యూనిట్

ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడికి గట్టిగా కృషి చేయండి

జిల్లాలో ఇసుక, మద్యం అక్రమ రవాణా జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అనంతపురం  జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు సూచించారు. స్థానిక పోలీసు కన్వెన్సన్ హాలులో జిల్లా పోలీసు సిబ్బందితో  ముఖాముఖి నిర్వహించి వారి సాధక బాధకాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... కింది స్థాయి నుండీ అధికారుల వరకు విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లి గ్రామాల్లో ఎలాంటి ఘటనలు జరుగకుండా నిఘా ఉంచుతూ,  గ్రామ వలంటీర్లు, మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని గ్రామాల ప్రశాంతతకు దోహదపడాలన్నారు.

జిల్లా నుండి  ఇసుక బయటికి వెళ్లకుండా, కర్నాటక నుండీ అక్రమ మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా గట్టి చర్యలు చేపట్టాలనన్ని సూచించారు. జిల్లాలో ఎక్కడ  గుట్కా విక్రయాలు జరుగరాదని, మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగు, తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ బాధలతో పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులు, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. మహిళలు, విద్యార్థినులను  ఇబ్బంది పెట్టే వారిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది సమస్యలను విన్నవించేందుకు ప్రతీ మూడవ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందికి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు.

అనంతరం సిబ్బంది సాధక బాధకాలుపై ఆరా తీశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజినేయులు, ట్రైనీ ఐ.పి.ఎస్ అధికారి మణికంఠ చండోలు, అనంతపురం, స్పెషల్ బ్రాంచి, ట్రాఫిక్ డీఎస్పీలు జి.వీరరాఘవరెడ్డి, ఎ.రామచంద్ర, మున్వర్ హుస్సేన్ లు, పలువురు సి.ఐ లు, ఆర్ .ఐ లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డీ, శ్రీనివాసుల నాయుడు, తేజ్ పాల్, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి శంకర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల నుండీ విచ్చేసిన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని