యూనిట్

బాధిత మహిళల సమస్యలను త్వరగా పరిష్కరించండి- అనంతపురం ఎస్పీ

బాధిత మహిళల సమస్యలను దిశ చట్టం ప్రకారం నిర్ధేశిత సమయంలో  పరిష్కరించేందుకు సమాయత్తం కావాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పిలుపునిచ్చారు. దిశ చట్టం నేపథ్యంలో అనంతపురం మహిళా పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బందితో ఆయన బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....  మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, హింసలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో దిశా చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ మిగితా మహిళా చట్టాల కంటే దిశ చట్టాన్ని కఠినంగా రూపొందించారని... మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే నిందితులకు మరణ శిక్ష పడేలా దిశ చట్టం రూపుదిద్దుకుందన్నారు.

మహిళలను వాట్సప్, ఫేస్ బుక్ , తదితర సోషియల్ మీడియాలో ఏవరైనా వేధింపులకు గురి చేస్తే ఈ చట్టం కింద శిక్షార్హులవుతారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన కేసుల్లో నేర విచారణ, దర్యాప్తులు పూర్తి చేసి నిర్ధిష్టమైన ఆధారాలతో 21 రోజుల్లో  నిందితులకు శిక్షలు పడే విధంగా పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా దిశ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సైబర్ పోలీసు స్టేషన్ భవనం నందు దిశా పోలీసుస్టేషన్ త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది డీఎస్పీలు, 54 మంది ఎస్ ఐ లు, 36 మంది డ్రైవర్లు, 36 మంది డేటా ఆపరేటర్లు, ప్రతీ జిల్లాలోనూ స్పెషల్ కోర్టు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులు మంజూరు చేసి నియమించనున్నారన్నారు. ఇక్కడి జిల్లా కేంద్రంలో కూడా అదనంగా సిబ్బందిని నియమిస్తూ దిశా పోలీసుస్టేషన్ ను కూడా  ఈ నెలలోనే ప్రారంభించనున్నామన్నారు. దిశ స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలని... బాధితుల సమస్యలను నిర్ధేశిత సమయంలో పూర్తీ చేసేలా ఆయా విభాగాల పనులను సిబ్బందికి అప్పగించాలన్నారు.. దిశ పోలీసు స్టేషన్లో పని చేసే సిబ్బందికి 30 శాతం అలవెన్సు ... స్టేషన్లో ఫర్నీచర్ , ఉపకరణలు, సదుపాయాలు కల్పించనున్నామన్నారు.

ఈ జనవరి మాసాన్ని దిశా మాసంగా పరిగణించారన్నారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం పలు ప్రభుత్వ విభాగాలకు వేదికయిన ఒన్ స్టాఫ్ సెంటర్ కు మహిళా ఎస్ ఐ  గోవిందమ్మ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి మహిళా డీఎస్పీ మున్వర్ హుస్సేన్ , పలువురు మహిళా ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు , తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని