యూనిట్

అవనిగడ్డ ఆదర్శ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్‌ విధానం అమలుకు చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు చర్యలు తీసుకుంటున్నారని హోమ్ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరితగారు అన్నారు. అవనిగడ్డలో రూ.1.40 కోట్లతో నిర్మించిన ఆదర్శ పోలీసు స్టేషన్‌ను రాష్ట్ర మంత్రులు శ్రీ పేర్ని వెంకట్రామయ్య, శ్రీ మోపిదేవి వెంకటరమణ గార్లతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కుల పరిరక్షణలో పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకొంటే పరిష్కారం అవుతాయని, తమకు రక్షణ లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో కల్పించేలా పోలీసులు స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజలకు పోలీసులకు మధ్య సుహద్భావ వాతావరణం ఉండే విధంగా.. ప్రజలతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని, ఈ క్రమంలో పోలీసు పదజాలం మారాలని చెప్పారు. పేద ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసు స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఉండాలని చెప్పారు. దానికనుగుణంగా పోలీసు స్టేషన్‌లో మహిళా మిత్రలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేరాల అదుపులో పోలీసులు పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. బందోబస్తు సమయంలో మహిళా పోలీసులు కనీస వసతులు లేక పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పోలీసు స్టేషన్లకు నూతన భవనాలు నిర్మించాల్సి ఉందన్నారు. ఆదర్శ పోలీసు స్టేషన్‌ శిలాఫలకం ఆవిష్కరించిన అనంతరం భవనంలో ఎస్‌ఐ-1 గదిని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణారావు, ఎస్‌ఐ-2 గదిని రవాణా, సమాచారశాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి శ్రీమతి సుచరిత గారు విజిటర్సు పుస్తకంలో తొలి సంతకం చేశారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అధ్యక్షతవహించగా అదనపు డీజీపీ/పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పి.వి.సునీల్‌ కుమార్‌, ఏలూరు రేంజి డీఐజీ ఎ.ఎస్‌. ఖాన్‌, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, అదనపు ఎస్పీ మోకా సత్తిబాబు, స్థానిక డీఎస్పీ ఎం. రమేష్‌రెడ్డి, సీఐ రవి కుమార్‌, ఎస్‌ఐలు సందీప్‌, సురేష్‌ పాల్గొన్నారు.

వార్తావాహిని