యూనిట్

సైబర్ నేరగాళ్లతో జర భద్రం

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ సమస్యలపై ధైర్యంగా ముందుకొస్తే సాయం చేస్తామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. డీపీవోలో శనివారం ఆయన  మాట్లాడారు. ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనలను ఆయన ప్రస్తావించారు. జిల్లాలో కొద్దిరోజుల క్రితం రెండు సైబర్‌ నేరాలు చోటు చేసుకున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయన్నారు. బాధితులు ధైర్యంగా ముందకొచ్చి ఫిర్యాదు చేసినందునే కేసు నమోదు చేశామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు కారకులైన ఇద్దరు నిందితులపై చర్యలు తీసుకున్నా మన్నారు. కొద్దిరోజుల క్రితం ఓ పట్టణంలో.. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతి చిత్రాలను అదే ఆటోలో ఉన్న యువకుడు రహస్యంగా చరవాణిలో చిత్రీకరించి.. మార్ఫింగ్‌ ద్వారా అశ్లీల వెబ్‌సైట్‌లో ఉంచాడన్నారు. మరికొద్ది రోజుల తరవాత.. ఇంకో వ్యక్తి.. ఫేస్‌బుక్‌లో ఉన్న ఓవ్యక్తి భార్య చిత్రాన్ని తీసి అశ్లీల వెబ్‌సైట్‌, డేటింగ్‌ సైట్‌లలో పోస్ట్‌ చేసి సదరు భర్తను బ్లాక్‌మెయిల్‌ చేశాడని చెప్పారు. వీరిద్దరూ ధైర్యంగా ముందుకు రావడంతో సైబర్‌సెల్‌ నిపుణుల ద్వారా అశ్లీల, డేటింగ్‌ వెబ్‌సైట్‌లలో ఉన్న యువతుల మార్ఫింగ్‌ చిత్రాలను తొలగించామన్నారు. ఆ చిత్రాలను మార్ఫింగ్‌ చేసిన వ్యక్తులను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. వీరిలో ఒకరు స్థానికుడని, మరొకరు ఝార్ఖాండ్‌కు చెందినవాడని తెలిపారు. ఈ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా ఫోటోలు తీస్తున్నట్లు తెలిసినా, అనుమానం వచ్చినా వారిని నిలదీయడం, లేక వెంటనే డయల్‌-100కు సమాచారం అందించి సాయం పొందాలన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేసినా భయపడొద్దని, వారితో బేరసారాలు చేయొద్దని సూచించారు. వెంటనే సైబర్‌ సెల్‌ నెంబరు: 9121211100కు సమాచారం ఇస్తే తాము తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో యువతులు తమ ఫోటోలు ఉంచరాదని, వివరాలు పొందుపరచరాదని సూచించారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టీకరించారు.

వార్తావాహిని