటూ బెదురు బెదురుగా ప్రశ్నించే బంటీ లాల్‍. ‘‘నాకు ఫుట్‍ బాల్‍ ఆడటం కన్నా పువ్వుల తోటల్ని పెంచటం ఇష్టం. పువ్వులు సున్నితమైనవి. మగవాడు కఠినమైన పనులే చెయ్యాలి అంటూ నా మీద చాలా ఒత్తిడి చేసారు’’ అనే నేపాలీ యువకుడు. రోడ్ల మీద, పబ్లిక్‍ ప్లేసెస్‍లో అమ్మాయిల్ని ఏడిపించడం ప్రతి సినిమా హీరో చేస్తాడు కదా. మేము చేస్తే తప్పేంటి? పైగా ఆడపిల్లలు మేము చేసే టీజింగ్‍ని ఇష్టపడతారు. అంటూ అమాయకంగా చెప్పే చందూ.. ఈ అభిప్రాయాలన్నీ చదివినపుడు చాలా ఆశ్చర్యం వేసింది. జీవితం పట్ల, స్త్రీల పట్ల వీళ్ళ అభిప్రాయాలు, నమ్మకాలు ఎంత అజ్ఞానంతో కూడుకుని ఉన్నాయో చదివినపుడు వెన్నుమీద ఏదో జరజరా పాకిన అనుభూతి కలుగుతుంది. ‘‘అన్నీ తెలుసనే’’ అహంకారపు ధోరణి వెనక ఎంత అజ్ఞానం దాగివుందో, ఎన్ని సందేహాలు ఉన్నాయో అర్థమౌతుంది. మగవాడంటే కఠినంగా, ధీరంగా, గంభీరంగా ఉండాలనే ప్రచారాన్ని నమ్మి ఎంత మంది తమలోని సున్నిత్వాన్ని, సౌకుమార్యపు భావాల్ని మట్టిపాలు చేసుకుంటున్నారో ఈ బంగ్లాదేశ్‍ యువకుడి మాటల్లో వినాల్సిందే! ‘‘నాకు బొమ్మలేసుకోవటం ఇష్టం. రాత్రింబవళ్ళు బొమ్మలేయడంతో గడుపుతానని మా అమ్మానాన్నలకి కోపం. మగ పుట్టుక పుట్టాక మగాడిలాగా ఏదైనా గట్టిపని చెయ్యలిగాని బొమ్మలేసుకుంటూ కూచోడం ఏమిటి అంటూ తిడతారు’’ కళ్ళనీళ్ళపర్యంతమౌతూ చెప్పాడు. ‘‘నాకు వంట చెయ్యడం చాలా ఇష్టం. ఇల్లు తుడవడం, ముగ్గులెయ్యడం కూడా ఇష్టమే. మా అమ్మ వంటచేసేటప్పుడు పక్కన చేరి చాలా వంటలు నేర్చుకున్నాను. పెళ్ళయ్యాకా నా వైఫ్‍ తల్లితండ్రులు వెక్కిరించడం, నీకెందుకు ఆ ఆడపని అంటూ చిన్నబుచ్చడంతో వంటింట్లోకి వెళ్ళడమే మానేసాను. నా ఇష్టం మరుగున పడిపోయింది.’’ రాం సింగ్‍ బాధ. ‘‘మా నాన్న మా అమ్మని రోజూ కొడతాడు.ఫుల్‍ గా తాగొచ్చి చితకబాదుతాడు. మగవాడంటే ఆడవాళ్ళని కొట్టాలి కాబోలు అని నాకు అర్ధమైంది. పెళ్ళాయ్యాకా ఒక సారి నా భార్యను కొడితే ఆమె నా మీద కేసు పెట్టి వెళ్ళిపోయింది. ఎంత పిలిచినా రావడం లేదు.’’ ఒక యువకుడి ఆవేదన. ‘‘నాకు ఇంట్లో ఉండి పనిచేసుకోవాలనుంటుంది. మగ పుట్టుక పుట్టలేదా. ఇంట్లో ఉండడమేందిరా. ఉద్యోగం పురుష లక్షణం. భార్యా పిల్లల్ని పోషించవా?’ ఇలా ఆ సమావేశంలో పాల్గొన్న పురుషులు తమ మనసుల్లో ఉన్న వేదనల్ని, సమస్యల్ని వెళ్ళగక్కారు. ఆడవాళ్ళకే కాదు తమకి కూడా వేదనలుంటాయని, అనవసరంగా వ్యసనాల్లో మునిగి ఆరోగ్యం పాడుచేసుకుంటామని చెప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళంతా పాఠశాల స్థాయి నించి సెక్స్ ఎడ్యుకేషన్‍ను ప్రవేశపెట్టాలని గట్టిగా కోరారు. ఢిల్లిలోని జహంగీర్‍పురి కుర్రాళ్ళు, ‘‘మాకు సెక్స్ గురించి ఏమీ తెలియదు, తెలిసినట్టు షో చెప్పడం తప్ప. ఆడవాళ్ళ పట్ల మాలో ఎన్నో ‘మిత్‍’లు ఉన్నాయి. ఏది నిజమో, ఏది అబద్దమో మాకు తెలియదు. మాకు ఎవరూ ఏదీ చెప్పరు. సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకోవలసి వస్తోంది. మగవాడంటే మొరటుగా, అహంకారంతో ఉండాలని మేం మా పెద్దల్నించి, సినిమాల నుంచి నేర్చుకుంటున్నాం. సున్నితంగా ఉంటే ‘ఆడంగి వెధవా’ అని వెక్కిరిస్తారని చాలా భయం. నిజాయితీగా తమ మనసుల్లోని అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన ఈ వార్తా కథనం నాలో ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. రాహుల్‍ రాయ్‍ పేర్కొన్నట్లు ఒక ‘పురుష ఉద్యమం’ ఆవశ్యకతని, పురుషులు తమ సందేహాలను, తమ భయాలను, తమ అనుభవాలను వ్యక్తం చేసుకో డానికి ఒక వేదికని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లయింది. సమాజం తమకి ఉదారంగా ప్రసాదించిన ‘పురుషాహంకారపు’ చీకటి తెరల్ని చీల్చుకుని నిజాయితీగా, నిర్భయంగా బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. ఏమీ తెలియని చోట కూడా ‘అన్నీ తెలుసనే’ అతిశయం ఎంత నష్టాన్ని కల్గిస్తుందో అంచనా వేసుకోగలగాలి. తమ అహంకారాల వల్ల, అణిచివేతల వల్ల, అత్యాచారాల వల్ల సమాజంలో తమతో బాటే బతుకుతున్న సగం జనాభా ఎన్ని కష్టాలుపడుతుందో, ఎంత హింసని భరిస్తుందో అర్థం చేసుకోగలిగితేనే వారికీ విముక్తి. ధీర,గాంభీర్యాహంకారాల వెనుక దాగి ఉన్న తమ అసలు స్వరూపాన్ని గుర్తించగలిగితేనే అందరికీ మంచిది. తమకు తెలియని ప్రపంచం గురించి (‘అంతా నాకు తెలుసూ అనే అహం వదిలి) తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మరీ మంచిది.

వార్తావాహిని