యూనిట్
Flash News
మహిళలు, పిల్లల భద్రత ప్రాధాన్యతగా గుర్తెరిగి అంకితబావంతో పని చేయండి

మహిళలు, పిల్లల భద్రత ప్రాధాన్యతగా భావించి అంకితబావంతో పని చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా జిల్లాలో ఎంపికైన గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ( మహిళా పోలీసు) లకు రెండు వారాల పాటు వివిధ అంశాలుపై స్థానిక డి.టి.సి, పి.టి.సి లలో మొత్తం 178 మందికి శిక్షణనిస్తున్నారు. బ్యాచ్ ల వారీగా నిర్వహిస్తున్న శిక్షణ రెండవ బ్యాచ్ కు ముగిసింది. ఈనేపథ్యంలో ఆదివారం స్థానిక పి.టి.సి ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ భూసారఫు సత్య ఏసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా విధుల్లోకి వెళ్తున్న మహీళా పోలీసులకు దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేలా మహిళల, పిల్లల శ్రేయస్సుపై దృష్టి సారించాలన్నారు. మహిళలపై నేరాలు జరుగకుండా చైతన్యం చేయాలన్నారు. బాల్య వివాహాలు, కుటుంబ కలహాలు, అంటరానితనం, మానవ అక్రమ రవాణా, వరకట్నపు వేధింపులు, ఆత్మహత్యల పట్ల అవగాహన చేసి నిలువరించాలన్నారు. గ్రామం/ వార్డుల్లో మహిళలు, పిల్లలుపై జరుగుతున్న వేధింపులు, ఈవ్ టీజింగ్ , తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పట్ల ఎప్పటికప్పుడు సమాచారం కల్గివుండి వీటి నియంత్రణ కోసం సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సహకరించాలన్నారు. మహిళలు, పిల్లల శ్రేయస్సులో భాగంగా వారి ఆరోగ్య పరిస్థితులుపై ఎప్పటికప్పుడు సమాచారం కల్గి ఉండాలన్నారు. ప్రభుత్వ సంకల్పం... పోలీసుశాఖ ప్రతిష్ట తగ్గకుండా మహిళలు, పిల్లలకు అండగా ఉండాలన్నారు. అనంతరం ఈ రెండు వారాల శిక్షణలో వారాంతం నిర్వహించిన ఇండోర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 9 మంది మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో డి.టి.సి డీఎస్పీ లక్ష్మీనాయుడు, పి.టి.సి డీఎస్పీలు జె మల్లికార్జునవర్మ, అమరనాథ్ నాయుడు, సి.ఐ లు అరుణ, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.