యూనిట్

సిపివో వ్యవస్థ రాష్ట్రానికే ఆదర్శం కావాలి...

శ్రీకాకుళం జిల్లాలో ఎంతో చక్కగా నిర్వహింపబడుతున్న సీపీవో (కమ్యూనిటీ పోలీస్‌ వ్యవస్థ) భవిష్యత్‌లో మరింతగా రాణిస్తూ రాష్ట్రానికే ఆదర్శంగా పేరు గడించాలని జిల్లా ఎస్పీ ఆర్‌ ఎస్‌ అమ్మిరెడ్డి అభిలషించారు.స్థానిక సామాజిక భవనంలో సీపీవోలతో జిల్లా ఎస్పీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీవోలు నిస్వార్థంగా, ప్రజాసేవకు అంకితమవుతూ పోలీస్‌ శాఖకు ప్రజలలో మంచి పేరు తీసుకొని వస్తున్నారని ప్రశంసించారు. సీపీవో వ్యవస్థలో మరిన్ని నూతన సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని, సీపీవోలను ప్రోత్సహించే దిశగా ప్రతి నెలా అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో కలిపి ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు సీపీవోలను గుర్తించి నగదు ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ప్రథమ 5 వేలు, ద్వితీయ 2 వేలు, తృతీయ వెయ్యి రూపాయలుగా వారికి బహుకరిస్తామన్నారు. అదే విధంగా హోంగార్డ్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీలో సీపీవోలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. నిందితులు, అనుమానితులుపై చేయి చేసుకోవడం, ఘర్షణ పడడం చేయరాదని తక్షణమే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడమో, సంబంథిత పోలీసులకు తెలియజేయడమో చేయాలన్నారు. జూదరులను పట్టుకొనే క్రమంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగరాదని, అటువంటి ఘటనలకు పాల్పడిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని, గ్రామాలలో రాజకీయ పార్టీల వివాదపూరిత వ్యవహారాలపై క్షుణ్ణంగా సమాచారం సేకరించి, ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సీపీవోలకు ఎస్పీ టీ షర్ట్స్‌ పంపిణీ చేశారు. కొత్తూరు, పాతపట్నం సీఐలు నాగేశ్వరరావు, రవిప్రసాద్‌లు సీతంపేట, కొత్తూరు, బత్తిలి ఎస్‌ఐలు బి. హైమావతి, బాలకృష్ణ, మహ్మద్‌ ఆజాద్‌, రాజేష్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని