యూనిట్
Flash News
మహిళలపై హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల కార్యక్రమం
మహిళలపై హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల కార్యక్రమం - కొండవీటి సత్యవతి నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్ అగెన్‍స్ట్ విమెన్స్ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఒక్కోదేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన పోగ్రామ్‍లు చేస్తున్నారు. దీనిని 16 రోజుల ఏక్టివిజమ్‍గా కూడా పిలుస్తున్నారు. రోజుకో రకమైన హింస గురించి మాట్లాడినా గానీ ఈ రోజు స్త్రీల మీద అమలవుతున్న హింసా రూపాల గురించి మాట్లాడాలంటే ఈ పదహారు రోజులు ఏం సరిపోతాయి? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి? ఏ హింస గురించి ఎక్కువ మాట్లాడి ఏ హింస గురించి తక్కువ మాట్లాడాలి? అమ్మ కడుపులో భద్రంగా పడుకున్న పసికందుని చంపే క్రమం గురించి మాట్లాడాలా? పుట్టగానే, ఆడశిశువని తెలియగానే నోట్లో వడ్లగింజ వేసో, ముక్కు చెవులు మూసేసో చంపేసే అమానవీయత గురించి మాట్లాడాలా? సొంతపిల్లల్ని వయసు, వావి, వరస ఏమీ లేకుండా లైంగికంగా దాడి చేస్తున్న తండ్రుల గురించి మాట్లాడాలా? చదువు చెప్పాల్సిన పంతుళ్ళు ఆడపిల్లల్ని లైంగికంగా కాల్చుకుతింటున్న సంఘటనల గురించి మాట్లాడాలా? పెళ్ళయితే కుటుంబ హింస, పెళ్ళి చేసుకోకపోతే ఒంటరిమహిళగా ఎదుర్కొనే హింస, రోడ్డు మీద హింస, పనిచేసేచోట హింస, యుద్ధహింస, మతహింస ఏ హింస గురించి మాట్లాడాలి? ఎంత కాలం ఇలా మాట్లాడాలి? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది స్త్రీలు గొంతు చించుకుని ఎలుగెత్తి ’’హింస లేని సమాజం స్త్రీల హక్కు. అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం’’ అంటూ నినదిస్తున్నారు. ఎవరు వింటున్నారీ మాట? ఎవరి చెవులద్వారా ఎవరి గుండెల్లోకి చేరుతోంది ఈ ఘోష? అసలు ఎవరైనా వింటున్నారా? ఆ వింటున్న వాళ్ళకి తల్లి వుండదా? తోడపుట్టిన వాళ్ళుండరా? సహచరో, సహవాసో వుండరా? కూతుళ్ళుండరా? వుంటారు. అందరూ వుంటారు. తాము నానారకాల హింసలకి పాల్పడుతూ, తమ వాళ్ళని భద్రంగా వుంచుతున్నామనే భ్రమలో ఇళ్ళల్లో బంధించాలనుకుంటున్నారు. ఓ పక్క స్త్రీల బతుకుల్ని హింసామయం చేస్తూ... మరో పక్క మేమే స్త్రీల రక్షకులంటూ ఫోజు కొట్టడం ఎలాంటి నీతి అవుతుంది? పురుషులు పాటిస్తున్న ఈ ద్వంద్వ నీతి కోట్లాది స్త్రీల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో గణాంకాలు చెబుతూనే వున్నాయి. ‘అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం’’ అనే నినాదం ఎవరిని ఉద్దేశించింది? పురుషుల్నా? వ్యవస్థల్నా? ప్రభుత్వాలనా? వివిధ హింసలతో వేలాది స్త్రీల మరణాలకు కారణమౌతున్న శత్రువు అసలు ఎవరు? ఎవరి మీద మనం పోరాడుతున్నాం. స్త్రీల రక్షణ కోసం బోలెడు చట్టాలు తెచ్చాం మా పని అయిపోయింది అంటుంది ప్రభుత్వం. ప్రభుత్వాలు స్త్రీల పక్షపాతంతో వ్యవహరిస్తూ, వాళ్ళ కోసం కొత్త కొత్త చట్టాలు తెస్తూ, మమ్మల్ని రాచిరంపాన పెడుతోంది అంటున్నాయి పురుషవాద సంఘాలు. అంతేకాదు పురుషుల్ని వేధించే స్థితికి మహిళలు