యూనిట్

నిప్పుల నీడ

ఏ జాతి, ఏ భాష, ఏ దేశం వారైనా కాలంతో పాటు మునుముందుకు సాగుతూ, తమ వెనుకటి తరంవారి జీవన విధానాలు తెలుసుకోవాలంటే ఆనాటి సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. ఆనాటి చేతివృత్తులు, కులవృత్తులు, కళారూపాలు గురించి కూలంకషంగా పరిశీలించాలి. చేతివృత్తుల వారు ఆనాడు, ఈనాడు కూడా వెనుకబడిన జాతులకు సంబంధించినవారే. సమాజంలోని వారికి సేవచేసే వృత్తుల్లో వున్నవారు వెనుకబడే వున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆధునిక యంత్రాల కోరల్లోని తళతళలకి ఆకర్షితులైన ఆధునికులు చేతివృత్తితో తయారైన వస్తువుల పట్ల ఉదాసీనత కనబరుస్తున్నారు. లేదా నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు. అలా విస్తృతికి గురైన వెనుకబడిన కులం 'కమ్మరి' ఈ కులంలో ఐదు ఉపకులాలు ఉన్నాయి. 1. స్వర్ణకారుడు, 2. శిల్పి, 3. వడ్రంగి, 4. కంచరి 5. కమ్మరి. వీరు లేనిదే ఇల్లు, ఇంట్లోనివారికి సంపూర్ణ పరిపూర్ణతలేదు. కాని వారి కష్టాన్ని గుర్తించం. తమ కష్టాన్ని వివరించేందుకు వారిలో పెద్దగా కవులూ లేరు. ఆనాటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు అనగానే మనకు 'కాలజ్ఞానం' జ్ఞప్తికి వస్తుంది. సంఘంలోని మూఢ విశ్వాసాల్ని, వివక్షను విమర్శించే పద్యాలు ఉన్నాయి. కాళికాంబ శతకం కూడా రచించారాయన. కాని ఈనాడు కొద్దిమంది కవులు తమ కులవృత్తిలోని సాధక బాధకాలు, సమాజంలో, కుటుంబ వ్యవస్థలో తమ ప్రాధాన్యత గురించి కవిత్వీకరిస్తున్నారు. తమ ఆవేదనని కవితా రూపంలో వెలువరిస్తున్నారు. కవి కె.ఆనందాచారి రచించిన ''నిప్పులనీడ'' అనే అటువంటి కవితే ఈ నెల మన మంచి కవిత.

కాంతిగోళాల రుజుమార్గ

కళ్ళజోళ్ళలోంచి

తీక్షణ తీవ్రసూటైన చూపులు

కరిగిన ఎర్రని బంగారం మెరుపులపై

సాధించిన ఆధిపత్య ఏకాగ్రతలు!

ఊపిరితిత్తులు ఉత్పత్తినంతా

కుంపట్లలో కుమ్మరించి

కణకణమండే నిప్పుల సెగల్ని నింపుకొని

మోదుగుపూలై విచ్చుకున్న కళ్ళు!

కాలపు పెండ్యూలాలైన

రెక్కల లయాన్విత సుత్తిదెబ్బలకు

ప్రతిధ్వనించే పట్టెడ శబ్దాలు..

ఎప్పుడు, ఏ ఆరంభానో

పనిలో దిగిన సమూహాలు

పల్లెపల్లె మామయులై

తీర్చిదిద్దిన ఇంజనీర్లు

కాలగమనాల స్థలాలలో

నిత్యశోధనా కర్మయోగులు

పరిణామంలో...పరిభ్రమిస్తూ

పరిశమిస్తూ..శ్రమిస్తూ...

చిక్కి శల్యమైన జీవన

చిత్రాలు!

దారిద్య్రపు ఛత్రీల క్రింద తలదాచుకున్న దృశ్యాలు,

దీనగానాల క్రీనీడల్లో స్వర్ణకార్లలో  గిళ్ళు

పూర్ణానుస్వారాలై ఘార్ణిల్లుతున్న నాగూళ్ళు!

నా మూలాన్ని నీ కళ్ళముందే పెరికివేస్తున్న వైనం

నా సారాన్ని పీల్చిపిప్పి చేస్తున్న ఘోరం!

రెడీమేడ్‌ షోకేసుల్లో సీలకు

తగిలేయబడ్డ వృత్తి

రెక్కల వారసత్వాన్ని వెక్కిరిస్తున్న

మార్కెట్ల విస్తృతి

బ్రతుకుల్ని మెలితిప్పుతున్న దుస్థితి!

బ్లోరును తిప్పిన చేతులు కాల ప్రయాణంలో

బూడిద అలంకారమై తలనిండా పరచుకొంటోంది.

జీవితాలు కమ్మెచ్చులో పడి

లాగిన తీగెలుగా సాగిన చుట్టలయి

బతుకు అలజళ్ళ ఆకురాళ్ల రాపిడిలో

పొడిపొడిగా రాలిపోయే ఆశలు!

ఎన్ని నగల్ని వనురపెట్టి మెరుగుపెట్టి కాంతినింపినా...

