యూనిట్
Flash News
కూలాడు దొరకలేదు
కూలాడు దొరకలేదు
- డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వర్లు
చెమటకు విలువ లేకపోవడం
శ్రమకు వెలుగు రాకపోవడం
ధనానికైనా - దాని జనానికైనా ప్రమాదం -
చెమటకు, శ్రమకు అత్యంత విలువనిచ్చారు
ఆచార్య కొలకలూరి ఇనాక్, దాన్ని పరిపూర్ణంగా నమ్మి, నేల విడిచి సాము చేయని కవిత్వాన్ని రాస్తున్న కవి డాక్టర్ భూసురపల్లి
వేంకటేశ్వర్లు. ఆయన రాసిన 'కూలాడు దొరకలేదు' ఈ నెల మన మంచికవిత.
పంట భూమి మీద ఆధిపత్యం భూ కామందుది అయినా, పొలంలో ఎండలో వానలో చెమట చిందించి, పంటపండించి,
ఆసామి గారింటికి బస్తాల్లో చేర్చేది కూలోడే. వారిద్దరి మధ్య చెమట
పరిమళం ఒక సామరస్యాన్ని ఏర్పరచేది. ఇప్పుడు - తరాలు మారాయి. ఆలోచనాధోరణులు మారాయి.
భూమిమీది నుండి ఆశలు రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించసాగాయి. ఒకప్పుడు కూలోడి
కష్టసుఖాలు, తిండి తిప్పల్ని పట్టించుకున్న భూకామందుగారి
కొడుకు ఇప్పుడు కొత్త రుచులు మరిగాడు. విలాస పురుషుడయ్యాడు. మందు, పొందు లేనిదే నిద్దరపోడు. తాత, తండ్రి తరంలో ఆసామి,
కూలీ మధ్య వున్న మానవీయ సంబందాలు ఛిద్రం అవుతున్నాయి. ఆత్మీయతలు
మృగ్యమౌతున్నాయి. ప్రపంచీకరణ తెచ్చిన మార్పులు, ధోరణులు,
పోకడలు యువ ఆసామి మీద ప్రభావం చూపాయి. మనిషి మీద ప్రీతిలేదు.
శ్రమమీద గౌరవంలేదు. మట్టి మీద ప్రేమ లేదు. భూమిమీద ఆధిపత్యం, అభిజాత్యం మాత్రం వుంది. అందుకే కూలోడి మీద విసుక్కుంటున్నాడు -
''ఇంకేం జేస్తాంరా ఎగసాయం
ఒక్క కూలాడు కూడా దొరక్కపాయ!
ఎవుణ్ణి జూద్దావున్నా అబ్బో
చుక్కలు జూస్తుండారు
తీసిపారేసిన చెప్పు చేతాదిని
కుక్క పెద్దపులయిందంట!
మన కొంపల చుట్టూ తిరుగుతా
అక్కడ తిన్న నా కొడుకులే
పూట కెంతిస్తావు?
రోజు కెంతిస్తావు?
అని నిలదీస్తుంటే
ఇంకేం జేస్తాంరా ఎగసాయం!''
పొలం పనే కాకుండా, ఇంట్లో అయ్యగారి
పిల్లల్ని భుజాల మీద ఎత్తుకు తిరిగి, అమ్మగారు పెట్టిన అన్నం
తిని ఆ ఇంటికే అంకితమైన కూలోడి మీద కుర్రయజమాని కస్సుబుస్సులాడితే, జీవితాన్ని చదివిన ఆ కూలోడు అవాక్కయ్యాడు.
- అంటూ చుట్టకొరికి తపుక్కున ఊసిన
మా పెద్దకాపుగారి బుల్లబ్బాయి
చూసీ చూడనట్లు శూలంతో పొడుస్తుంటే
కడుపులో దేవినట్లుగా వుంది.
కాళ్ళ కింద నేల కదులుతున్నట్లుగా
ఉంది.
కల్లంలో మిరపకాయలు
కళ్ళల్లో కొట్టినట్లుగా ఉంది
కాలం వెక్కిరిస్తుంది.
మా బత్తినోరి బుల్లబ్బాయి
ఈ పిల్లోణ్ణి చిన్నప్పుడు నేనే ఎత్తుకున్నా!
వాలగ రెబ్బలా జారిపోయేవాడు
ఎన్నిసార్లు పైన ఉచ్చ బోశాడో!
చదువుకోమని వెంటబడితే
వాళ్ళమ్మమీద రాళ్ళేసేవాడు
అన్ని సార్లూ అడ్డమొచ్చిన నా తలకే గాయాలు!
వాళ్ళమ్మ చేతికి ఎముకుండేది గాదు
ఇప్పుడు కోడళ్ళొచ్చారుగా!
ఒంగోలు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో చేర్చారు.
బుల్లబ్బాయికిప్పుడు మీసాలొచ్చాయి
ఎక్కడలేని రోషాలొచ్చాయి
ఆస్తి చేతికొచ్చింది
చూపు ఆకాశానికెక్కింది
కళ్ళనిండా నిప్పులు - నిజాల్లేవు
భుజం మీద కండువాలేదు
కాలర్ కిందికి చేతి గుడ్డ చేరింది
పొలం బోవడానికి కొన్న మోటారుబైక్
పొగాకు కంపెనీల చుట్టూ తిరుగుతుంది.
