యూనిట్
Flash News
మహిళలు ఆర్ధికంగా శక్తివంతులు కావాలి
మహిళలు ఆర్ధికంగా శక్తివంతులుగా తయారవ్వాలని గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీమతి ఆర్. జయలక్ష్మి అన్నారు. బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ''మహిళా రక్షణ - సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి'' కార్యక్రమాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. మహిళలు భర్తలపై పూర్తిగా ఆధారపడి వివిధ కారాణాలతో వారికి దూరమైతే తీవ్రమైన మనోవేదనకు గురై ఎలా జీవించాలో తెలియక జీవితంలో అనేక కష్టాలకు గురౌతున్నారన్నారు. స్వయం, ఉపాధి, ఉద్యోగం లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఆర్ధిక సమస్యలతో పిల్లల్ని పోషించలేని స్థితిలో వుంటున్నారన్నారు. వివాహం జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అది విఫలమైతే అంతా కోల్పోయినట్లు భావించరాదని తెలిపారు. మహిళలను ఆర్ధికంగా శక్తివంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో పోలీస్ శాఖ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా ఆభాగ్యులు, ఇబ్బందుల్లో వున్న మహిళలకు స్వయం ఉపాధి పొందేలా ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టైలరింగ్, పచ్చళ్లకు, ఎంబ్రాయిడరీ, డ్రైవింగ్, బ్యూటీషన్ ఇతర అంశాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ డి.సంధ్యారాణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ షేక్ బాజీబాబు, డిఎస్పీలు ధర్మేంద్ర, శ్రీనివాసరావు, సి.ఐలు సుభాషిణి, కోటేశ్వర రావు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.