యూనిట్

పనిముట్లు

- శ్రీ జి. లక్ష్మినరసయ్యగారు

భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రాచీన చరిత్ర కలిగిన వృత్తి ''క్షౌరవృతి'' ప్రపంచ వ్యాప్తంగా క్షౌరవృత్తి నిర్వహించేవారందరూ తమ వృత్తితోపాటు వైద్యం, సంగీతం ద్వారా వేల సంవత్సరాలుగా మానవజాతికి సేవలందించారన్నది చారిత్రక సత్యం. ఆదిమకాలంలో జంతురూపం నుండి మానవజాతిని మనిషిగా వేరు చేసిన క్షౌరవృత్తి ఉన్నతమైనది. భారతదేశంలోని నాయీ (మంగలి)లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 'బార్బర్‌' నిర్వహించే వారందరూ వైద్య, సంగీతాలలో నైపుణ్యం కలవారే. అంతేకాక వీరు మంచి మాటకారులు కావడంవల్ల వివిధ దేశాల మధ్య సంధి, సంప్రదింపులు జరిపే రాయబారులుగా పనిచేసేవారని చరిత్రకారులు పేర్కొన్నారు. నాయీలు / మంగళ్లు సంప్రదాయంగా తాము నిర్వహించే మూడు వృత్తులతోపాటు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వార్తలను, సందేశాలను చేరవేసేవారిగాను, వైవాహిక సంబంధాలు కుదిర్చే మధ్యవర్తులుగా నాడు, నేడుకూడా సేవలందిస్తున్నారు.

విజయవాడకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ అన్నవరపు బ్రహ్మయ్యగారు ఈ వృత్తిదారుల గురించి చాలా పరిశోధన చేసి 'తొలివైద్యులు' అని పుస్తకాన్ని రాశారు. 'నాయీ' అనే పదం సంస్కృతం నుండి వచ్చిందని ఆయన ఉద్దేశ్యం. నాయీ అంటే నాయకత్వం వహించడం. నాయీలు చంద్రవంశానికి చెందిన క్షత్రియులు. మహాచక్రవర్తి అయిన మహాపద్మనందుడు, గొప్ప ఆధ్యాత్మిక గురువుగా కీర్తి ప్రతిష్టలునార్జించి భగత్‌సేన్‌, భౌద్ధ పిటక రచయితలకు గురువైన ఉపాలి, సిక్కుమత ఖల్సా నిర్దేశకులలో ఒకరైన భాయ్‌ సాహెబ్‌సింగ్‌, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌,  చారిత్రక పురుషుడు (భౌద్ధకాలంలోని) కొండోజు వంటివారు ప్రసిద్ధులు.

శుభకార్యాలకు, అశుభ కార్యాలకు కూడా మంగలి సన్నాయి అనివార్యమైన అండ, సహాయం, తోడు. మనిషి జీవితమంతా సన్నాయి మేళంతో సమ్మిళితమై ఉంది. వీరి వృత్తికి యుగయుగాల చరిత్ర వుంది. కాని మంగలి పొదిలోని 'కత్తి' దోపిడికి గురైంది. వివక్షకు అంటరాని తనానికి, దయనీయస్థితికి చేరింది. 'తను' లేకపోతే వెంట్రుకలు, గోళ్లతో వికారంగా మారే మనిషిని, చులాగ్గా, నాగరీకంగా 'నీట్‌'గా తయారుచేసే 'తనని' గుర్తించే వారు, 'తన' శ్రమని గమనించేవారు లేరని 'అది' ఎప్పుడూ బాధపడలేదు. తన పని, తన ధర్మం తను చేసుకొనిపోతూ ఉంది. కాని ప్రముఖ కవి జి. లక్ష్మీనరసయ్య మంగలిపొదిలోని 'కత్తి' గురించి 'పనిముట్లు' అనే కవితలో అద్భుతంగా రచించాడు. అదే ఈ నెల మన మంచికవిత.