సాయంత్రమైతే పేకాట
తెల్లారితే చిలకల వేట
యేటా యకరం కొన్నా పెద్దకాపు గారిల్లు
యేడాదికి రెండెకరాలు అమ్ముకుంటుంది
''అవును నిజమే బుల్లబ్బాయ్!
మీచేలో మినుం పండితే
మా యింట్లో గారెలు తిన్నాం
కానీ
మినపకంప చేలోంచి మోసుకొచ్చి
మీ వాకిట్లో మండె కుచ్చెలేసింది
నేనూ... నా బిడ్డలే!
మీ కల్లంలో 'మేర' కొలిస్తే
మా పాకలో గొంతి నిండింది నిజమే!
కాలికుండే చెప్పులు దగ్గర్నించి
నేల దున్నే కాడి దాకా
అన్నీ మా చేతుల్లో రూపాల్ని చ్చుకున్నయ్యే!
ఇవాళ నువ్వు చేలని చెరువులు చేశావు
రూపాయలు పండించుకుంటున్నావు
మాట నుంచి మమకారం దాకా
మార్కెట్‌లోనే కొనుక్కుంటున్నావు
మట్టిని పోగొట్టుకున్నావు
తరతరాలుగా పెద్దోళ్ళు పంచియిచ్చిన
మంచిని పోగొట్టుకున్నావు
ఆరుగాలం చాకిరి చేసిన ఎద్దుల్ని
మేత దండగని
చెన్నపట్నం కబేళా కముకున్నావు
కవ్వం కింద పాడికుందని పగలకొట్టావు
విరిగిపోయిన పాలవ్యాపారంలో
ఎంతగా ఎన్నికలు ప్రవేశిస్తే
పాల రాజకీయాలచాటున
పచ్చిరక్తం కళ్ళ జూస్తున్నావు
ఆకలిని అన్నంముద్దను మరచిపోయి
కాసులనేరుకోడానికి కల్తీ ఎరువులు పోస్తుంటే
ఒట్టిబోయిన స్తనాలతో భూమితల్లి
నివ్వెరపోయి చూస్తుంది
గజాలుగా అడుగులుగా అంగుళాలుగా
పంచిపంచి అమ్ముకున్నవాడల్లా
చల్లిన గింజలు కూడ రావడం లేదని అమ్మనీ
కూలినా కొడుకులు దొరకడం లేదని మమ్మల్నీ
ఆడిపోసుకోటం అలవాడైపోయింది.
చూడు బుల్లబ్బాయ్!
చేలోంచి - అంత:పురంలోకి
వలసబోయిన శ్రామిక శక్తిలో
మా అవసరం అంతంత మాత్రమే!
ఒకనాడు నువ్వు నా ఒళ్ళోనే పెరిగినా
ఇవాళ నీకూ నాకూ మధ్య సంబంధం 'రూపాయి'
భూమికీ నీకూ మధ్య సంబంధం కూడా 'రూపాయి'
మన మధ్య ఈ రూపాయిని
నిలబెట్టిందెవరు?
రాజనాలు పండే చేలల్లో రాళ్లుపాతిందెవరు?
పురులన్నీ కరిగిపోయేట్లు పురిపెట్టిందెవరు?
ఈ పాపం నీదా? నాదా?
ఆ మాటకొస్తే,
ఖాళీ సిమెంటు బొచ్చలా
విసిరవేయబడడం
నాకు మాత్రం ఇష్టమా?
పచ్చటి పంట పొలాలు ఉప్పునీటి చెరువులుగానో, వ్యాపార పోకడలతో ప్లాట్లుగా మారిపోతే, శ్రామిక జనం
వలసబాట పడ్తున్నారు నగరాలకి. దుర్మార్గమైన రకరకాల మార్పులు 'కూలోళ్ళ'
జీవితాల్లోనే కాకుండా, ఆస్తి అధికారం తండ్రి
చేతిలోంచి తమ చేతుల్లోకి వచ్చిన కుర్రయజమానుల జీవితాల్లోకి, జీవన
విధానాల్లోకి వచ్చేసి, వారికే తెలియకుండా కనిపించని తెరల్ని
దించుతున్నాయి.
ఇలాంటి మంచి కవితల్ని రాసిన డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వర్లు
ప్రకాశం జిల్లా మద్దిపాడులో 'లయబ్రహ్మ' భూసురపల్లి ఆదిశేషయ్య, సుబ్బరత్నమ్మగారికి 4-9-1955లో జన్మించారు. తెలుగు భాషలో ఎం.ఏ., పి.హెచ్.డి.