ఎన్నేళ్ళయినా మెరవని పొగచూరిన ముఖాలు!

సిరాకు మంటల సెగలో వెలుగు తప్పిన భవితవ్యాలు!

ఓనా పనిమంతుడా! నా వంశాంకుర వృత్తి గుణవంతుడా!

కెంపుల్ని, పచ్చల్ని, కళ్ళు జగీతమనే రాళ్ళన్నీ

ఒళ్ళంతా ఒక్కొటి చేసుకొని

బిగించిన చంద్రహారాల్లోని

నీ పనితనాన్ని చూసుకొని

విశ్వామిత్రునంత గర్వాంగివై

ఒక్కింత 'కెంపు' చుక్కలో

ఒక్క నాణ ముక్కతో పరిపూర్ణజీవిత తృప్తిని పొందుతావ్‌!

రేపు రూపాలపై భ్రమలు కలగవు

వర్తమాన చక్రవర్తివై ఉపనిషత్‌ను వ్యాఖ్యానిస్తావు,

ధర్మాధర్మ తాత్విక విచారణా ఘనుడివై

జీవితసారపు విషాద నిషాపర్వాన్ని ప్రేమిస్తావు

ఎన్ని బాధల వరదలు ముంచెత్తినా

నిప్పుల నీడల్లోనే వసిస్తావు.

నిత్యాన్నిహోత్రివై దర్శనమిస్తావా...!

పురాతనమైన వృత్తి కమ్మరి. ఇంటికి సంబంధించిన ఇనుప వస్తువుల్ని వంచివంచి మంచిగా తయారుచేయాలన్నా, బంగారాన్ని తీగలు సాచి, వంపులు తిప్పి అందమైన 'నగ' తయారు చేయాలన్నా, ఆ బంగారంలో అందమైన రంగురంగు రాళ్ళని పొదగాలన్నా ఎంతో నైపుణ్యం కావాలి. ఏకాగ్రతతో కళ్ళతో గుచ్చిగుచ్చి చూస్తూ, వేళ్ళతో అతి చాకచక్యంతో నగల్ని తయారుచేసిన స్వర్ణకారుడి శ్రమని - ఖరీదైన షాపులోని షో కేసులో మిలమిల మెరుస్తున్న అద్దాలు తమ వెనక దాచేస్తున్నాయి. చూస్తున్న మన కళ్ళు మైమరిచిపోయి దాని ఖరీదుని చూస్తూ మన బడ్జెట్‌ని అంచనా వేసుకుంటాం మనసులో. కాని దాన్ని తయారుచేసిన స్వర్ణకారుడికి ఎంత ప్రతిఫలం దక్కుతుందో మనకు తెలీదు. మనం నగను కొనడానికి పెట్టిన ఖరీదులో ఎంతశాతం ఆ స్వర్ణకారుడి శ్రమకి దక్కుతుందో! ఆ ఘర్మజలానికి సరియైన, న్యాయమైన ఖరీదు లభిస్తే అతనింకా, చిన్నగదుల్లో కణకణమనే నిప్పుల వేడిమధ్య దగ్గుతో, కళ్లని శరీరాన్ని కృశింపజేసుకుంటూ అసంతృప్తిగా అరకొర రాబడితో, తన పిల్లల భవిష్యత్‌పట్ల భయంభయంగా ఎందుకు బ్రతుకుతున్నాడు!

ఈ కఠినసత్యాన్ని ''నిప్పుల నీడ'' అనే కవిత ద్వారా వెలువరించిన కవి శ్రీ కె.ఆనందాచారి తెలంగాణలోని ఖమ్మంజిల్లాలో ఇల్లెందు గ్రామంలో 1961లో జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం అక్కడే. డిగ్రీ ఖమ్మంలో ప్రభుత్వ కళాశాలలో అభ్యసించారు. తర్వాత తెలుగులో ఎం.ఏ. కాకతీయ యూనివర్శిటీలో చేశారు. కవి శ్రీ 'జాతశ్రీ' నవలలపై పరిశోధన గావించి ఎం.ఫిల్‌. పట్టా పొందారు. ప్రస్తుతం ఖమ్మంలోని నయాబజార్‌ ప్రభుత్వోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన వెలువరించిన మొదటి కవితా సంపుటి ''మొలక'' త్వరలో మరో కవితాసంపుటి రాబోతున్నది. తెలంగాణ ''సాహితీ సంస్థ''కు రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉగాది కవితల పోటీలో బహుమతి అందుకున్నారు. నాటి అధికారభాషా సంఘం అధ్యక్షులు శ్రీ కె.బి.కె. గారినుండి అధికారభాషా పురస్కారం అందుకున్నారు. వివిధ పత్రికల్లో వ్యాసాలతోపాటు, టివి, ఆకాశవాణిలో ప్రసంగాలు వెలువరించారు. పదునైన కవితలు రచించే ఆనందాచారినుండి మరిన్ని కవితలు రావాలని ఆశిద్దాం.        

-కె. ఆనందాచారి

సంకలనం- డా శ్రీమతి సి.హెచ్‌. సుశీల 

వార్తావాహిని