యూనిట్

మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం

మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ గారు దక్షిణాది రాష్ట్రాల అధికారులతో మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకం సాగిస్తున్న వారి వివరాలతో ఒక ప్రత్యేక సమాచార నిథిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌, అటవీ, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో, కస్టమ్స్‌, డీఆర్‌ఐ, ఇంటలిజెన్స్‌ బ్యూరో తదితర విభాగాల వద్ద వున్న ఆయా వ్యక్తుల సమాచారాన్ని సేకరించి అధికారులకు అందుబాటులో వుండే విధంగా క్రోడీకరించాలన్నారు. మాదక ద్రవ్యాల సాగు, రవాణా, అమ్మకం సాగించే ముఠాలపై పి.డి యాక్ట్‌ ప్రయో గిస్తున్నామన్నారు. గంజాయి రవాణా వాహనాల సమాచారాన్ని టోల్‌గేట్స్‌ వద్ద సేకరించాలని, దక్షిణాది రాష్ట్రాల అధికారులు సమన్వయంతో దీనిని కట్టడి చేయాల న్నారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠాలను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగాధిపతి శ్రీ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలకు తమ వైపు నుండి అన్ని విధాలా సమాచార, సహాయాలను అందించి సహకరిస్తామన్నారు. అటవీశాఖ అదనపు పీసీసీఎఫ్‌ ఏకే ఝా మాట్లాడుతూ డ్రోన్లు, రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా గంజాయి సాగవుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం గ్రామీణ, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం అర్భన్‌ ఎస్పీలు మాట్లాడుతూ గంజాయి సాగులో మావోయిస్టులు పాత్ర వుంటుందని, గిరిజనులను వారు ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. బెంగుళూరు సీటీ సంయుక్త పోలీస్‌ కమీషనర్‌ సందీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్ర సరిహద్దుల్లో సంయుక్త చెక్‌పోస్ట్‌లు నిర్వహించడం ద్వారా మాదక ద్రవ్యాల రవాణా నిరోధనకు కృషి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌తోపాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


వార్తావాహిని