యూనిట్

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో రోజురోజుకు ఎక్కువవుతున్న బాల, బాలికల మిస్సింగ్‌, అపహరణ, అక్రమ రవాణా మొదలగు అంశాలపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ అనుసరించి ప్రతి రాష్ట్రంలో వివిధ యూనిట్ల వారీగా జిల్లా ప్రధాన నగరాల్లో ఎ.హెచ్‌.టి.యులను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్‌.పి. ఎ.ఎస్‌.ఖాన్‌ ఆధ్వర్యంలో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. టీంలో ఎస్‌.ఐ., ఎ.ఎస్‌.ఐ., హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ళను నియమించారు.  

సి.ఐ.డి. ఆధ్వర్యంలో

కేంద్ర హోం సెక్రటరీ ఆదేశాల మేరకు సి.ఐ.డి. చీఫ్‌ శ్రీ ద్వారకా తిరుమలరావుగారి ఆదేశానుసారం 'ఆపరేషన్‌ స్మైల్‌' పేరుతో 2015 సంవత్సరం జనవరి నెలలో 21 మంది బాల,బాలికలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అంతేగాకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, బాలలు తప్పిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై జనావాస ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లు, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. 

జిల్లా ఎస్‌.పి. ఎ.ఎస్‌.ఖాన్‌ ఆధ్వర్యంలో వీధిబాలలు, భిక్షాటన చేసే బాలలు, స్కూలు మద్యలో మానివేసిన విద్యార్థులు, బాలకార్మికులుగా మగ్గుతున్నవారిని గుర్తించి 'ఆపరేషన్‌ ముస్కాన్‌' టీం సభ్యులు జిల్లా వ్యాప్తంగా సోదాలు, తనిఖీలు నిర్వహించి 149 మంది బాల, బాలికలను గుర్తించారు. వీరిలో 117 మంది బాలలను వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించి అనాథలుగా వీధుల్లో తిరుగుతున్న వీరిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగింది. మిగిలిన 32 మందిని అనాధలుగా నిర్ణయించి, సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఆశ్రమాలకు పంపించేవిధంగా జిల్లా ఎస్‌.పి. చర్యలు తీసుకున్నారు. 

గుజరాత్‌ పోర్ట్‌లలో మగ్గుతున్న చిన్నారులకు విముక్తి కలిగించిన శ్రీకాకుళం పోలీసులు

జిల్లా కలెక్టర్‌, ఎస్‌.పి.గారికి అందిన సమాచారం మేరకు గుజరాత్‌ రాష్ట్రంలోని హరవళి ప్రాంతంలో బోట్లలో పనిచేయుటకు తల్లిదండ్రులకు కొంతమొత్తం ముందస్తుగానే చెల్లించి చదువు మద్యలోనే ఆపివేసి తీసుకెళుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు టీం, బాలల సంరక్షణ శాఖను అప్రమత్తం చేసి జిల్లాలోని ఎచ్చర్ల , శ్రీకాకుళం రూరల్‌ మండలాలైన  బురగట్లపాలెం, బవానిపేట, ఎస్‌.డి.పాలెం, కెడిపాలెం, బలరాంపురం,గార మండలంశ్రీకాకుళం మునిసిపాలిటీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా, చిన్నారి బాలలను బోట్లలో పనులకు పంపవద్దని హెచ్చరించినా వినకుండా పంపారు. వీరిపై ఆపరేషన్‌ నిర్వహించి 14 సంవత్సరాల లోపు 73 మంది బాలలను గుర్తించారు. వీరిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాలలు కార్మికులుగా మార్చడానికి ప్రయత్నించిన వారిపై ఆముదాలవలస పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదుచేసి, ఆరుగురిని అరెస్టు చేయడం జరిగింది. 

ఆపరేషన్‌ స్మైల్‌ - 2 పేరుతో జిల్లాలో కెజిబివి, పాఠశాలల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. బాలకార్మికులుగా, పుట్‌పాత్‌లపై తిరుగుతున్న బాలలకోసం 'ఆపరేషన్‌ స్మైల్‌ -2' పేరుతో సోదాలు నిర్వహించగా 228 బాలురను గుర్తించి, వారిలో 155 మంది బాలబాలికలను తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.  మిగతా 43 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించేవిధంగా చర్యలు తీసుకున్నారు ఆపరేషన్‌ ముస్కాన్‌ టీం సభ్యులు.  ఇవేగాక వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో తప్పిపోయి తిరుగుతున్న, ఫుట్‌పాత్‌లపై భిక్షాటన చేస్తూ కనిపించిన చిన్నారులను గుర్తించి వారి వివరాలను తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించడం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా కరపత్రాలతో బాలబాలికల అపహరణ, అక్రమ రవాణ నిరోధం తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోంది. 

వార్తావాహిని