చేసిన వేంకటేశ్వర్లు ఘటం, డోలు వాద్యాల్లో ఉన్నతశ్రేణి
కళాకారుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 1994లో ఉత్తమ
అధ్యాపక అవార్డ్ కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి 'బెస్ట్
మోనోగ్రాఫ్', పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
నుండి ఏటుకూరి వెంకట నరసయ్య స్మారక కీర్తి పురస్కారం, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం నుండి
ఉగాది పురస్కారం అందుకున్నారు. ఇంకా, మొదటి
ప్రపంచ తెలుగు మహాసభల్లో బంగారు పతకం, వీరగంధం కళా కేంద్ర
పురస్కారం, జాన్ రాఘవయ్య సాహిత్య పురస్కారం, నాగభైరవ కళాపీఠం సాహిత్య పురస్కారం, చిలకలూరిపేట
కళానిలయం 'సంగీత విజ్ఞాన్' పురస్కారం
అందుకొన్నారు. వీరి కవితలు, ఆకాశవాణి ప్రసంగాలు, వివిధ వేదికలమీద ప్రదర్శించిన సాహిత్యరూపకాలు, సంగీత
కచేరీలు, పరిశోధనా పత్రాలకు గాను 'సరస్వతీ
పుత్ర', 'వాక్చతురానన', 'కళా కోవిద',
'వినయ భూషణ' వంటి బిరుదులు అందుకున్నారు. 10కి పైగా గ్రంథాలు వెలువరించిన డాక్టర్ వేంకటేశ్వర్లు త్వరలో కవితా సంపుటి,
సంగీత చరిత్ర వంటి పుస్తకాలు వెలువరించబోతున్నారు. మరిన్ని రచనలతో
పాఠకుల్ని అలరిస్తారని ఆశిద్దాం.
విద్యావంతుడు, పోలీసు ఉన్నతాధికారి, మంచి రచయిత అయిన
శ్రీ పి.వి.సునీల్‌కుమార్ 2014లో తెలుగు
సాహిత్యానికి ఒక కుదుపుని, సాధారణ పాఠకులకు ఒక షాక్‌ని ఇచ్చినట్లు
రాసిన ''థూ...'' కథగూర్చి ఈ సందర్భంలో
చెప్పుకోవాలి. పై కవితకి, థూ కథకి కొన్ని పోలికలున్నాయి.
రెండింటిలోనూ కథనం ప్రధానంగా ఆసామి కూలోడు రెండు పాత్రల మధ్యే జరుగుతుంది. సునీల్‌కుమార్
చుండూరు మారణకాండనీ, దానిమీద పెద్ద కోర్టులో వెలువడ్డ
జడ్జిమెంట్‌నీ కథలో ప్రధాన సంఘటనలుగా, కథాంశంగా
తీసుకొన్నారు. డాక్టర్ భూసరపల్లి కవితలోని రెండు పాత్రలు దాదాపు ప్రతి ఊరిలోను
కనిపిస్తారు. రెండింటిలోను కథనం ''బాధితుల పక్షం'' నుండి జరుగుతుంది. అక్కడ రెడ్డినాయుడు, ఇక్కడ
బుల్లబ్బాయ్ తమ అభిప్రాయాలే కరెక్ట్ అనుకొంటారు. రెండింటిలోను ఉన్న రెండు
పాత్రలు ''భౌతికంగానే కాదు, గ్రామంలో
సామాజికంగా, ఆర్థికంగా సాంస్కృతికంగా కూడా సంఘర్షించుకొనే
పాత్రలు! కె.పి.అశోక్‌కుమార్ అన్నట్లు 'రెండువైపుల అటు
చివరి యిటు చివరి వైరి శిబిరాల్లో నిలబడ్డ పాత్రలు'
కొత్త దనాన్ని త్వరగా అంగీకరించలేని సాంప్రదాయిక విమర్శలకి
పి.వి.సునీల్‌కుమార్ - ''బాణం గుండెలో దిగితే బాధలా
వుంటుంది. అదే బాణం గుండెలో దింపినవాడికి వినోదంలా ఉంటుంది. వస్తువు అదే. కాని అది
ఒకడికి సంతోషాన్ని, మరొకడికి చావుని ఇస్తోంది. వ్యవస్థ అయినా,
సంఘటన అయినా బలిసినవాడికి ఒకలా, ఒక్కోడికి
మరోలా కనబడతాయి. వ్యవస్థలో ఏ ఒక్క సంఘటనా కారణం లేకుండా జరగదు'' అని సమాధానమిచ్చారు.
కాని రెండింటి ముగింపులో భేదం వుంది- కథలో 30 ఏళ్ళ నుండి గడ్డకట్టిన అసహ్యం, తీవ్రమైన నిరసనతో ''థూ'' అంటూ ధర్మాగ్రహ ప్రకటనతో ముగుస్తుంది. భూసురపల్లిగారి కవితలో కూలోడికి '' విషయానికి గ్రహింపువుందిగాని, విప్లవం లేదు-తిరుగుబాటులేదు. మౌనంగా, నిరాశగా పట్టణంలో సిమెంటు బొచ్చెలాగనైనా మారాలనుకొంటాడు. ఏదిఏమైనా ఇలాంటి వైవిధ్య భరితమైన అంశంతో మరిన్ని రచనలు తెలుగుసాహిత్యంలో రావాల్సిన అవసరం ఎంతైనా వుంది.