యూనిట్

మేరా భారత్‌ మహాన్‌

మేరా భారత్‌ మహాన్‌

ఏ బద్మాష్‌ ఐ.ఎస్‌.ఐ.గాడో

ఢిల్లీలో పేల్చే గలీజు బాంబుకు

గల్లీల్లో పల్లీలమ్ముకునే భుక్కాఫకీరుకు

సంబంధమేంది భాయ్‌!

అమెరికా ఎక్కాడుందో తెలీని

,ఆలు రాని అమాయక సాయిబుకు

ఆల్‌ఖాయిదాకు లింకేంది భాయ్‌!

అమాయక ముస్లిమ్‌లను 

ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్న వైనాన్ని తీవ్రంగా నిరసిస్తాడు ప్రముఖ ముస్లింకవి షేక్‌ కరీముల్లా. దేశభక్తి గురించి మాకెవ్వరూ నీతులు చెప్పక్కర్లేదంటూ ఇలా అంటున్నాడు కరీముల్లా -

దేశమంటే నీకు

మూడురంగుల జెండాకావచ్చు

రంగురంగుల బొమ్మకావచ్చు

మహా అయితే క్రికెట్‌ ఆటకావచ్చు

కానీ నాకలాకాదు

ఈ దేశమంటే మా అమ్మరా!

1964 జూన్‌ 1న గుంటూరు జిల్లా వినుకొండలో షేక్‌ మహబూబ్‌, షంషున్నిసాలకు పెద్దకుమారుడుగా జన్మించిన కరీముల్లా, తల్లినుండి ఇస్లాం భక్తికథలు, చారిత్రక కథలు నేర్చుకొని, ఆధునిక భావాలు గల తండ్రి వద్దనుండి క్రమశిక్షణ, పఠనాభిలాష, ఆధునిక భావాలు అలవర్చుకొన్నాడు. తెలుగు  భాషాభిమాని అయిన మహబూబ్‌ వేమన పద్యాలను ఇష్టంగా చదువుకొంటూ కుమారునిచే చదివించేవాడు. ప్రభుత్వ సర్వేయర్‌గా ఆయన గుంటూరు, రేపల్లెలో ఉన్నప్పుడు కరీముల్లా ప్రాథమిక విద్యను అక్కడే అభ్యసించి, హైస్కూల్‌, కళాశాల విద్యను వినుకొండలో సాగించారు. హైదరాబాద్‌ సుల్తాన్‌-ఉల్‌-ఉలూమ్‌ కాలేజిలో బి.ఇడి, ఆచార్యనాగార్జున యూనివర్శిటీలో ఎం.ఏ. చదివారు. 1996 నుండి వినుకొండ మండలం ఏనుగుపాలెంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 

 

నిత్యం శంకించబడుతున్న ముస్లింల దేశభక్తి, అమాయక ముస్లింలపై టెర్రరిస్టుముద్రలు వేయడం వంటి సంఘటనలు కరీముల్లాను ముస్లిం సాహిత్యం వైపుకు అడుగులు వేసేలా చేశాయి. అయితే, తన సాహిత్య ప్రయాణం ముస్లింల కోసం మాత్రమే పరిమితం చేయక, మొత్తం పీడిత ప్రజల చైతన్యమే లక్ష్యంగా కొనసాగించారు. పెనువిపత్తుగా పరిణమించిన అమెరికన్‌ సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ తదితర అంశాలపై కరీముల్లా కలం కదనుదొక్కింది. తన ''థూ'' అనే కవితాసంపుటి 2002లో వెలువడి సాహితీరంగంలో సంచలనం సృష్టించింది.

కానీ ముస్లింవాదం పేర సాహిత్యంలోని అతి పోకడలు ఆయనకు నచ్చలేదు. శాంతి, ప్రేమలే లక్ష్యంగా ''ఇస్లాంవాదం'' అనే నూతన వాదాన్ని ఆవిష్కరిస్తూ, ''సాయిబు''(2004) దీర్ఘకవితను రాశారు. విప్లవసాహిత్యంలో 'మహాప్రస్థానము'కు దళితసాహిత్యంలో 'గబ్బిలం'కు ఎంత ప్రాధాన్యత ఉందో ముస్లిం సాహిత్యంలో 'సాయిబు'కు అంత ప్రాధాన్యత ఉందని పలువురు మేధావులు, సాహితీవేత్తలు విశ్లేషించారు. తెలుగు సాహిత్యంలో మొదటి దీర్ఘకవిత రాసిన ముస్లింకవిగా కరీముల్లా పేరుగాంచారు. 

