యూనిట్

సమాజానికి సాంకేతిక భద్రత అవసరం

సమాజానికి సాంకేతిక భద్రత అవసరం వీధి వ్యాపారుల నుండి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు తమ వ్యాపారాభివృద్ది కోసం టెక్నాలజీని ఎంతో చక్కగా ఉపయోగించు కుంటున్నారని, అదే విదంగా తమ భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొంటే నేరాలు జరుగకుండా ఉంటాయని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అన్నారు. దైనందిన జీవితంలో సాంకేతిక భద్రతా పరికరాల వినియోగంపై స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో వ్యాపారులు, స్వచ్చంద సంస్థలు, ప్రజలకు ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను అరికట్టాలన్నా, దొంగతనాలను కట్టడి చేయాలన్నా ఎవరికి వారు తమకు అందుబాటులో వున్న సిసి కెమెరాలు ఇతర నిఘా పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఆవశ్యకత వుందన్నారు. మన నిర్లక్ష్యం, సరైన నిఘా లేకపోవడం వంటి కారణాలతో సాధారణ వ్యక్తులు కూడా నేరాలకు పాల్పడే అవకాశాలు వుంటాయన్నారు. చోరీలు జరిగిన తరువాత బాధపడే కంటే అవి జరగడానికి ఆస్కారం లేని విధంగా ముందుగానే సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు. ఒక వేళ నేరాలు జరిగినా పోలీస్‌ వారు పరిష్కరించడంలో అవి కీలక ఆధారాలను అందిస్తాయన్నారు. తదుపరి ఏఎస్పీలు సుప్రజ, క్రిష్ణార్జునరావు, డీఎస్పీ ఈశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌)ను సమర్థవంతంగా వినియోగి స్తున్నామని, ప్రజలు కూడా వ్యాపార సంస్థలు, సముదాయాలు, అపార్ట్‌మెంట్స్‌,సినిమాహాల్స్‌,స్కూల్స్‌, కాలేజ్‌లు ఇలా అన్ని చోట్ల సాంకేతిక నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వివిధ సాంకేతిక భద్రతా పరికరాలను ప్రదర్శించి ప్రజలకు వాటి పనితీరును తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు తిప్పేస్వామి, సుధాకర్‌రెడ్డి, సీఐలు బాలయ్య, భాస్కర్‌ రెడ్డి, యుగంధర్‌, మహేశ్వర్, ఎస్ఐలు మనోహర్, నెట్టికంటయ్య, షేక్షావళి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని