యూనిట్
Flash News
పారదర్శకతే ప్రభుత్వ పాలనా తీరుకు గీటురాయి
ప్రభుత్వ విభాగాలన్నింటిలోను లంచం, అవినీతి అనే జాఢ్యాలకు తావు లేకుండా పారదర్శకంగా పనితీరు సాగుతుండాలని ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ''స్పందన'' కార్యక్రమం అమలు తీరుతెన్నులపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్పందన కార్యక్రమం మరింత బాధ్యతగా ముందుకు తీసుకు వెళ్ళడానికి కొన్ని సూచనలు, సలహాలను అందించారు. ముందుగా స్పందనలో ఒక ఫిర్యాదు ఇస్తే దానికి తప్పక పరిష్కారం కలుగుతుందన్న భరోసా ప్రజలలో కల్పించినందుకు అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు ఇతర సంబంధిత అధికారులను, సిబ్బందిని అభినందించారు. జూలై 12 వరకు 59 శాతం ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటే, జూలై 19 నాటికి అవి 24 శాతానికి తగ్గాయని ముఖ్యమంత్రి వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి మరింత వేగంగా, చిత్తశుద్దితో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందన కార్యక్రమం ముగిసిన వెంటనే జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం వలన మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. స్పందన సమస్యల పరిష్కారంలో పశ్చిమగోదావరి జిల్లా ట్రాకింగ్ విధానం బాగుందని కితాబు ఇచ్చారు. మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్స్‌లో లంచం, అవినీతి, అలసత్వం అనేవి లేకుండా పనులు జరిగేలా చూడాలని తరచుగా చెపుతుండాలని ఉన్నతాధికారులకు సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. అంత కాలంగా అవి పెండింగ్‌లో ఎందుకు వున్నాయి, వాటి పరిష్కారానికి మరెంత సమయం పడుతుంది అని వివరణ అడిగారు. అటువంటి వాటి పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించి పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు తమ సమస్యలు పరిష్కారం కోసం వచ్చేవారిపట్ల ఎంతో ఆదరపూర్వకంగా వ్యవహరించాలని, చిరునవ్వుతో వారి కష్టాన్ని విని వారికి తగిన న్యాయం దక్కుతుందన్న భరోసా కల్పించాలన్నారు. ప్రజల కోసం ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ విభాగాన్ని తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వచ్చామా అని కానీ, రావాలంటే భయపడే పరిస్థితులు కానీ ప్రజలకు కలుగకూడదన్నారు. గ్రామాలలో ఎక్కువగా భూవివాదాలు వుంటాయని, వాటిని పరిష్కరించే క్రమంలో పరిధులను గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అక్టోబర్ 2 నుండి గ్రామ సచివాలయాల రాకతో పాలనలో సరికొత్త విప్లవం రానున్నదని, రేషన్ కార్డ్ లేని వారికి 72 గంటలలోనే మంజూరు చేసే విధంగా వేగవంతమైన పాలన రానున్నదని వెల్లడించారు. అదే విధంగా ఉగాదినాటికి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం అందుబాటులో వుండేలా మహోన్నత కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త రూపును సంతరిస్తామన్నారు.ఇసుక సరఫరాలో పారదర్శక విధానాన్ని రూపొందించి త్వరలోనే అమలులోనికి తెస్తామని, అలాగే అక్కడక్కడ తలెత్తుతున్న విద్యుత్ సరఫరా అంతరాయంపై కూడా దృష్టి కేంద్రీకరించి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గార్లుతోపాటుగా ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.