యూనిట్
Flash News
సైబర్ నేరాల పై అవగాహన చాలా అవసరం
సమాజంలో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన
పెంచుకోవాలని, విద్యార్థులు
సెల్ ఫోన్ వీడితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తిరుపతి
అర్బన్ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్
కళాశాలలో శనివారం విద్యాసంస్థల అధినేత డాక్టర్ మంచు మోహన్‌బాబు, సీఈవో విష్ణు మంచు
ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య
అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో సైబర్ క్రైం, అంతర్జాల
లావాదేవీల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవడానికి ఇలాంటి అవగాహన
కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో 2018 కంటే 2019లో సైబర్ నేరాలు రెట్టింపు అయ్యాయన్నారు.
ఇందుకు మూలకారకాలు చరవాణి, ఫేస్‌బుక్, సోషల్‌మీడియా, వాట్సాప్ వాడకమే అన్నారు.
మోసపూరితమైన ఫేస్‌బుక్ పరిచయాలను గుడ్డిగా నమ్మడంతో చాలామంది తీవ్రస్థాయిలో
మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు. తిరుపతి నగరంలో విద్యార్థులు, మహిళలతో కలసి సైబర్ నేరాలను అరికట్టేందుకు భారీ కార్యక్రమాన్ని
చేపట్టనున్నామని, దీనికి డీజీపీ గౌతమ్‌సవాంగ్ ముఖ్యఅతిథిగా
విచ్చేస్తారన్నారు. చరవాణి వినియోగం వల్ల మనకు తెలియకుండానే మనకు సంబంధించిన
వ్యక్తిగత సమాచారం నేరస్థులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దీంతో నేరస్థులు బ్లాక్‌మొయిల్,
బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్ సమస్యలు
ఎదుర్కొంటున్న వారు నిర్భయంగా పోలీసుస్టేషన్లును ఆశ్రయిస్తే వారి పేర్లు గోప్యంగా
ఉంచి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ‘సైబర్‌మిత్ర’
వాట్సాప్ సంఖ్య 80999 99977 (లేదా) 100 కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తామన్నారు.
విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యాసంస్థపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ముచేయకుండా క్రమశిక్షణతో కూడిన విద్యను
అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీని సత్కరించారు. అనంతరం కళాశాల సముదాయంలో
అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన విజ్ఞాననిధి గ్రంథాలయాన్ని ఎస్పీ సందర్శించారు.
విద్యాసంస్థల సీఈవో విష్ణు మంచు, సీఏవో తులసీనాయుడు, ప్రిన్సిపల్ క్రిష్ణమాచారి, డైరెక్టర్లు భగవానులు,
విద్యార్థి సంక్షేమ అధికారి డాక్టర్ అజమత్, డీఎస్పీ
నరసప్ప, గంగయ్య, సైబర్‌మిత్ర రవికుమార్,
అధ్యాపకులు పాల్గొన్నారు.