యూనిట్
Flash News
గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌గారి ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలోని రాజభవన్ వేదికగా ఘనంగా జరిగింది. ఉదయం 11.28 గంటలకు గవర్నర్‌గా నియమితులైన శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారితో పాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి శ్రీ ప్రవీణ్ కుమార్ గారు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు, ఛీప్ సెక్రటరీ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం గారు వేదిక పైకి చేరుకున్నారు. మొదటగా శ్రీ బిశ్వభూషణ్ హరచందన్ గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాధ్ కోవింద్ గారు జారీ చేసిన నియామక ప్రకటనను ఛీప్ సెక్రటరీ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం చదివి వినిపించారు. అనంతరం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి శ్రీ సి. ప్రవీణ్ కుమార్ గారు కొత్త గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రం సుస్థిర అభివృద్ధి దిశగా సాగుతుందన్న ఆశ, నమ్మకం నాకు ఉన్నాయి: గవర్నర్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర ప్రజల నుద్దేశించి తన తొలి సందేశాన్ని ఇచ్చారు. ఒడిదొడుకులన్నీ పరిష్కారమై రాష్ట్ర సుస్థిర అభివృద్ధి దిశగా సాగుతుందన్న ఆశ, నమ్మకం తనకు ఉన్నాయన్నారు. లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించ వద్దన్న స్వామి వివేకానంద సూక్తి అన్ని వేళల ఆచరణీయమని పేర్కొన్నారు. అవరోధాలను అధిగమించి సమగ్రాభివృద్ది సాధించే దిశగా రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మేధావులు, రచయితలు, రాజనీతజ్ఞులు చూపిన దూర దృష్టి, దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ అనేకాంశాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 'తెలుగు భాష, సంస్కృతి నాకేమి కొత్త కాదు, శ్రీకాకుళానికి పక్కనే వున్న గంజాం (ఒడిశా) జిల్లా నా స్వస్థలం. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన అమరావతి పురోగతిలో నేనూ భాగస్వామినవ్వడం సంతోషంగా ఉందని' పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేలా వినూత్న పథకాలతో సామాజిక అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యల ఆధారంగా నవరత్నాలు అనే పథకాలతో మేనిఫెస్టోను తయారు చేసిన విధానమే ఆయనకి విజయాన్ని అందించిందన్నారు. శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీని జాతి మొత్తం ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి, ఆ పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రజలందరికి మెరుగైన వైద్యం అందించేందుకు చేస్తున్న కృషికి అభినందనలు. విద్య పై కూడా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి తల్లి తన బిడ్డలను పాఠశాలలకు పంపించేందుకు ప్రోత్సహకాలు అందించడం ద్వారా సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం రానున్న రోజుల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించేందుకు గ్రామ వలంటీర్లను నియమించుకోవడం, వికేంద్రీకృత పాలనను ప్రజలకు అందించేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం సాహసోపేత నిర్ణయం అన్నారు. అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ రాష్ట్రం సుస్థిర అభివృద్ధి దిశగా పయనించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ప్రమాణ స్వీకారానికి ముందురోజు నూతన గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు తిరుపతి వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలనందించి స్వాగతం పలికారు.