షేక్‌ కరీముల్లా రాసిన ''మేరా భారత్‌ మహాన్‌'' ఈనెల మన మంచికవిత.

మునుపు

నిబ్బరంగా నడిచేవాళ్ళం

నింపాదిగా నడిచేవాళ్ళం

ఇప్పుడు...

బిక్కుబిక్కుమంటూ నడుస్తున్నాం

కంటికి కనిపించని 

కుతంత్రాల ఎలుకలేవో

కందకాలు తవ్వుతున్నాయి

విధ్వంసం వ్యూహాలతో

విభజన రేఖలు గీస్తున్నాయి

భయం...భయం....

విస్పోటనాల భయం

'మొహల్లాలన్నీ టెర్రరిజం అడ్డాలే'-

విషం చిమ్ముతున్న న్యూస్‌ రీడర్‌

అంతా మీ వాళ్ళేనంట కదా!

నిందిస్తుందో కసికోర.

అనుమానపు చూపులతో

మా అవయవాలెప్పుడో తెగిపోయాయి.

అవమానాల రక్తపరీక్షలతో

మా చర్మాలు మొద్దుబారిపోయాయి.

సందేహాలు పల్లేరు కాయల్లో చిక్కి

మా మెదళ్ళు చితికిపోయాయి.

ఇంతకీ వాళ్ళెవరు?

మాలెగావ్‌లో మంటలు పెట్టినవాళ్ళు

తాజ్‌లో మల్లెరేకుల్ని తుంచినవాళ్ళు

నీ వాళ్లా? నా వాళ్ళా?

మనుషుల్ని కదా మనవాళ్ళనుకోవాలి!

వసంతాన్ని కదా మనం కలగనాలి!

దేశముఖచిత్రంపై

కాళరాత్రిలా కమ్మినవాళ్ళు

మకరందపు బోసినవ్వులపై 

నిప్పుల గుండును విసిరినవాళ్ళు

వాళ్ళైవరైతేనేం!

ఇండియాగేట్‌ దగ్గర పాతిపెట్టాల్సిందే!

మేరా భారత్‌ మహాన్‌.

ముంబైలోని హోటల్‌ తాజ్‌పై జరిగిన 

ఉగ్రవాదదాడిని తీవ్రంగా నిరసిస్తూ ఈ కవితలో తన ఆగ్రహాన్ని వెల్లడిస్తాడు కరీముల్లా. '' సామాజిక స్పృహ, ముస్లిం సామాజిక, ఆర్థిక వెనుక బాటు తనాలకు అక్షరరూపమివ్వడం, హిందూ ముస్లింల సమైక్యతకు మత సామరస్యానికి కృషిచేయడం, భారతదేశ ఔన్నత్యాన్ని చాటడం తన కవిత్వ లక్ష్యం'' అని తెలియజెప్పే కవి కరీముల్లా ఆశయాన్ని స్పష్టపరిచేది ఈ కవిత.

ముస్లిం సమాజం పట్ల ఇతర సమాజాల్లో నెలకొనిఉన్న అపోహలను దూరం చెయ్యడం, లౌకిక వ్యవస్థ బలోపేతం కొరకు కృషిచేయడం అనేది ప్రగతిశీల ముస్లిం సాహిత్యలక్ష్యం కావాలి, కానీ, ఇస్లాం మత ఛాందసవాదులు, హింసావాదుల చేతుల్లో బందీ కాకూడదు అంటారు కరీముల్లా.

వినుకొండచరిత్ర (చారిత్రక పరిశోధన 1999), ఆయుధాలు మొలుస్తున్నాయ్‌ (కవితా సంపుటి 4200), ఖిల్లా (2006)తోపాటు, ఈద్‌ ముబారక్‌ (2008) కవితాసంపుటితో ''ఇస్లాంవాద'' మంటే మతపరమైందికాదని, ప్రగతిశీల ముస్లిం సాహిత్యోద్యమని నూతన ఆలోచనలకు ఊపిరిపోశారు కరీముల్లా.