తెగటానికీ కొయ్యటానికి నడుమ

దారం అంచుమీద అంచలంచల కసరత్తు చేసి

నునుపు అందాన్ని

మెరుపు కొసల కందించే మడక కత్తి

తల చుట్టూ పిచ్చుకలా రెక్కలార్చుతూ

తలకొక ప్రపంచాన్ని నిర్మించే కత్తెర

ఒళ్లు కందకుండా

ముల్లును గల్లా పట్టుకుని బయటికీడ్చే గోరుగల్లు

కొత్తజంట కాలిగోళ్లమీద కురిసే

సుతారపు జల్లు

కత్తి చర్మాన్ని కొంచెంకొంచెంగా ఒలిచి

కక్కుపెట్టే సానరాయి

మెదడు నాదును మెత్తగా నూరి

సాదుచేసే మాలిష్‌ చేతులు

హిందూ సంస్క్కృతిలో భాగంగా ఉన్న మంగళ్లు గుళ్లోని పూజారిని, పురోహితుడిని 'శుభ్రం' గావించి నాదవాద్యాలతో మంగళాతూర్యాలను వినిపిస్తారు. శుభప్రదమైన వాయిద్యాలను మంగళ్లు వాయిస్తారు కాబట్టే మంగళవాయిద్యమైంది. శుభం, మంగళం - పదాల వెనుక దాగివున్న వీరి చెమటకు గుర్తింపులేదు. మంగలి వారికి శరీర ధర్మం, అవయవాల పనితీరు బాగా తెలుసు కాబట్టి, రుగ్మతలను గుర్తించి 'మర్దన'తో చికిత్స చేసేవారు. దానికోసం అవసరమైన తైలాలను తయారుచేసారు. విచిత్రం ఏమిటంటే శరీరభాగాలన్నిటినీ వివిధ తైలాలతో మంగలిచేత మర్దన చేయించుకొనేటప్పుడు లేని అంటరానితనం ఆ పని అయిపోగానే మొదలవుతోంది.

పెళ్లికి శుభారంభం పలికే మంగలన్న, ఏడాదిలోగా అదే పెళ్లికూతురు ఒక తల్లి కావడానికి మంగలమ్మ మంత్రసాని తనం నెరుపుతుంది. ఎలాంటి సెప్టిక్‌ కాకుండా తల్లిపేగును కోసి పాపని క్షేమంగా తల్లి ఒడి చేరుస్తుంది.

చరిత్రను గమనిస్తే కలశక అనే రాజుని చురకత్తితో హత్యచేసి ఉగ్రసేనుడు అనే క్షురకుడైన నందుడు రాజయ్యాడు. అతని సంతతి అయిన ఎనిమిది మంది నందరాజులు సుమారు వందేళ్లు పరిపాలించారు. అంతటి వీరులు ఈనాడు నిర్వీర్యులై చాకిరి కోరల్లో దిగబడిపోయారు. ఎంత చదువు చదివినా, తల్లిదండ్రులు పెట్టిన పేరు వున్నప్పటికీ 'ఏరా మంగలి' అని పిలుస్తారు.