చేరిపోయారని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆరోపించి, దూషిస్తున్నారు. ఇదే నిజమైతే హింస ఎందుకు పెరుగుతోంది? హింసారూపాలెందుకు మారుతున్నాయి? ఆలోచించి, విశ్లేషించే ఆసక్తిగాని అసలు కారణాలను అన్వేషించే సహనం కానీ లేని కొంతమంది పురుషులు స్త్రీల చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే అవతలి వైపు చూసే అవసరం మాకు లేదు అంటూ మొండికేస్తున్నారు. నిజమే! ప్రభుత్వం మహిళల ఉద్ధరణ కోసం కొత్త చట్టాలను తెస్తూనే వుంది. అంతర్జాతీయ వొప్పందాల ప్రకారం స్త్రీల మీద హింసను అంతం చేసే చట్టాలను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. ఇంకా ఎన్నో క్యూలో వున్నాయి కూడా. ఇవన్నీ మహిళలకి అండగా, రక్షణగా ఎందుకుండటం లేదు? దీనికి కారణం ఒక్కటే. ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టాలన్నీ ఆచరణ యోగ్యం కాని విధంగానే మిగిలిపోతున్నాయి. కొత్త చట్టాల అమలుకు కావలసిన బడ్జెట్‍లు, వనరులు మంజూరుకావు. వాటిని పఠిష్టంగా అమలు పరిచే వ్యవస్థలు రూపొందవు. చట్టం అందమైన భాషలో, అద్భుతమైన పదజాలంతో రూపొంది కాగితం పులిలా గాండ్రిస్తుంటుంది. ఆ గాండ్రింపులకే భయపడి పురుష ప్రపంచం ప్రభుత్వం స్త్రీల పక్షం అంటూ నింద వేస్తుంది. మరింత హింసని ప్రేరేపిస్తుంది. పఠిష్టమైన ఆచరణకు నోచుకొని చట్టాలు మరో వంద వచ్చినా స్త్రీలకు వొరిగేందేమీ లేదు. జిల్లా ప్రధాన కేంద్రంలో కూర్చున్న రక్షణాధికారి ఆ జిల్లాలోని స్త్రీలందరిని గ•హహింస నుంచి కాపాడుతుందనుకోవడం ఎంత భ్రమో! చట్టాలొక్కటే స్త్రీలను హింసల్నుండి రక్షిస్తాయనుకోవడం అంతే భ్రమ. మరి.. స్త్రీల మీద హింస ఇంత భయానక స్థితికి చేరి మూడేళ్ళ బాలికనుండి ఎనభై ఏళ్ళ వృద్ధురాలికి కూడా రక్షణ లేని స్థితి ఇటు కుటుంబంలోను, అటు సమాజంలోను పెచ్చరిల్లిపోతుంటే స్త్రీల ఉద్యమం ఏం చేస్తోంది? సమాజం లో ఇంత హింస పెచ్చరిల్లడం ఏ సమాజానికీ శ్రేయస్కరం కాదు. మహిళలు,పురుషులూ సమాన హక్కులతో,సమాన హోదాతో బతకాల్సిన చోట ఒకరి మీద ఇంకొకరు ఆధిపత్య ధోరణితో అణిచివేత మార్గంలో పయనించడం ఎంతవరకూ సబబు. సమాజం లోని అన్ని రంగాలల్లో హింస పెరగడం వల్లే మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను ప్రభుత్వం తీసుకొస్తోంది.దేశం లో ఉన్న పరిస్థితుల గణాంకాల ఆధారంగానే ఆయా చట్టాల రూపకల్పన జరుగుతుంది. అయితే చట్టాలే మహిళలు,పిల్లలని రక్షిస్తాయనుకుంటే అది అత్యాశే అవుతుంది. పిత•స్వామ్య భావజాలం పురుషుల మెదళ్ళలో తిష్టవేయడం వల్లనే ఇంత హింసకి పాల్పడుతున్నాడు. నిజానికి పురుషులు కూడా పిత్రుస్వామ్య భావజాల బాధితులే.ఆధిపత్య భావజాలానికి బానిసై స్త్రీలను హింసించేవాళ్ళుగా ముద్ర పడుతున్నారు.అలాగని పురుషులంతా ఒకేలా లేరు. ఈ రోజు చాలామంది జండర్ స్ప్రహతో, మహిళల సమస్యల పట్ల అవగాహనతో, సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 25 నుండి డిశంబర్ 10 వరకు మహిళలపై హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న క్యాంపెయిన్ లో ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటుదాం.హింసలేని సమాజం కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం.