యూనిట్
Flash News
శిలాలోలిత
అమ్మ జన్మనిస్తే, నాన్న జీవితానికి భరోసా ఇస్తాడు. అమ్మ
గురించి ఎన్నో పాటలు, ప్రసంగాలు, రచనలు.
మరి నాన్న గురించి...? బిడ్డలపై తన ప్రేమను గుండెల్లోనే
దాచుకొని, పైకి గంభీరంగా, బిడ్డల భóవిష్యత్‌కి బాట,
దిశానిర్దేశం చేస్తూ, వారి ఉన్నతికి మౌనంగా
శ్రమించే శ్రమజీవి నాన్న. ఎప్పుడో తప్ప ఆయన మమకారం కట్టలు తెంచుకొని, వారిపై కురవదు. అలాగే నాన్న గురించి మన గుండెల్లో దాచుకొన్న అభిమానం
ఒక్కోసారి మనల్ని ముంచెత్తుతూ వెల్లువలా
ఉబుకుతుంది.
అలాంటి ఒక అపురూపమైన కవిత శిలలోలిత గారి '' కన్నీటి చెలమల్లోనాన్న''..
ఐనా, నాన్న రాలేదు
చూస్తూనే
ఉన్నాను
నిరీక్షిస్తూనే
వున్నాను
నాన్నింకా
వస్తారనే...
ఎండుటాకుల
గలగలల మధ్య
శిథిల
శరీరం చెరుకుపిప్పిని చేస్తే..
కన్నీటి
చెలమలలో నాన్న
మూగవోయిన
గొంతు పలకరించినప్పుడల్లా
సమాధానపు
కన్నీళ్ళను పరుస్తూనే వుంది
స్వరపేటిక
చిట్లిన నాన్న
నిస్తేజపు
కళ్ళింకా కళ్ళముందే వున్నాయి
1958 జులై 12న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌కు సమీపంలోని శంషాబాద్‌లో.
తెలుగు సాహిత్యంలో ఎం.ఏ.,ఎం.ఫిల్, పిహెచ్‌డి
చేసి తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తూ ''పంజారాన్నీ నేనే
పక్షినీ నేనే'', '' ఎంతెంతదూరం'' కవితా
సంపుటాలు వెలువరించారు. కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు, తెలుగు కవయిత్రుల కవితామార్గం, నారి
సారించి-పరిశోధనా గ్రంథాలు, విమర్శకుల మన్ననలు పొందడమే కాక,
పలు విశ్వవిద్యాలయాల్లో రిఫరెన్స్ గ్రంథాలుగా ఉన్నాయి.
''గాజునది'' అనే కవితా సంపుటిలోనిది పై కవిత.శిలాలోలిత
స్త్రీవాద రచయిత్రిగా ప్రసిద్ధురాలై, స్త్రీలు జీవితాల్లో
అనుభవించే కనిపించని హింస, కనిపించే దౌర్జన్యాల్ని
నిక్కచ్చిగా తన అక్షరాల్లో సమర్ధవంతంగా ఆవిష్కరించారు. ఆమె రచనలన్నీ స్త్రీవాద
సిద్ధాంత ప్రేరణతో వచ్చినవే. స్త్రీ జీవనయాత్రలో వివిధ దశల్లోని ఆటుపోట్లని,
అన్యాయాల్ని ప్రశ్నించేవే. ఆ ఆవేదనే ఆమె ప్రధానాంశం కానీ రానురాను
స్త్రీల మనోభావాల వ్యక్తీకరణ నుండి ఆమె రచన మానవీయ విస్తృతిని సంతరించు కొంటూ,
పరిణామం చెందుతూ, సంపూర్ణతను సాధించే దశలో
పయనించింది. దానికి మంచి ఉదాహరణగా, స్త్రీవాదులు పురుష
ద్వేషులు కాదు అన్న తన నమ్మకాన్ని బలపరుస్తూ కొన్ని రచనలు చేశారు. తల్లిగా,
భార్యగా, కూతురుగా స్త్రీ ఎంత ప్రేమమూర్తో
చెప్పారు.ఎంతోమంది మనసుల్ని ఆర్ద్రంగా తాకి, అనుభూతుల్ని 'తడి'చేస్తూ, కన్నుల్లో ఓ
నీటిచుక్క గిర్రున తిరిగేలా చేసిన అద్భుతమైన కవిత ఇది.
నాన్న
కంటిరెప్ప. కన్నీటికి అడ్డుకట్ట. చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పే గురువు.మనకు
ఎప్పుడైనా భయంవేస్తే 'నాన్న'
అన్న పలుకే ఓ పెద్ద భరోసా ధైర్యం. ఆయనంటే ఒడిదుడుకులకే భయం.
కుటుంబంలో, జీవనయాత్రలో వచ్చే కలతల్లో, కల్లోలాల్లోనూ చెదరని గుండెనిబ్బరం ఆయనది.ముళ్ళబాటలో తనకాళ్ళు రక్తమోడినా,
బిడ్డలకు పూలదారి నిర్మించే శ్రమజీవి. గుండెలోతులో వ్యధను మోములో
కానరానివ్వని గరళకంఠుడు.ఆలనాపాలనా కలగలసిన నిండుకుండ. ఇంట్లో అందరి ఇష్టాలకు,
కష్టాలకు తానే బాధ్యత వహించే త్యాగశీలి. అటువంటి నాన్న ఎప్పుడూ
మనతోనే ఉంటారన్న ధీమా మనకు. ఆయనకు వయసైపోయి, అనారోగ్యంపాలై,
డాక్టరు ''క్రిటికల్ కండిషన్, ఇక లాభంలేదు'' అని చెప్పినా - ఏదో ఆశ, ఏదో నమ్మకం మన కంటిరెప్ప మనల్ని విడిచివెళ్ళదని, కాని
''నాన్న వెళ్ళి పోయారు'' - మనల్ని
వదిలి, ఈ ప్రపంచాన్ని వదిలి. నాలుగు భుజాల స్వారీ మీద నాన్న
వెళ్ళి పోతున్న దృశ్యం కళ్ళారా చూసినా ఏదో నిరీక్షణ- నాన్న వస్తారని.