ఒక తాజా కేరింతను లోకానికీ

ఒక లోకాన్ని తాజా కేరింతకీ

సమర్పించే చేతులు

ఒక తల్లి శరీరమూల రహస్యాలమీద

హార్మోనియం వాయించే మంత్రసాని చేతులు

ఆత్మను అత్తరు గీతం చేసి సంగీత పడవల్లో

సమయ సముద్రాల్ని దాటించే సన్నాయి

కళాపెళా కదిలి పందిరికి స్పందన తెచ్చే డోలు

వేదాంతి నిలకడలా ఉదరంతో శ్వాసించే నుతిబూర

ఇల్లు ఇల్లుగా పెళ్లిపెళ్లిగా పుట్టుక పుట్టుగ్గా

బతుకు బతుగ్గా మొగ్గ తొడిగే మేళం

మా పనిముట్లు కనికట్లు కావు

మాకే మంత్రాలూ రావు

బతుక్కి కళల రక్తాన్నెక్కించటం

కళలకి బతుకు వారసత్వాన్నివ్వడం

మా విద్య

అఖండ భారతదేశంలో నాయీలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా 'సెయిన్‌, మంగలి, వస్తాద్‌, మంత్రి, నాయీబ్రాహ్మణ్‌, వలంద్‌, నపిట్‌, సవిత్‌' అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సెయిన్‌ - ఠాకూర్‌, చౌదరి అని పిలుస్తారు. పాశ్చాత్యదేశాలలో కంటే ముందుగానే భారతదేశంలో వెంట్రుకలు కత్తిరించే ప్రక్రియ ఉన్నట్టు తెలుస్తోంది. సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన అవశేషాలలో ముఖంపై ఎటువంటి వెంట్రుకలు లేకుండా వున్న పురుష విగ్రహం బయల్పడడం అందుకు నిదర్శనం. ఆ విగ్రహాలు గడ్డం చేసుకొన్నట్టు ముఖం నున్నగా వుండటాన్ని బట్టి క్రీ.పూ. 300 - 1700 నాటికే భారతీయులకు వెంట్రుకలు తొలగించే ప్రక్రియ తెలుసునని అర్థం అవుతోంది. అందుకు పదునైన పరికరాలను వినియోగించినట్టు స్పష్టమవుతుంది. గడ్డంపైననే కాకుండా తలమీద వెంట్రుకలు కూడా తొలగించి గుండు గీసుకునే సంప్రదాయాన్ని జైనులు, భౌద్ధులు కూడా సాగించారు.

నెర్రెలిచ్చిన లోకం గుండెకు మేము కట్టే

పసరుకట్టూ మా పనిముట్లు

మీ అందం మీద మా వఋత్తి

రోజూ ప్రేమగా రాల్చే వెలుగు పొరలు

మా పనిముట్లు

ఉపాలి కపాలం నుండి ఊడిపడ్డ

ఈ వినయ మాధుర్యాలు

సేవను సౌందర్య భాషలోనే పాడే

మా పనికి సజీవసంతకాలు

మంగలత్వమే మధురమని ఎలుగేత్తే నినాదాలు

క్షౌరవృత్తి గురించి, వారి మంగలిపొదలిలోని పనిముట్టు 'కత్తి' గురించి గాఢంగా, స్పష్టంగా కవితరాసిన గుంటూరు లక్ష్మీనరసయ్య గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మండూరు గ్రామంలో జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం అక్కడే. ఇంటర్‌ విద్య తెనాలిలో, డిగ్రీ నెల్లూరులో, ఆంగ్లంలో ఎం.ఏ. తిరుపతి వెంకటేశ్వరవిశ్వవిద్యాలయంలో చేసారు. ఎం.ఫిల్‌ (Irish Nationalism - Influence in English Drama) చేసారు. విజయవాడ లయోల కళాశాలలో 12 ఏళ్ల ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేశారు. ప్రస్తుతం Page కాలేజ్‌లో పనిచేస్తున్నారు.

'చిక్కనౌతున్నపాట', 'పదునెక్కినపాట' కవితా సంకలనాలకు సంపాదకునిగా సుప్రసిద్ధులయ్యారు. దళితసాహిత్యం - తాత్విక ధృక్పథం పుస్తకం వెలువరించారు. ఇటీవల మహాత్మా జ్యోతిరావుపూలే జన్మదినం రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వీరి రచన 'అస్తిత్వ ఉద్యమాల ఆదిగురువు' ఆవిష్కరించబడింది. త్వరలో మరో కవితా సంపుటి రాబోతున్నది. 'అంబేద్కర్‌ తాత్వికత' పుస్తకం ముద్రణలో ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే Best Literary award విజయవాడ బహుజన రచయితల వేదికచే 'కలేకూరి ప్రసాద్‌ అవార్డు' ఇంకా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.   10 TVలో దాదాపు 150 పర్యాయాలు ప్రసంగించారు. TV 9 లో, E-TV తెలుగులో దళిత బహుజన సాహిత్యం మీద వీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎందరినో ఆలోచింపజేసాయి. ''వివిధ సమూహాల్లోని వారు తమ తమ అనుభవాల్ని గురించి రాయాలి. అనుభవం నుండి వచ్చిన కవిత్వం సహజంగా, సజీవంగా నిలబడుతుంది''. అంటారాయన. తన ఆలోచనల్ని, ఆశయాల్ని ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో సంవత్సరన్నర కాలర 'కాలమ్‌' రచన చేసారు. శ్రమ జీవుల పక్షాన రచనలు చేసే లక్ష్మీనరసయ్య తన కలం నుండి 'ప్రజా స్వామ్య కవిత్వం' వస్తుంది అంటున్నారు. దానికి మనమూ ఆమోదిద్దాం మరి.

డా|| శ్రీమతి సి.హెచ్‌. సుశీల

వార్తావాహిని