యూనిట్

అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా పొందాలి

అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకెళ్లాలని విశాఖపట్నం జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజి అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భముగా ఆర్‌.కె బీచ్‌లోని స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో అసాంఘిక శక్తులతో పోరాడి అమరులైన పోలీసుల సేవలు ఎన్నటికి మరువలేమన్నారు. అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి యోగ క్షేమాలు అడిగి తెల్సుకున్నారు. కొంతమంది ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాలలో ఇండ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని, వాటికి ప్రభుత్వం ఎన్‌.వో.సి మంజూరుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్పీ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అమరవీరుల వారోత్సవాల సందర్భముగా విద్యార్ధులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి మెరిట్‌ సర్టిఫికేట్లను అందజేసారు. అమరవీరుల కుటుంబాలకు రూ.20 వేల నగదు చెక్కులను అందజేసారు.

వార్తావాహిని