యూనిట్

వాస్తవాలకు ప్రతిరూపం 'సునీల్‌కుమార్‌ రచనలు'

రాష్ట్ర పోలీసుశాఖలో అత్యున్నత స్థాయిలో ఉండి.. తీరిక లేని సమయం గడుపుతూ.. మరో వైపు తెలుగు సాహిత్యం, రచనపైన మక్కువ పెంచుకున్న అదనపు డిజిపి పి.వి.సునీల్ కుమార్ రచనలు సామాజిక చైతన్యం కలిగిస్తాయని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ వేత్త పాపినేని శివశంకర్ తెలిపారు. ప్రస్తుత వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, దోపిడీలు, అన్యాయాలు, బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు మొదలుకొని అనేక సమస్యలను నిర్భయంగా చెప్పే రచయిత పివి సునీల్‌ కుమార్‌ అని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ ఎస్వీకేపీ, డాక్టర్‌ కేఎస్‌ రాజు కళాశాలలో 'సునీల్‌కుమార్‌ సాహిత్యం సామాజిక దృక్పథం' అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్‌ అప్పారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు రచయితలు, సాహితీవేత్తలు పివి సునీల్‌కుమార్ రచనలపై విశ్లేషించారు.  సందర్భంగా పాపినేని శివశంకర్ మాట్లాడుతూ వృత్తిపరంగా పోలీస్‌శాఖలో కొనసాగుతున్నా ..  శాఖతో పాటు న్యాయవ్యవస్థలో లోపాల, అన్యాయాలను 'థూ' పుస్తకంలో తేటతెల్లం చేసిన ధైర్యవంతుడైన రచయిత సునీల్‌కుమార్ అని అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పితాని సత్యనారాయణ రచయిత, అదనపు డిజిపి పివి సునీల్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు.  సందర్భంగా గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో సాగుతున్న సునీల్‌కుమార్ పోలీసు ఉద్యోగం అనంతరం రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. సమాజంలో రాజకీయ, సాంస్కృతిక, సామాజిక మార్పులకు సాహిత్యం ఒక మూల సాధనమని అన్నారు. సునీల్‌కుమార్‌ రచనలు పుస్తకాన్ని కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్  కలిదిండి రామచంద్రరాజు, తెలుగుభాషా విభాగం మాజీ అధిపతి డాక్టర్ రంకిరెడ్డి రామ్మోహనరావులు ఆవిష్కరించారు.  పుస్తకంపై భారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రారంభ ఉపన్యాసం చేశారు. పోలీసుశాఖలో

ఉన్నతాధికారిగా పనిచేస్తున్న సునీల్‌కుమార్‌ 3 నవలలు, 50 కథలు రచించారని తెలిపారు. క్షుద్ర, సయ్యాట, ప్రారంభం, నీలవేణి, థూ  వంటి రచనలు వ్యవస్థలోని లోపాలను, దోపిడీలను, దారుణాలు, కులతత్వం, కష్టజీవుల ఇక్కట్లు కళ్లకు కట్టినట్లు చూపాయని అన్నారు. రచయిత, అదనపు డిజిపి పి.వి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ పుస్తక పఠనానికి అత్యధిక సమయం కేటాయించడం వల్లే రచయితగా మారానన్నారు. మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టే విధంగా తన రచనలు సాగాయని తెలిపారు. కార్యక్రమంలో భారత అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌, సదస్సు కన్వీనర్‌ కేవీఎన్‌డీ వరప్రసాద్‌, పలువురు రచయితలు పాల్గొన్నారు.

వార్తావాహిని