యూనిట్

పిల్లలను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించేది లేదు: ప్రకాశం ఎస్పీ

ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా జిల్లాలోని పలు చోట్ల వివిధ పనుల్లో ఉన్న పిల్లలను గుర్తించి.  వారిని సమీప పాఠశాలల్లో చేర్పించినట్లు ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్‌ తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన   సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ రోజు  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనుల్లో, వీధుల్లో తిరుగుతున్న 750 మందిని గుర్తించినట్లు వెల్లడించారు. వారందరినీ బాలల సరరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరిచినట్లు వివరించారు. ఆ తర్వాత వారిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని అన్నారు. వారిని సంరక్షించి చదివించలేని వారిని జిల్లాలోని 71 సంరక్షణ కేంద్రాల్లో ఉంచి చదివిస్తామని అన్నారు. పిల్లలను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించేది లేదన్నారు. మరోసారి ఇదే తరహా సంఘటనలు పునరావృతమైతే బాలల హక్కుల చట్టాల మేరకు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించారు. గతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా రక్షించిన వారిలో 76 మందిని పలుచోట్ల పాఠశాలల్లో చేర్చి చదివిస్తున్నట్లు సీడబ్ల్యూసీ సభ్యురాలు బత్తుల పద్మావతి వెల్లడించారు. వీరి చదువుల బాధ్యతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అప్పగించామన్నారు. వారి నుంచి నెలవారి నివేదికలు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు ఎస్‌.ఎ.బషీర్‌, ఆర్టీసీ ఆర్‌ఎం విజయగీత, ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని