యూనిట్

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

నవంబర్‌ 14న విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ''రహదారి భద్రత మిత్రా'' కార్యక్రమమును రాష్ట్ర డి.జి.పి శ్రీ దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమములో 149 మంది ట్రాఫిక్‌ పోలీసులకు, 50 మంది జాతీయ రహదారి వెంట పాన్‌షాప్‌ల యజమానులు, పెట్రోల్‌ బంకులలో పనిచేస్తున్న వ్యక్తులను వాలంటీర్లుగా నియమించి వారికి ప్రముఖ వైద్యులచే ప్రధమ చికిత్సలో శిక్షణ ఇప్పించారు. ఈ కార్యక్రమములో భాగముగా వారికి ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లను పంపిణీ చేశారు. అలాగే ''రహదారి భద్రతా మిత్రా'' వాలంటీర్లకు రేడియం జాకెట్లు పంపిణీ చేశారు. ఈ వాలంటీర్లు పనిచేస్తున్న ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగితేే తక్షణమే స్పందించి వారికి ప్రథమ చికిత్స అందించి వెంటనే 108కి, పోలీసుకు సమాచారం అందించడం వీరి తక్షణ కర్తవ్యమని రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు అధిక రక్త స్రావం జరగకుండా చూడడం, తక్షణమే ప్రథమ చికిత్స చేసి వారిని ఆసుపత్రికి తరలించడంతో వారి ప్రాణాలను కాపాడడం ''రహదారి భద్రతా మిత్రా'' ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం డి.జి.పి గారు 'స్పందన' మహిళా మిత్రా, సైబర్‌ మిత్రా కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భముగా డి.జి.పి గారు మాట్లాడుతూ గడిచిన 18 వారాలలో 'స్పందన' కార్యక్రమానికి వచ్చిన పిటిషన్లలో సుమారు 96శాతం పరిష్కరించినట్లు తెలిపారు. గత 18వారాలలో మొత్తం 42,220 పిటిషన్లకుగాను 39,492 పరిష్కరించినట్లు చెప్పారు. మహిళలపై వేధింపులలో 5742 కేసులు నమోదుకాగా 4272 ఫ్యామిలీ కేసులు పరిష్కరిం చామన్నారు. ట్రాఫిక్‌, రహదారి భద్రతపై ప్రత్యేక దష్టి పెట్టామని, ఇటీవల జరిగిన ఐదు సైబర్‌ కేసు డిటెక్షన్లు విశాఖ పోలీసులకే కాక ఆంధ్రా పోలీసులకు ఖ్యాతిని తెచ్చాయన్నారు. త్వరలోనే ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో వర్చ్యువల్‌ పోలీస్‌ స్టేషన్లు నెలకొల్పుతామని తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రాపర్టీ ఆఫెన్స్‌లు 50శాతం తగ్గాయన్నారు. అనంతరం వాలంటీర్లు ప్రమాదం జరిగే దృశ్యాలు, బాధితులను రక్షించే తీరును మాక్‌డ్రిల్‌ రూపంలో ప్రదర్శించి శభాష్‌ అనిపించారు. వీరిని రాష్ట్ర డిజిపి అభినందించారు. కార్యక్రమంలో విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా, డిఐజి కేఎల్‌ రంగారావు, డిఐజి పాలరాజు, విశాఖ నగర పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


వార్తావాహిని