దు:ఖపుకొండ
తన్నుకొస్తూనే వుంది
గొంతుకడ్డం
పడి గిలగిలా కొట్టుకుంటుంది
నాన్న-జ్ఞాపకాలు
జ్ఞాపకాలుగా విడిపోతున్నారు
కారు
అద్దంపై ఎంత తుడుస్తున్నా తడిపే వర్షపు చుక్కల్లా
మనసునెంత
వూరడిస్తున్నా కురుస్తూనే వుంది
మరపునెంత
రమ్మని పిలిచినా రానంటోంది
నాన్న
నవ్వుతూ, మాట్లాడుతూ కళ్ళముందే వున్నారు
రకరకాలుగా
వున్న మడిచెక్కల్లాంటి గతంపై.
'నాన్న నిస్తేజపు కళ్ళు' అన్న పదబంధం, 'నాన్న జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా విడిపోతున్నారు'' అన్నభావం,
'కారు అద్దంపై ఎంత తుడుస్తున్నా తడిపే వర్షపు చుక్కల్లా' అన్న పోలిక ఎంత అద్భుతంగా ఉన్నాయి! ఇలాంటి ఉపమానం బహుశా ఎక్కడా చూసి వుండమేమో!
భౌతిక
రూపాన్ని ఒదిలేసి
నాన్నిచ్చిన
నా రూపంలోకి వెళ్ళి
ఎప్పటికీ
తీయలేని తలుపేసుకున్నారు
ఎంతకీ
తీయరు!
ఎంత
పిలిచినా రావడం లేదు.
ఎప్పటికన్నా
నా అలసట చూసి
రాకపోతారా
అనే నా వెతుకులాట.
ఔనూ-
నాన్నెందుకు
తలుపేసుకున్నారు?
ఎక్కడికెళ్ళిపోయారు?
యుగాయుగాల
నుండి, యోగులకు సైతం సమాధానం దొరకని
ప్రశ్నయిది. కానీ మళ్ళీమళ్ళీ మనిషి అమాయకంగా అడుగుతూనే ఉంటారు.
అత్యంత
మమకారం, ఆప్యాయత, భద్రత యిచ్చి మన గుండెల్లో గూడుకట్టుకొన్న నాన్న గురించి ఎంత గొప్పగా
చెప్పారు కవయిత్రి!
అరనిముషం
కరెంటుపోయినా వూపిరాడని నాన్నను గాజుముక్కల గదిలో మూసేసాం కదా!
చిన్నప్పుడు
స్నానాలు చేయించిన నాన్నను
బాకీ
తీర్చుకోవడానికా అన్నట్లు
తలో
చెంబూ నీళ్ళుపోసి స్నానాలు చేయించాం.
పక్షి
గూడులాంటి గడ్డిపరకల పాన్పుపై
పడుకున్న
నాన్న కంటిబొమ్మై నిలిచిపోయారు
ఎక్కడవున్న
బొమ్మ అయినా కదిలిపో తుందేమో, కరిగిపోతుందేమో,
కనుమరుగె ౖపోతుం దేమోకాని, 'కంటి బొమ్మై
నిలిచిపోవడం' అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవడం.
మా
వేళ్ళు కాలితేనే విలవిల్లాడిన నాన్నను
చేతులారా
నిప్పుల గుండెలోకి తోసేసాం
డెబ్బై
తొమ్మిదేళ్ళ నాన్న ఎండుకట్టెలా మారిపోతుంటే
నిశ్శబ్ద
వివర్ణ చిత్రాలమైనాం.
రూపం
అశాశ్వతమనీ
ఎప్పటికీ
ఊరుతూనే వుండే జ్ఞాపకాల చెలిమే శాశ్వతమనే
చేదుమాత్రే
జీవనయాత్ర కొనసాగింపు.
భౌతిక
రూపం పంచభూతాల్లో కలిసి పోయింది. జ్ఞాపకాల చెలిమే శాశ్వతం అన్నది సత్యం. ఆ సత్యం
చేదుమాత్రలాంటిది.కాని ఆరో గ్యానికి చేదుమాత్రే మేలు.నాన్న జ్ఞాపకాలే మన
జీవనయాత్రని కొనసాగించడానికి మాత్ర.ఎంత ఆర్ద్రంగా వుందీ భావం! శిలాలోలిత ఈ కవిత
చదివి'వెళ్ళిపోయిన నాన్న'ని తలుచుకొని ఎంతమంది పాఠకుల మనసులు నాన్న జ్ఞాపకాల లోకంలోకి వెళ్ళిపోయి
ఉంటాయి మౌనంగా...
అవును.
నాన్న నాన్నే - నాన్నకు సాటి నాన్నే.
-- డా. సి. హెచ్. సుశీల