కవిగా, విమర్శకునిగా, తాత్వికునిగా ఇప్పటివరకు 18కి పైగా పుస్తకాలు కరీముల్లా రచించి, గుర్రం జాషువా కళాసాహితీ అవార్డ్‌, జాతీయ కళాలయ అవార్డ్‌, సంస్కృతి (గుంటూరు), చిల్డ్రన్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ (బాపట్ల), సాహితీసభ (కనిగిరి), శారదాసాహిత్యపీఠం(తెనాలి), జాషువా ఫౌండేషన్‌ట్రస్ట్‌ (హైదరాబాద్‌), ఆనందమయి(ఒంగోలు), ఇండియన్‌ హైకూ క్లబ్‌(అనకాపల్లి), ప్రకాశం జిల్లా రచయితల సంఘం (ఒంగోలు), కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్‌ (హైదరాబాద్‌), వినుకొండ కళా సాహితీ వేదిక (వినుకొండ), డా||నాగభైరవ స్మారక పురస్కారంతోపాటు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో గుంటూరు నగరంలో ఘన సత్కారం పొందారు. నెలవంక నెమలీక మాసపత్రిక ''మృత్యువుకు అంటూ...ఇటూ...'' అనే కరీముల్లా కవితకు ''కలహంస సాహిత్య పురస్కారం'' (2013) అందజేసింది.

అన్ని మతసమాజాల్లోని మతోన్మాదాన్ని, ఛాందసాలను తీవ్రంగా ఖండిస్తూ కరీముల్లా దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికల్లో రాసిన సాహిత్య వ్యాసాలు సంచలనం కల్గించడమేకాక, చర్చల పరంపరను కొనసాగించాయి. కొలిమి (2004) సాహిత్య విమర్శనా గ్రంథం సాహిత్యంలోని అతివాదుల ముప్పేటదాడిని ఎదుర్కొంది.

వినుకొండ కవిత్రయంగా పేర్కొనబడుతున్న గుర్రం జాషువా, పులుపుల శివయ్య, షేక్‌ కరీముల్లా గురించి డాక్టర్‌ వంకాయలపాటి రామకృష్ణ ''ఆవిష్కర్తలు''(వినుకొండ కవిత్రయం సంక్షిప్తచరిత్ర) అనే పుస్తకం రాయడం ప్రశంసనీయం.

భారతదేశ సమైక్యతకు ఆటంకంగా మారిన అన్ని రకాల మతోన్మాదాలను, ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ''కవాతు''  అనే కవితలో-

వాడు ఐ.ఎస్‌.ఐ.నో, హాజీనో,

సి.ఐ.ఏ.నో, మొసాదో,

పరివారుడో, ప్రతీకారుడో

మరెవరైనా కావచ్చు

ఇంటి ఆవరణలో బొరియలు తవ్వుతుంటే

రెపరెపలాడుతున్న నా త్రివర్ణపతకాన్ని

ఉన్మాద ఖడ్గంతో చించేస్తుంటే

ఇంకానా! ఇక సహించలేను

అజ్ఞానీ! ఇండియా అంటే

నాలుగు మందిరాలు, నాలుగు మసీదులు

గుప్పెడు మట్టి, గుప్పెడు విశ్వాసాలు కాదురా!

శతాబ్దాల సామరస్యభావాల చరిత్ర.

వెర్రివాడా!

విభిన్న సంస్కృతుల కంచు ఊడల్ని

గడ్డిపరకలా పుటుక్కున తెంచేయగలవా!

ఇదిగో! ఇండియన్‌ ముసల్మానులం

నీ హింసోన్మాదంపై మేమిప్పుడు

కవాతు తొక్కుతున్నాం

మాదేశ మట్టిశిబిరాల్ని

ధ్వసం చేయాలనుకుంటున్నవాడు

ఎవరైనా సరే-

మాదేశ హిమశిఖరంపై కుంపట్లు 

రాజేయాలనుకుంటున్న వారెంతటివారైనా సరే

ముందు మమ్మల్ని దాటిపోవాలి!

ముందు మమ్మల్ని గెలిచిపోవాలి!

ఇది సవాలు!

సామ్రాజ్యవాద వ్యతిరేకతను, హిందూ-ముస్లిం సమైక్యతను, ఇస్లామిక్‌ సామ్యవాద భావాలను తన రచనల ద్వారా వెల్లడిస్తూ, ''ఇస్లాం'' అనేది ఒక మతంకాదు, అది ఒక జీవనవిధానం''అని ప్రగాఢంగా నమ్ముతూ, సామాజిక చైతన్యానికి అహర్నిశలు శ్రమిస్తున్న సంఘసంస్కర్త, ప్రగతిశీల భావాల కవి షేక్‌ కరీముల్లా.

 

 

వార్తావాహిని